యాదాద్రి క్షేత్రంలో శాస్త్రోక్తంగా అధ్యయనోత్సవాలు

ABN , First Publish Date - 2020-12-27T05:53:29+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో అధ్యయనోత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి.

యాదాద్రి క్షేత్రంలో శాస్త్రోక్తంగా అధ్యయనోత్సవాలు
బాలాలయంలో వేణుగోపాలస్వామి అలంకారంలో నృసింహుడు

ఉదయం వేణుగోపాలుడిగా దర్శనం

సాయంత్రం గోవర్ధనగిరిధారిగా విహారం

యాదాద్రి టౌన్‌, డిసెంబరు 26: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో అధ్యయనోత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు శనివారం ఉదయం యాదాద్రీశుడు వేణుగోపాలుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. బాలాలయంలో సాయంత్రం వేళ దీనజన సంరక్షణ కోసం భగవానుడు శ్రీకృష్ణుడి లీలా ఘట్టం గోవర్ధనగిరిధారిగా నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. బాలాలయ కల్యాణమండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పూల మాలలతో దివ్యమనోహరంగా వేణుగోపాలుడిగా అలంకరించారు. అనంతరం బాలాలయ కల్యాణమండపంలో రుత్వికుల వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగించారు. ఈ సందర్భంగా నాలాయిర దివ్యప్రబంధం, వేదపఠనం చేశారు. అంతకుముందు బాలాలయ కల్యాణమండపంలో లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని, పరమ భక్తాగ్రేసరుడు నమ్మాళ్వార్‌కు హోమ పూజలు, స్నపన తిరుమంజనాలు నిర్వహించారు. శ్రీకృష్ణ పరమాత్మ అలంకార వైభవాన్ని ఆచార్యులు భక్తులకు వివరించారు. సాయంత్రం గోవర్ధనగిరిధారి అలంకారంలో నృసింహుడు దర్శనమిచ్చారు. ఈ వేడుకలను దేవస్థానాచార్యులు సందుగుల రాఘవాచార్యులు, ప్రధానార్చకుడు నల్లన్‌థిఘళ్‌ లక్ష్మినరసింహాచార్యులు, మరింగంటి మోహనాచార్యులు, అర్చకులు నిర్వహించారు.


శాస్త్రోక్తంగా తిరుప్పావై పర్వాలు

యాదాద్రీశుడి సన్నిధి, అనుబంధ పాతగుట్ట ఆలయంలో ప్రభాతవేళ తిరుప్పావై వ్రత పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. గోదాదేవిని దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకస్వాములు బాలాలయ మండపంలో ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. అంతనరం తిరుప్పావై పాశుర పఠనం చేసి పాశుర సారాన్ని భక్తులకు ఆచార్యులు వివరించారు. కాగా, స్వామి వారికి నిత్యారాధనలు ఘనంగా జరిగాయి. వేకువజామున సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచారు. మండపంలో ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసిదళాలతో సహస్రనామార్చనలు చేశారు. కొండపైన రామలింగేశ్వరుడి ఉపాలయంలో చరమూర్తులను కొలుస్తూ పూజారులు శైవ సంప్రదాయరీతిలో నిత్యపూజలు నిర్వహించారు. అదే విధంగా హరిహరులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తజనులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో యాదాద్రి క్షేత్రంలో సందడి కనిపించింది. యాదాద్రీశుడిని ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే చందూలాల్‌ కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T05:53:29+05:30 IST