సమ్మె సక్సెస్‌

ABN , First Publish Date - 2020-11-27T05:59:30+05:30 IST

రైతులు, కార్మికులపట్ల కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గురువారం చేపట్టిన సమ్మె విజయవంతమైంది.

సమ్మె సక్సెస్‌
సమ్మెలో భాగంగా నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట బైఠాయించిన కార్మిక, ఉద్యోగ సంఘాలు, వామపక్ష నేతలు

కదిలిన కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు

నిరసనలో పాల్గొన్న ఆరు లక్షల మంది

వామపక్ష నేతల అరెస్టు

ఆర్టీసీ, వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం

నల్లగొండ, నవంబరు 26(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/ యాదాద్రి, సూర్యాపేటటౌన్‌: రైతులు, కార్మికులపట్ల కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గురువారం చేపట్టిన సమ్మె విజయవంతమైంది. ఉమ్మడి జిల్లాలోని 650 పరిశ్రమల నుంచి 75వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొనగా, కర్షకులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశాలు, అంగన్‌వాడీలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మొత్తంగా సుమారు ఆరు లక్షల మంది సమ్మె పిలుపులో భాగస్వాములయ్యారు. గురువారం ఉదయం 4 నుంచి 10 గంటల వరకు ఆర్టీసీ కార్మికులు, వ్యాపారులు సహకరించి బంద్‌ పాటించారు. ఆ తరువాత పోలీసులు రంగప్రవేశం చేసి నేతలను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించగా, పలు రంగాల్లో సేవలు తిరిగి కొనసాగాయి. రైస్‌, భవన నిర్మాణ రంగాల్లో నూరు శాతం పనులు నిలిచిపోయాయి. సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు, వామపక్ష నేతలు నల్లగొండ క్లాక్‌ టవర్‌ సెంటర్‌లో మధ్యాహ్నం బహిరంగ సభ నిర్వహించారు. ఉమ్మ డి జిల్లాలోని అన్ని పట్టణాల్లో, మండ ల కేంద్రాల్లో కార్మిక సంఘాల నేతలు బైక్‌ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరితో పాటు చౌటుప్పల్‌, ఆలేరు, మోత్కూ రు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, రామన్నపేట పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో రైతులు, కార్మికులు ర్యాలీలు నిర్వహించారు. గ్రామీణ బంద్‌కు సీపీఎం, సీపీఐ, టీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సతో పాటు వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. భువనగిరి పట్టణంలో సాయిబాబ ఆలయం నుంచి జగ్జీవన్‌రామ్‌ చౌరస్తా వరకు భారీ ర్యాలీ జరిగింది. సూర్యాపేట ఆర్టీసీ డిపో ఎదుట వామపక్షాలు, వివిధ సంఘాలు, ఆర్టీసీ కార్మికులు బైఠాయించి బస్సులను నిలిపివేశారు. మునిసిపల్‌ కార్మికులు, టీఎన్‌జీవోలు, ఆటో డ్రైవర్లు సమ్మెలో పాల్గొన్నారు. వామపక్షాలు, సంఘాలు జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్‌ నుంచి భారీ ర్యాలీ నిర్వహించాయి.

Updated Date - 2020-11-27T05:59:30+05:30 IST