ఆర్టీసీ రథసారధులపై పనిభారం

ABN , First Publish Date - 2020-12-07T05:47:52+05:30 IST

ఆర్టీసీలో పదేళ్లుగా ఎలాంటి నియామకాలు లేవు. దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పడుతోంది. 8 గంటలకు బదులు 10 నుంచి 12గంటలపాటు విధులు నిర్వహించాల్సి వస్తోంది.

ఆర్టీసీ రథసారధులపై పనిభారం

పదేళ్లుగా భర్తీకాని పోస్టులు

విశ్రాంతికి కూడా సమయం ఇవ్వని అధికారులు

పరిష్కారానికి నోచుకోని సమస్యలు

(ఆంధ్రజ్యోతి, సూర్యాపేట, యాదాద్రి)/ మిర్యాలగూడ, కోదాడ రూరల్‌, దేవరకొండ, నల్లగొండ అర్బన్‌ : ఆర్టీసీలో పదేళ్లుగా ఎలాంటి నియామకాలు లేవు. దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పడుతోంది. 8 గంటలకు బదులు 10 నుంచి 12గంటలపాటు విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఉద్యోగ విరమణతో ఖాళీలు ఏర్పడుతుండగా, వాటిని భర్తీ చేయడం లేదు. దీంతో ఒక్కోసారి డబుల్‌ డ్యూటీ కూడా చేయాల్సి వస్తోంది. ఫలితంగా ఉద్యోగులు బీపీ, షుగర్‌ వంటి అనారోగ్యాలబారిన పడుతున్నారు. ఒత్తిడికి తట్టుకోలేక ఇటీవల గుండెపోటుతో డ్రైవర్లు మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాలంతీరిన బస్సులతో కేఎంపీఎల్‌ సాధించాలని డ్రైవర్లు, ఈపీబీ కోసం కండక్టర్లపై ఒత్తిడి పెరిగింది. నిరవధిక సమ్మె విరమణ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఇదేంటని ప్రశ్నించే యూనియన్లను సమ్మె సమయంలో ప్రభుత్వం రద్దుచేసింది. ఫలితంగా అధికారుల ఇష్టారాజ్యమైంది. ఇటీవల కోదాడ డిపోలో అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని ఉద్యోగులు ధర్నా చేయాల్సి వచ్చింది.

మిర్యాలగూడ ఆర్టీసీ డిపో పరిధిలో 119 బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. డిపో షెడ్యూల్‌ ప్రకారం రోజుకు 52 వేల కిలోమీటర్లు ఈ బస్సులు ప్రయాణించాల్సివుంది. డిపోలో డ్రైవర్లు 196 మంది, కండక్టర్లు 174, గ్యారేజి సిబ్బంది 66, సెక్యూరిటీ గార్డులు ఆరుగురు, ఆఫీస్‌ సిబ్బంది 10 మంది మొత్తంగా 452 విధులు నిర్వహిస్తున్నారు. కోదాడ డిపో పరిధిలో మొత్తం 110 బస్సులు ఉన్నాయి. రోజుకు 32,700కి.మీ ప్రయాణిస్తున్నాయి. 15 బస్సులకుపైగా కండీషన్‌లో లేవు. ఇవి ఎక్కడ నిలిచిపోతాయో తెలియని పరిస్థితి. డిపో పరిధిలో 365 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దేవరకొండ డిపోలో 104 బస్సులకు 409 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అందులో 164 మంది డ్రైవర్లు, 173 మంది కండక్టర్‌లు ఉన్నారు. 25 మంది మహిళా కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఫ సూర్యాపేట డిపోలో 130 బస్సులు ఉన్నాయి. మొత్తం 590 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో మహిళా సిబ్బంది 80 మంది. ఇక్కడ 15పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యాదగిరిగుట్ట డిపోలో 101 బస్సులు నడుస్తున్నాయి. ఇక్కడ 170 మంది కండక్టర్లు, 180 మంది డ్రైవర్లు, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 450మంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు 37వేల కి.మీ బస్సులు ప్రయాణిస్తున్నాయి.


విశ్రాంతి లేకుండా డ్యూటీలు

డ్రైవర్లకు డ్యూటీ ముగిశాక 9గంటలపాటు విశ్రాంతి అవసరం. వారికి డబుల్‌ డ్యూటీలు కూడా కేటాయిస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కోదాడ-హైదరాబాద్‌కు ప్రయాణ సమయం 3గంటలు ఇచ్చేవారు. ప్రస్తుతం దాన్ని 2.30గంటలకు తగ్గించారు. సమయం తగ్గించి ట్రిప్పుల సంఖ్య పెంచారు. దీంతో డ్రైవర్లపై ఒత్తిడి పడుతోంది. ఖమ్మం-కోదాడకు గతంలో ప్రయాణ సమయం 1గంట ఇవ్వగా, దాన్ని 40 నిమిషాలకు తగ్గించారు. ఇక డ్యూటీ కోసం ఉదయం 5గంటలకు డిపోకు వస్తే 8 వరకు దిక్కు ఉండటం లేదు. దీంతో అదనంగా 11 నుంచి 12గంటలు పనిచేయాల్సి వస్తోంది. అదనపు సమయంతో మహిళా కండక్టర్లు రాత్రివేళ ఇబ్బందులు పడుతున్నారు. సెలవులు సైతం ఇవ్వడంలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. నూతనంగా వచ్చిన సీఐ వేధింపులకు గురిచేస్తున్నారని, మహిళా కండక్టర్లతో 12గంటలు డ్యూటీ చేయిస్తున్నారని ఇటీవల కోదాడలో ఉద్యోగులు ఆందోళన కూడా చేశారు. లాక్‌డౌన్‌కు ముందు దేవరకొండ-హైదరాబాద్‌కు వెళ్లే డీలక్స్‌ బస్సులు రెండు ట్రిప్పులకు మాత్రమే డ్యూటీలు వేసేవారు. ప్రస్తుతం మూడో ట్రిప్పునకు సైతం వెళ్లాల్సి వస్తోంది. డ్రైవర్లకు టికెట్‌ ఇష్యూ(టిమ్స్‌) డ్యూటీ అదనం.


పరిష్కారానికి నోచుకోని సమస్యలు

ఆర్టీసీ ఉద్యోగులకు చెందిన పీఎఫ్‌, సీసీఎస్‌, ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌పీటీకి సంబంధించిన యాజమాన్యం చెల్లించాల్సిన వాటా జమకావడంలేదు. 2016లో ఉద్యోగులకు ఇచ్చిన బాండ్ల గడువు తీరినా డబ్బులు చెల్లించలేదు. 2017 వేతన ఒప్పందం అమలు కాలేదు. ప్రతి నెల 1న అందాల్సిన వేతనాలు 10వ తేదీ వరకు కూడా బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదు. అదే విధంగా విధుల కేటాయింపుల్లో కూడా నిబంధనలు పాటించకుండా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో సమస్యలపై చర్చించే యూనియన్లను నిరవధిక సమ్మె సమయంలో ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం లేకుండాపోయింది. యూనియన్లు లేకపోవడంతో సమస్యలను వెల్ఫేర్‌ సంఘం దృష్టికి తీసుకెళ్తే అవి పరిష్కారం కాకపోగా, టార్గె ట్‌ చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కార్మికులపై పనిభారం తగ్గించాలి : టి.పాండురంగయ్య, ఎంప్లాయిస్‌ యూనియన్‌ నల్లగొండ డివిజన్‌ కార్యదర్శి

సంస్థలో కిలోమీటర్ల కోసమే బస్సు ట్రిప్పులు పెంచకుండా, రాబడి పెరిగే అవకాశాలను మెరుగుపరచాలి. ఇంధనం ఆదా, ట్రిప్పుల్లో ఎక్కువ మెత్తాన్ని సాధించాలంటే డ్రైవర్‌, కండక్టర్లపై పని ఒత్తిడి తగ్గించాలి. గ్యారేజీలో మెకానిక్‌ల పోస్టులు భర్తీ చేయాలి. కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. రెండో పేస్కేల్‌, నాలుగోసారి రావల్సిన కరువు భత్యం ఇవ్వాలి. రాబడి లేని రూట్లలో అద్దె బస్సుల ట్రిప్పులను రద్దుచేస్తే ఆర్టీసీపై భారం తగ్గుతుంది.


కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం లేదు : రాజీవ్‌ ప్రేమ్‌కుమార్‌, కోదాడ డిపో మేనేజర్‌

కార్మికులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయడం లేదు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడినపెట్టేందుకు కార్మికులు కొంత శ్రమించాల్సి ఉంటుంది. గతంలో ఉన్న రూట్లలోనే బస్సులు నడుపుతున్నాం. కార్మికులపై అదనంగా పనిభారం మోపడం లేదు. కార్మికులు చెబుతున్న విధంగా ప్రయాణ సమయం తగ్గించామనడంలో ఎలాంటి వాస్తవం లేదు.

Updated Date - 2020-12-07T05:47:52+05:30 IST