నిలకడగా సాగర్ నీటిమట్టం
ABN , First Publish Date - 2020-11-27T05:37:59+05:30 IST
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం 589.50అడుగుల వద్ద నిలకడగా ఉంది.

నాగార్జునసాగర్/నవంబరు 26: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం 589.50అడుగుల వద్ద నిలకడగా ఉంది. సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు (312.0450టీఎంసీలు) కాగా సాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి 7686 కూసెక్కులు నీరు వచ్చి చేరుతుంది. సాగర్ ప్రాజెక్ట్ నుంచి కుడి కాల్వకు 7086క్యూసెక్కుల నీటిని, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 600క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ కాలువకు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా ఏటువంటి నీటి విడుదల లేదు. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 7686 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుండగా, అంతే నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి విడుదల చేస్తున్నారు. నివర్ తుపాను ప్రభావంతో కృష్ట పరివాహక ప్రాంతంలో ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రా జెక్ట్‌లకు వరద రాక కొనసాగే అవకాశముందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. తుపాన్ ప్రభావం ఇలాగే మరో నాలుగైదు రోజులపాటు కొనసాగితే ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండిన ప్రా జెక్ట్‌లకు వరద నీరు వచ్చి చేరితే కృష్ణ పరివాహక ప్రాంతంలో మరోసారి ప్రాజెక్ట్‌ల గేట్లు ఎత్తే అవకాశముంటుంది. కేతేపలిలోని మూసీ రిజర్వాయర్ నీటిమట్టం 644.35 అడుగుల వద్ద నిలకడగా ఉంది. నివర్ తుపానుతో ఎగువ మూసీ పరివాహక ప్రాంతాలు, హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్టుకువచ్చే వరద తాకిడిని తట్టుకోవడానికి అనుగుణంగా దిగువ మూసీకి కొంత నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి కేవలం 400క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే ఉన్నా ముందు జాగ్రత్తగా ప్రాజెక్టు రెండు క్రస్టుగేట్లు ఎత్తి 2500క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి విడుదల చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు గురువారం ఎగువ నుంచి వరద స్వల్పంగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 (45.77 టీఎంసీలు) అడుగులు. ప్రస్తుత్తం 174.80(45.46టీఎంసీలు) అడుగులకు చేరుకుంది.