సర్వే తెచ్చిన తంటా
ABN , First Publish Date - 2020-11-26T06:26:30+05:30 IST
వానాకాలం సీజన్‌లో సాగు చేసిన పంటల వివరాలు ఆన్‌లైన్‌లో లేకపోవడం తో రైతులు సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించలేకపోతున్నారు.

ఆన్‌లైన్‌లోపేరు లేక కొనుగోలుకు నిరాకరణ
సీసీఐ కేంద్రాల వద్ద రైతులకు చుక్కెదురు
దళారులకు విక్రయించి నష్టపోతున్న రైతులు
ఈ పత్తిరైతు పేరు గనగాని అయిలేను. సొంత భూమి నాలుగు ఎకరాలతో పాటు మరో ఆరు ఎకరా ల భూమి కౌలుకు తీసుకుని పత్తి సాగుచేశాడు. పం టల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు పాస్‌పుస్తకం జీరాక్స్ కాపీని ఏఈవోకు ఇచ్చాడు. అతడు పత్తి విక్రయించేందుకు అనాజిపురం సీసీఐ కేంద్రానికి వెళ్లగా ఆన్‌లైన్‌లో పేరు లేదు, పత్తి కొనుగోలు చేయమ ని చెప్పడంతో అవాక్కయ్యాడు. పత్తి లోడ్ కూలీలు, రవాణా చార్జీలు మీదపడుతాయని వేరే రైతును బతిమిలాడి అతడి పేరున పత్తి విక్రయించాడు. ఆన్‌లైన్‌లో పేరు లేకపోవడంతో నాణ్యత గా ఉన్న సుమారు 30 క్వింటాళ్ల పత్తిని ప్రైవేటు వ్యాపారికి క్వింటా రూ.5400 చొప్పున విక్రయించి రూ.11,250నష్టపోయాడు. అటు సీసీఐ కేంద్రంలో విక్రయిం చే అవకాశంలేక, తక్కువ ధరకు తెగన్మలేక 15 క్వింటాళ్ల పత్తిని ఇంట్లోనే నిల్వచేశాడు. ఇలా చాలామంది రైతుల పేర్లు ఆన్‌లైన్‌లో లేవు.
మోత్కూరు, సూర్యాపేట సిటీ: వానాకాలం సీజన్‌లో సాగు చేసిన పంటల వివరాలు ఆన్‌లైన్‌లో లేకపోవడం తో రైతులు సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించలేకపోతున్నారు. రైతు సమగ్ర సర్వే సందర్భంగా ఏఈవోలకు పంటల వివరాలు ఇచ్చినప్పటికీ ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేయలేదని పలువురు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో రైతు పేరు, పంట సాగు విస్తీర్ణం ఉంటేనే సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేస్తారు. ఆన్‌లైన్‌లో పేరు లేని వారి నుంచి పత్తి కొనుగోలు చేయకుండా వెనక్కు పంపుతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. కొన్ని చోట్ల రైతులు ఒక పంటకు బదులు మరో పంట సాగుచేసినట్టు ఆన్‌లైన్‌లో ఉండటంతో సమస్యలు ఉత్పనం అవుతున్నాయి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సుమారు 2లక్షల మందికిపైగా రైతులు ఉన్నారు. అందులో 75,500 మందికిపైగా పత్తి రైతులు ఉన్నారు.
మోత్కూరు మునిసిపాలిటీ పరిధిలోని జామచెట్లబావి గ్రామంలో 70నుంచి 80 మంది రైతులు పత్తి సాగుచేశారు. అందులో 30నుంచి 40మంది రైతుల పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. దాచారం గ్రామంలో 273 సర్వే నంబర్‌లో సుమారు 50 మంది రైతులు 80ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఆ సర్వేనంబరులోని మొత్తం భూమి నాన్ డీఎస్ కింద ఉండి వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించకపోవడంతో స్థానిక వ్యవసాయాధికారులు ఆ రైతుల పంటల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయలేకపోయారు. దేవాలయాల భూములు, బునాదిగాని కాల్వకు పోయిన భూమి, వివాదాస్పదంగా ఉండి పాస్ పుస్తకాలు పెం డింగ్‌లో ఉంచిన భూముల్లో సాగు చేసిన పంటల వివరాలు కూడా ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూరు (ఎం) తదితర మండలాల్లో పలువురు రైతులు సొంత భూ మికి తోడు కౌలుకు తీసుకుని పత్తి సాగుచేశారు. కౌలు రైతుల వివరాలు ప్రభుత్వ నిబంధన ల ప్రకారం నమోదు కాలేదు. ఇటు సొంత భూమి, అటు కౌలు భూమి వివరాలు ఆన్‌లైన్ లేక రైతులు పత్తిని దళారులకు విక్రయించాల్సి వస్తోంది.సీసీఐ కేంద్రంలో క్వింటాకు రూ.5775 చెల్లిస్తుండగా, దళారులు రూ.4500 నుంచి రూ.5000 ఇస్తున్నారు.
15 రోజుల్లోనే నమోదు చేయాలనడంతో...
వానాకాలం సీజన్‌లో పంటల వివరాల నమోదుకు 15 రోజుల సమయమే ఇవ్వడంతో ఒత్తిడిలో ఏఈవోలు రైతులందరి పేర్లు నమోదు చేయలేకపోయినట్టు తెలిసింది. వాస్తవానికి వీఆర్వో లేదా, వీఆర్‌ఏల సహాయంతో క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు ఏ పంట సాగుచేశారో స్వయంగా చూసి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. అయితే వీఆర్వోలు, వీఆర్‌ఏలు సహకరించలేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. దీంతో కార్యాలయాల్లో కూర్చుని తమ వద్దకు వచ్చి చెప్పిన వారి పేర్లను మాత్రమే ఏఈవోలు నమోదు చేశారు. దీంతో పత్తి ఎలా విక్రయించాలో అని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయి పరిశీలన చేసి స్థానిక వ్యవసాయాధికారులతో ధ్రువీకరణ పత్రాలు ఇప్పించి వాటి ఆధారంగా సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇతరులపై ఆధారపడుతున్న పత్తి రైతులు
సూర్యాపేట జిల్లాలో పత్తి సాధారణ విస్తీర్ణం 18,895 ఎకరాలు కాగా, ఈ ఏడాది వానకాలంలో 1.49లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఇటీవల కురిసన వర్షాలకు 8,057 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పంటల సర్వేలో ఆన్‌లైన్‌లో పేరు నమోదు కాకపోవడంతో రైతులు పత్తిని సీసీఐ కేంద్రాలకు తెచ్చి విక్రయించకుండానే తిరిగి వెళ్లిపోవాల్సి వస్తోంది. దీంతో ఇంటి దగ్గర ఇరుగుపొరుగు రైతులను బతిమాలుకోని వారి సహాయంతో కొందరు పత్తి విక్రయిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, తిరుమలగిరి, చింతపాలం, హుజుర్‌నగర్ ప్రాంతాల్లో సీసీఐ ఆధ్వర్యంలో ఆరు పత్తి కొనుగోలు కేంద్రాలు ఈ నెల 13న ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 2,500 మంది రైతులకు చెందిన 56,200 క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది.
ఏఈవోకు వివరాలు చెప్పినా ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు : బొమ్మగాని లక్ష్మీ, పత్తి రైతు, జామచెట్లబావి
నాలుగున్నర ఎకరాల్లో పత్తి సాగు చేశా. పంటల వివరాలు స్థానిక ఏఈవోకు ఇచ్చా. ఇప్పుడు ఆన్‌లైన్‌లో నాపేరు లేదు. పత్తి విక్రయించేందుకు వెళ్తే ఆన్‌లైన్‌లో పేరుంటేనే సీసీఐ కేంద్రంలో కొనుగోలు చేస్తామంటున్నారు. ఇప్పుడు పత్తి ఎలా విక్రయించాలో తెలియడం లేదు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం : కె.స్వప్న, ఏవో, మోత్కూరు
ఏఈవోలకు సమాచారం ఇచ్చిన రైతుల పంటల వివరాలు నమోదు కాలేదనడం అవాస్తవం. రైతులు వివరాలు ఇచ్చినా, నాన్ డీఎస్ కింద ఉన్న భూముల వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించక నమోదు కాలేదు. ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు కాని నిజమైన రైతులు, కౌలు రైతులు పంటను విక్రయించేందుకు పడుతున్న ఇబ్బందులను జిల్లా వ్యవసాయాధికారి, మార్కెటింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లాం. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నందున రెండు, మూడు రోజుల్లో ఏదో నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతులు ఓపిక పట్టాలి.
ఏఈవో ధ్రువీకరణతో విక్రయించవచ్చు
నల్లగొండ: పార్ట్-బీ సమస్యతో పాటు ఇతర కారణాలతో ఆన్‌లైన్‌లో పేర్లు నమోదుకాని రైతులకు సంబంధించి పత్తి విక్రయానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులు గురువారం నుంచి ఏఈవోల వద్ద ధ్రువీకరణ పత్రాలు పొంది సీసీఐ కేం ద్రాల్లో పత్తి విక్రయించే అవకాశాన్ని కల్పించింది. పేరు నమోదు కాని రైతులు పత్తి విక్రయానికి ఇబ్బందులు పడుతుండగా, ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.