భౌతిక(బహు)దూరం

ABN , First Publish Date - 2020-05-30T09:29:44+05:30 IST

భౌతిక దూరం, బహుదూరమైంది. కరోనా వైరస్‌ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని

భౌతిక(బహు)దూరం

సర్కారు సడలింపులతో నిబంధనలకు తూట్లు

దుకాణాల ఎదుట గుంపులుగా ప్రజలు

ద్విచక్రవాహనాలపై ముగ్గురి ప్రయాణం

రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు

కానరాని శానిటైజేషన్‌, మాస్క్‌లు 


(ఆంధ్రజ్యోతి, సూర్యాపేట): భౌతిక దూరం, బహుదూరమైంది. కరోనా వైరస్‌ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేసినా, ప్రజలు పట్టించుకోవడం లేదు. వైరస్‌ వ్యాప్తి తొలిరోజుల్లో పకడ్బందీ చర్యలు చేపట్టినా, రానురాను సడలింపులతో నియంత్రణపై ఆశలు సన్నగిల్లుతూ వచ్చాయి. ఇప్పటికే జిల్లాలో పదుల సంఖ్యలో కరోనా వైరస్‌ భారిన పడగా, మరిన్ని కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో కలిసికట్టుగా వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు భౌతిక దూరం పాటించాలని ఇటు అధికారులు, అటు పోలీసులు చెబుతున్నా, ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడంలేదు. 


కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ, ప్రజల నిర్లక్ష్యంతో రానురాను పరిస్థితులు మరింత జఠిళంగా మారే అవకాశాలున్నాయని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలకు ప్రభుత్వం సడలింపు ఇవ్వడంతో గుంపులు గుంపులుగా దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. జిల్లాలోని కొన్ని దుకాణ నిర్వాహకులు మాత్రమే దుకాణాలకు అడ్డంగా ప్లాస్టిక్‌ వైర్లు కట్టి లోపలికి రాకుండా చేస్తున్నారు. ఇతర ఫ్యాన్సీ, కిరాణ, మెడికల్‌ దుకాణాల వద్ద భౌతిక దూరం కానరావడంలేదు. ఇప్పటికే జిల్లాలో 84 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఈ మహమ్మారి బారిన పడి నాలుగు నెలల బాలుడు మృతిచెందాడు. 83 మంది గాంధీ అస్పత్రిలో చికిత్స పొంది కోలుకొని ఇంటిదారిపట్టారు. ఒకదశలో రాష్ట్రంలోనే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్యలో సూర్యాపేట ద్వితీయ స్థానంలో నిలిచింది.


దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక బృందాన్ని కూడా సమీక్షకు పంపింది. ఏప్రిల్‌ 22 తర్వాత కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కడా లేకుండా పోయాయి. తాజాగా సూర్యాపేట మండలం కాసరబాద గ్రామంలో నాలుగు నెలల బాబుకు కరోనా పాజిటివ్‌ వచ్చి గాంధీ అస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ బాలుడు తల్లికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది. మొత్తం మీద జిల్లాలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణంలో ఇంకా నిర్లక్ష్య ఛాయలే కానవస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


అనుమతి ఒక్కరికే.. ప్రయాణించేది ముగ్గురా ?

జిల్లాలో ద్విచక్ర వాహనదారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అనేక సడలింపులు ఇచ్చినప్పటికీ ప్రతి ద్విచక్రవాహనంపై కేవలం ఒక్కరు మాత్రమే ప్రయాణించాల్సి ఉంది. సూర్యాపేట జిల్లాకేంద్రంతో పాటు కోదాడ, హూజూర్‌నగర్‌లో సైతం ముగ్గురు ప్రయాణిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పోలీసులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇక దుకాణాల వద్ద మాస్కులు లేకుండానే కొనుగోలు చేస్తున్నారు. అమ్మేవారితోపాటు కొనుగోలు చేసే వారు కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. కూరగాయల దుకాణాల వద్ద కూడా భౌతికదూరం లేకుండా ఉండడం, మాస్కులు లేకుండా కొనుగోలు చేస్తున్నారు. 


ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ అదే తంతు

ప్రైవేట్‌ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో దాదాపు అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు తెరుచుకున్నాయి. వాటితో పాటు స్కానింగ్‌ సెంటర్లు, ఏక్స్‌రే, రక్త పరీక్షా కేంద్రాలు కూడా అనుబంధంగా తెరుచుకున్నాయి. అనేకమంది ఆస్పత్రులతో సంబంధం లేకుండానే రక్త పరీక్ష కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మొదట్లో శానిటైజర్లు ఉంచేవారు. ప్రతి రోగికి శానిటైజేషన్‌ పూర్తయిన తర్వాతనే డాక్టర్లు చూసేవారు. రోగుల సంఖ్య పెరుగుతున్నా కొద్ది డాక్టర్లు శానిటైజేషన్‌ మరిచారు. ఇక ఏక్స్‌రే, స్కానింగ్‌ సెంటర్ల వద్ద రోగులు కిటకిటలాడుతున్నారు. ఇక్కడ భౌతికదూరం కూడా కనిపించడంలేదు. కీలక సమయంలో ప్రజలు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. 


సడలింపు తర్వాత జాగ్రత్తగా ఉండాలి: డాక్టర్‌ రాంమూర్తి యాదవ్‌ 

లాక్‌డౌన్‌ సమయంలో ప్రతీ ఒక్కరు ఇంట్లో ఉండడం వల్ల కరోనా వ్యాధి వ్యాప్తి జరగలేదు. ఇప్పుడు ఇంకా కీలకమైన సమయం. లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తూ మాస్కులు ధరించాలి. భౌతికదూరం పాటించాలి. రానున్న వర్షాకాలంలో వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున మరింత అప్రమత్తత అవసరం. 


Updated Date - 2020-05-30T09:29:44+05:30 IST