ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రిజిస్ట్రేషన్ల జోరు
ABN , First Publish Date - 2020-12-30T06:32:25+05:30 IST
ఎల్‌ఆర్‌ఎస్ లేకుండానే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో క్రయ విక్రయదారుల్లో ఉత్సాహం నెలకొంది.

ఎల్‌ఆర్‌ఎ్‌సకు బ్రేక్‌తో ఆస్తుల క్రయ, విక్రయదారుల్లో ఉత్సాహం
ఎల్‌ఎఆర్‌ఎస్ దరఖాస్తు రుసుమును ప్రభుత్వం చెల్లించేనా?
నల్లగొండ, డిసెంబరు 29: ఎల్‌ఆర్‌ఎస్ లేకుండానే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో క్రయ విక్రయదారుల్లో ఉత్సాహం నెలకొంది. ధరణి, ఎల్‌ఆర్‌ఎస్ సమస్యతో నాలుగు నెలలుగా ఆస్తుల అమ్మకం, కొనుగోలు దారులతో పాటు రియల్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. కొంత కాలం పాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయగా, ఆ తరువాత ఎల్‌ఆర్‌ఎస్ తీవ్ర అడ్డంకిగా మారింది. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులతో పాటు వ్యతిరేకతను గమనించిన ప్రభుత్వం ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం ఎల్‌ఆర్‌ఎస్ లేకుండానే రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశాలు జారీ చేయడం ఊరట కలిగించింది. ఎల్‌ఆర్‌ఎస్ సమస్యతో సందిగ్ధంలో పడిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రభుత్వం నిర్ణయంతో ఇక ఊపందుకోనుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా, గతంలో నిత్యం వెయ్యి డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగేవి. ధరణితో పాటు ఎల్‌ఆర్‌ఎస్ కారణంగా 50 డాక్యుమెంట్లు కూడా రిజిస్ట్రేషన్లకు నోచుకోలేదు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై రిజిస్ట్రేషన్ల ఊపందుకోనున్నాయి. ఇదిలా ఉంటే ఎల్‌ఆర్‌ఎస్ కోసం ప్రభుత్వం రూ.1250ను చొప్పున మీ-సేవ ద్వారా రుసుము వసూలు చేసింది. ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్ రద్దు అయినందున రిజిస్టర్ రుసుమును తిరిగి చెల్లిస్తుందా లేదా అనే సందేహం నెలకొంది.