వరి నారుమడి యాజమాన్యం ప్రధానం
ABN , First Publish Date - 2020-12-12T05:30:00+05:30 IST
యాసంగిలో వరి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వరి సాగులో నారుమడి యాజమాన్యం చాలా కీలకం. మడి తయారు చేసుకోవడం, విత్తనశుద్ధి, తెగుళ్ల నివారణ జాగ్రత్తలు తీసుకుంటే నారు ఆరోగ్యంగా పెరుగుతుందని కంపాసాగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం, సేద్యపు విభాగ శాస్త్రవేత్త డాక్టర్ భరత్ చెబుతున్నారు.
కేవీకే సేద్యపు విభాగ శాస్త్రవేత్త డాక్టర్ భరత్ సూచనలు
(త్రిపురారం, చౌటుప్పల్ టౌన్)
యాసంగిలో వరి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వరి సాగులో నారుమడి యాజమాన్యం చాలా కీలకం. మడి తయారు చేసుకోవడం, విత్తనశుద్ధి, తెగుళ్ల నివారణ జాగ్రత్తలు తీసుకుంటే నారు ఆరోగ్యంగా పెరుగుతుందని కంపాసాగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం, సేద్యపు విభాగ శాస్త్రవేత్త డాక్టర్ భరత్ చెబుతున్నారు. ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలు ఇలా...
విత్తన మోతాదు, శుద్ధి
- దొడ్డు రకాలయితే ఎకరానికి 25కిలోలు, సన్న రకాలైతే 20 కిలోల విత్తనం సరిపోతుంది.
- మెట్ట నారుమళ్లకు కిలో విత్తనానికి 3గ్రాములు కార్బండిజమ్‌ను తడితో పట్టించి ఆరబెట్టి మడిలో చల్లుకోవాలి.
- దమ్ము చేసిన నారుమడులు అయితే లీటరు నీటికి 1గ్రా. కార్బండిజమ్ కలిపిన ద్రావణంలో 24 గంటలు విత్తనాలను నానబెట్టి ఆ తరువాత మండెకట్టి మొలకలను నారుమడిలో చల్లుకోవాలి.
- తక్కువ నిద్రావస్థ (2-3 వారాలున్న) విత్తనాలకైతే లీటరు నీటికి 63మి.లీ, ఎక్కువ నిద్రావస్థ (4-5 వారాలున్న) విత్తనాలకైతే 10మి.లీ గాఢ నత్రికామ్లం కలిపి, ఆ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి కడిగి మండె కట్టాలి.
నారు పెంపకం
- నారుమడిని బాగా దున్ని 2-3మార్లు దమ్ము చేసి చదును చేయాలి. నీటి కాల్వలు ఏర్పాటు చేయాలి. ఎత్తు నారుమడులను తయారు చేసుకోవడం మంచిది.
- రెండు గుంటల్లోని(5 సెంట్లు) మడిలో విత్తనం చల్లేముందు దుక్కిలో కిలో నత్రజని చల్లాలి. మరో కిలో విత్తిన 12-14రోజులకు చల్లాలి. అదేవిధంగా కిలో భాస్వరం, కిలో పొటాష్ ఇచ్చే ఎరువులు చల్లాలి.
- పశువుల పేడ లేదా ఇతర సేంద్రియ ఎరువులను దుక్కి లో వేసుకంటే మంచి ఫలితాలు వస్తాయి.
- మొలక కట్టిన విత్తనాన్ని చల్లి, వారం రోజుల్లో ఆరు తడులు ఇచ్చాక మొక్క దశలో పలుచగా నీరుంచాలి.
- జింకు లోప నివారణకు లీటరు నీటికి 2గ్రా. జింకు సల్ఫేట్ కలిపి పిచికారి చేయాలి.
- మెట్ట నారుమడిలో ఇనుపధాతు లోపాన్ని గమనిస్తే మొక్క వయసును అనుసరించి అన్నభేది 0.5నుంచి 1గ్రా. నిమ్మ ఉప్పు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
- నారు తీసే ఏడు రోజుల ముందు గుంట నారుమడి(2.5 సెంట్లకు) 400గ్రా. కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు ఇసుకతో కలిపి చల్లి పలుచగా నీరు ఉంచాలి.
- నాటు ఆలస్యమైతే రెండో దఫా నత్రజని ఆలస్యంగా వేసి నారు ముదరక ముందే నాటువేయాలి. ఈ సమయంలో ఆశించే తామర పురుగుల నివారణ చేపట్టాలి.
- నారుమడిలో కలుపు నివారణకు బ్యూటాక్లోర్ లేదా ప్రెటిలాక్లోర్, సేపనర్ 25మి.లీ ఎకరాకు సరిపడా నారుమడికి 5లీటర్ల నీటికి కలిపి, బిస్‌పైరిబాక్ సోడియం కలుపు మందును 0.5మి.లీ లీటరు నీటికి కలిపి నాటు వేశాక 8-10రోజులకు పిచికారీ చేయాలి.
- ఊద, బడిపిలి వంటి గడ్డిజాతి కలుపు ఉంటే నాటేవేసిన 15-20 రోజులకు సైవాలోఫా్‌ప-పీ బ్యూటైల్ మందును 1.5మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
చలికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- రాత్రి ఉష్ణోగ్రతలు 12డిగ్రీలకంటే తగ్గినపుడు నారు సరిగా ఎదగక ఎర్రబడి చనిపోతుంది. దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- రెండు గుంటల నారుమడికి నత్రజని, పొటా్‌షతో పాటు 2క్వింటాళ్ల మాగిన కోళ్ల ఎరువు లేదా గొర్రెల ఎరువు లేదా వర్మి కంపోస్టును కలియదున్నాలి,
- భాస్వరాన్ని దుక్కిలో మోతాదుకు రెట్టింపు వేయాలి. చలి సమస్యను అధిగమించేందుకు నారుమడి చుట్టూ ఇనుప చువ్వలు, వెదురు కర్రలతో ఊతం ఇచ్చి పలుచని పాలీథిన్ కవర్ లేదా యూరియా బస్తాలతో తయారు చేసిన పట్టాలు సాయంత్రం వేళల్లో కప్పి ఉంచి మరుసటి రోజు ఉదయం తీయాలి.
- నారు ఆరోగ్యంగా ఎదిగేందుకు పాటుగా కిలో యూరియాకు 2గ్రా. కార్బండిజమ్, మాంకోజెబ్ మిశ్రమ మందును పిచికారీ చేయాలి.
- రాత్రి వేళ్ల నీరు నిండుగా ఉంచి తెల్లవారు జామున తీసి కొత్త నీరు పెట్టాలి.
- వరి నారును 25-35రోజుల లోపు నాటు వేయాలి. జనవరి చివరి నాటికి నాట్లు పూర్తయ్యేలా చూసుకోవాలి.
- వరి పంట 120-130 రోజుల్లో కోతకు వస్తుంది. నాటు వేశాక 90-100 రోజుల్లో పంట చేతికి వస్తుంది.
- నారుమళ్లకు భద్రత కోసం రంగుల, రంగుల వస్త్రాలు, గాలికి శబ్దం వచ్చేలా ప్లాస్టిక్ కవర్లు కడితే వీటిని చూసి పందులు, కోతులు భయపడుతాయి.
అధిక దిగుబడులు సాధించాలి : ముత్యాల నాగరాజు, చౌటుప్పల్, ఎంఏవో
రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫారసు చేసిన వరి విత్తన రకాలను నారుకోసం వినియోగించి అధిక దిగుబడులు సాధించాలి. దొడ్డు రకాలు ఎంపీయు-1010, కేఎన్‌ఎం-118, జేబీఎల్-24423, ఐఆర్ 64, సన్నరకాలు ఆర్‌ఎన్‌ఆర్ 15048, బీపీటీ సాగుచేయాలి. రైతులు నాణ్యమైన విత్తనాలను విత్తాలి. నారుమళ్లకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే ఏఈవోల నుంచి సలహాలు, సూచనలు పొందాలి.