చినుకమ్మ మిగిల్చిన చేదు జ్ఞాపకం

ABN , First Publish Date - 2020-12-29T05:45:09+05:30 IST

ఈ ఏడాది వ్యవసాయరంగం రైతాంగానికి అంతగా కలిసి రాలేదు. వానాకాలం సీజన్‌ ప్రారంభంలో జూన్‌ మాసంలో సకాలంలో వర్షాలు కురవడంతో రైతులు ఉత్సాహంగా సాగుపనులు ప్రారంభించారు. పంటలు సైతం ఏపుగా పెరిగాయి. కాగా, అక్టోబరు, నవంబరు మాసంలో కురిసిన అకాల వర్షాలతో చేతికి అందివచ్చిన పత్తి, వరి పంటలను దెబ్బతిన్నాయి.

చినుకమ్మ మిగిల్చిన చేదు జ్ఞాపకం

వర్షాలతో దెబ్బతిన పత్తి, వరి పంటలు

సగానికి పడిపోయిన దిగుబడులు

వానాకాలం సీజన్‌లో నష్టపోయిన రైతులు

సన్నరకం వరి సాగుతో రైతుల అష్టకష్టాలు

రైతు బంధు, రైతు బీమాతో కాస్త ఊరట

(నల్లగొండ)

ఈ ఏడాది వ్యవసాయరంగం రైతాంగానికి అంతగా కలిసి రాలేదు. వానాకాలం సీజన్‌ ప్రారంభంలో జూన్‌ మాసంలో సకాలంలో వర్షాలు కురవడంతో రైతులు ఉత్సాహంగా సాగుపనులు ప్రారంభించారు. పంటలు సైతం ఏపుగా పెరిగాయి. కాగా, అక్టోబరు, నవంబరు మాసంలో కురిసిన అకాల వర్షాలతో చేతికి అందివచ్చిన పత్తి, వరి పంటలను దెబ్బతిన్నాయి. దీంతో 40 శాతం మాత్రమే పంటల దిగుబడి వచ్చింది. రైతులకు పెట్టుబడులు కూడా వెళ్లలేదు. వానాకాలం సీజన్‌లో నల్లగొండ జిల్లాలో 7లక్షల 25 ఎకరాల్లో పత్తి సాగు, 3లక్షల 60వేల ఎకరాల్లో వరి సాగైంది.

జిల్లాలో వరి తర్వాత ప్రధానమైన పంట పత్తి. ఆశించిన స్థాయిలో దిగుబడి రాక రైతాంగం నష్టపోయింది. అధిక, వరుస వర్షాలతో పత్తి దెబ్బతిన్నది. లక్ష ఎకరాల పంట నీట మునిగింది. మరో నాలుగు లక్షల ఎకరాల్లో పత్తి తడిచి రంగుమారి నల్లబడింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు క్వింటా పత్తిని రూ.2వేలకే విక్రయించారు. సీసీఐ ఆధ్వర్యంలో 24 జిన్నింగ్‌ మిల్లు కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినా, దిగుబడి లేక కొనుగోళ్లు తగ్గాయి. సీసీఐ కేంద్రాలకు సుమారు 50లక్షల క్వింటాళ్ల పత్తి వస్తుందని అంచనా వేయగా, 16లక్షల 70వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు అయింది.


సన్నాలతో రైతులకు నష్టం

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నియంత్రిత సాగు విధానంతో రైతులు నష్టపోయారు. ప్రభుత్వం చెప్పినట్టు 90శాతం మంది రైతులు సన్నరకం వరిని సాగు చేశారు. అయితే కొనుగోలుకేంద్రాల్లో సన్నరకం ధాన్యాన్ని అనుమతించలేదు. దీంతో రైతులకు మిల్లులే దిక్కయ్యాయి. మిల్లర్లు, దళారులు కేవలం రూ.1400 నుంచి రూ.1500 మాత్రమే ధర చెల్లించారు. దీంతో ఒక్కో రైతు క్వింటాకు రూ.380 మేర నష్టపోయారు. తీరా ప్రభుత్వం ఈ నెల 27న నియంత్రిత సాగు విధానాన్ని రద్దు చేసింది. అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని ప్రకటించడంతో మద్దతు ధర వస్తుందా లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.


రైతు బంధు, రైతు బీమాతో ప్రయోజనం

దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమాతో అన్నదాతలకు కాస్త ఊరట ల భించింది. జిల్లాలో 4,63,922 మంది రైతులకు ప్రస్తుత యా సంగి సీజన్‌లో రూ.611కోట్ల 61లక్షలకు పైగా రైతు బంధు సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఎకరానికి రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం అందుతుండటంతో రైతులకు కొంత ఇబ్బందులు తప్పాయి. అదేవిధంగా రైతు దురదృష్టవశాత్తు మృతి చెందితే అతడి కుటుంబం వీధినపడకుండా ఉండేందుకు రైతు బీమాను ప్రభుత్వం అమలు చేస్తోంది. గుంట భూమి ఉన్న రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుండ గా, రూ.5లక్షల వరకు బీమా వస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు 380కు టుంబాలకు బీమా సొమ్ము అందడంతో రైతుల కుటుంబాలు కాస్త కోలుకున్నాయి.

కేంద్రం నూతన చట్టాలతో ఆందోళన

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టాల తో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు పంటను ఎక్కడైనా విక్రయించవచ్చని చెప్పినా మద్దతు ధరపై స్పష్టత లేదు. దీంతో రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈచట్టాలను రద్దు చేయాలని కోరుతూ నిర్వహించిన బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం సైతం మద్దతు పలికింది. కాగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం చట్టాలకు మద్దతు ప్రకటించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.


బత్తాయి, నిమ్మరైతుల పరిస్థితి దయనీయం

జిల్లాలో సుమారు 65వేల ఎకరాల్లో నిమ్మ, బత్తాయి తోటలు ఉన్నాయి. ఈ ఏడాది బత్తాయి, నిమ్మ రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. కరోనా కారణంగా అంతర్రాష్ట్ర సరిహద్దులు మూయడంతో బత్తాయి ఎగుమతి లేక జిల్లాలోనే రూ.100కు నాలుగు కిలోల చొప్పున కాయలు విక్రయించాల్సి వచ్చింది. గతంలో రైతులు ఢిల్లీ, కలకత్తా, ముంబై తదితర ప్రాంతాలకు బత్తాయిని ఎగుమతి చేసి లాభాలు పొందేవారు. కరోనా కారణంగా మార్కెట్‌ లేక బత్తాయి రైతులు నష్టపోయారు. దీనికి తోడు తెగుళ్లు,  వరద కాల్వల ప్రాంతాల్లో పంటలు జాలు పట్టి చెట్లు చనిపోయాయి.


పంట నాశనమై జీవితం భారమైంది

అప్పుల బాధతో రైతు బలవన్మరణం

కూలి పనులకు వెళుతున్న కుటుంబీకులు

గుర్రంపోడు: గుర్రంపోడు మండలం కొత్తలాపురం పంచాయతీ పరిధిలోని నడ్డివారిగూడానికి చెందిన  నడ్డి రామలింగయ్య(43) 15ఏళ్లుగా పత్తి సాగు చేస్తున్నాడు. అతడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు మూడేళ్ల క్రితం వివాహం కాగా, రూ.4లక్షలు అప్పు అయింది. కుమారుడు ప్రస్తుతం ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రామలింగయ్యకు ఉన్న నాలుగు ఎకరాలకు తోడు 12ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగుచేశాడు. అందుకు రూ.8లక్షలు అప్పు చేశాడు. అతడు ఐదేళ్లుగా పత్తి సాగు చేస్తుండగా, ఈ ఏడాది అధిక వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతిన్నది. కుమార్తె వివాహానికి, వ్యవసాయానికి చేసిన అప్పు మొత్తం రూ.12లక్షలకు పెరగడంతో కొద్దికాలంగా మనోవేదనకు గురయ్యాడు. దీంతో ఈ ఏడాది అక్టోబరు 26న తాను సాగుచేసిన పత్తి చేనులోనే పురుగుమందు తాగాడు. దీన్ని గమనించిన తోటి రైతులు కుటుంబ సభ్యులకు సమాచారమివ్వగా, అప్పటికే అతడు మృతిచెందాడు. ఇక ఇంటి పెద్ద మృతిచెందటంతో అతడి భార్య, కుమారుడు ప్రస్తుతం కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు.


యాదాద్రిలో 5.13లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు

రైతులకు రూ.236.36కోట్ల చెల్లింపులు

యాదాద్రి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): యాదా ద్రి భువనగిరి జిల్లాలో పత్తి కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లాలో 1.74లక్షల ఎకరాల్లో పత్తి సాగుకాగా, సీసీఐ ఆధ్వర్యంలో 14 కొనుగోలు కేంద్రా లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా ఈ నెల మూడో వారం చివరి నాటికి 5లక్షల 13వేల 133 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగాయి. 22,202 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన ఈ పత్తికి సీసీఐ రూ.291కోట్ల 97లక్షల 26వేల 770 చెల్లించాల్సి ఉంది. అందులో ఇప్పటి వరకు రూ.236కోట్ల 36లక్షల 4వేల 931లను 18,935 మంది రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమైంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తికి ఇప్పటి వరకు 81శాతం చెల్లింపులు జరిగాయి. ఇంకా 3,267 మంది రైతులకు రూ.55కోట్ల 61లక్షల 21వేల 839 చెల్లించాల్సి ఉంది.

Updated Date - 2020-12-29T05:45:09+05:30 IST