వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తొలగని సందిగ్ధం
ABN , First Publish Date - 2020-12-04T05:18:59+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం అమలులో భాగం గా రిజిస్ట్రేషన్ల సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఆస్తుల రిజిస్ట్రేషన్లలో పారదర్శకత కోసం ప్రతీ రిజిస్ట్రేషన్‌ను ధరణి పోర్టల్ ద్వారా చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ద్వారా తహసీల్దార్ కార్యాలయాల్లో పలు అవాంతరాల నడుమ ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై మాత్రం మూడు నెలలుగా సందిగ్ధం నెలకొనగా, ఆస్తుల క్రయ, విక్రయదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

ధరణిలోనా.. కార్డ్ పద్ధతా?
ఎస్‌ఆర్‌వోల ట్రయల్ రన్
సీఎం ఆదేశాల మేరకే తుది నిర్ణయం
యాదాద్రి, డిసెంబరు3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం అమలులో భాగం గా రిజిస్ట్రేషన్ల సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఆస్తుల రిజిస్ట్రేషన్లలో పారదర్శకత కోసం ప్రతీ రిజిస్ట్రేషన్‌ను ధరణి పోర్టల్ ద్వారా చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ద్వారా తహసీల్దార్ కార్యాలయాల్లో పలు అవాంతరాల నడుమ ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై మాత్రం మూడు నెలలుగా సందిగ్ధం నెలకొనగా, ఆస్తుల క్రయ, విక్రయదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణలో ఉంది. గురువారం నాటికి రిజిస్ట్రేషన్లపై సందిగ్ధం తొలగిపోతుందని భావించినా, వ్యాజ్యం మరుసటి విచారణ ఈనెల 20కి వాయిదా పడింది. దీంతో పాత పద్ధతి కార్డ్ విధానంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తాయా, లేక హైకోర్టులో విచారణ పూర్తయ్యేనాటి వరకు ప్రక్రియ నిలిచిపోవల్సిందేనా అనే అనుమానాలు ఉన్నాయి.
ధరణి పోర్టల్‌లో ట్రయల్ రన్
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను సైతం ధరణి పోర్టల్ ద్వారా నవంబరు 23న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డమ్మీ దస్తావేజుల ట్రయల్ రిజిస్ట్రేషన్‌ను అధికారులు వారం రోజులుగా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో 6, నల్లగొండలో 6, సూర్యాపేట జిల్లాలో 3 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజుకు 5 దస్తావేజుల రిజిస్ట్రేషన్ చేస్తూ సాంకేతిక సమస్యలను పరిశీలిస్తున్నారు. సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలోని ఆస్తుల వివరాలు, ఇటీవల మునిసిపల్, గ్రామ పంచాయతీల్లో నమోదైన ఆస్తి పన్నుల వివరాల ప్రకారం ధరణి పోర్టల్‌లో స్లాట్ బుకింగ్ చేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అయితే పీటీఐ నెంబరు లేని ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అవకాశాలు లేవు. అదే విధంగా వెకేట్ ల్యాండ్ ట్యాక్స్, ఎల్‌ఆర్‌ఎస్ లేని ఇంటి స్థలాలు, ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లు కూడా నిలిచిపోనున్నాయి. ఇదిలా ఉండగా ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు వల్ల యజమానుల వివరాల వ్యక్తిగత, ఆస్తుల రక్షణపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యంలో న్యాయమూర్తులు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయగా, ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లను వాయిదా వేస్తూ వస్తోంది. కోర్టు విచారణలో గురువారం స్పష్టత వచ్చి ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని భావించినా, విచారణ ఈనెల 20కి వాయిదా పడింది. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పాతపద్ధతిన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు అమలు చేసే ప్రక్రియను కొనసాగించేందుకు ఆలోచన చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేసును హైకోర్టు మరోసారి వాయిదా వేయడంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల అనంతరం రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకూ తిప్పలు
పారదర్శకంగా ఆస్తుల క్రయ, విక్రయాలు, మ్యుటేషన్, పట్టాదారు పాస్‌పుస్తకం జారీ చేసి రైతుల కష్టాలు తప్పిస్తామని ధరణి పోర్టల్ ద్వారా చేపట్టిన వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సాంకేతిక సమస్యలతో క్రయ విక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారు. ధరణి పోర్టల్‌లో ఎలాంటి వివాదాలు లేని వ్యవసాయ భూమి వివరాలు చూపుతున్నా, స్లాట్ బుకింగ్‌కు సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వారం రోజుల తర్వాత సాంకేతిక సమస్య పరిష్కారమవుతుందని ఎర్రర్ మెసేజ్ చూపుతోంది. ఈ విషయంపై రెవెన్యూ అధికారుల వద్ద ఎలాంటి సమాచారం లేదు. ఈ సమస్యను ఉన్నతాధికారులకు, ధరణి టెక్నికల్ కాల్‌సెంటర్‌కు నివేదించామని, పరిష్కరించేంతవరకు వేచి ఉండాల్సిందేనని వారు చేతులెత్తేస్తున్నారు. వారం రోజుల్లో సమస్య పరిష్కారమవుతందని పోర్టల్‌లో చూపుతున్నా, నెల రోజులు గడిచినా అతీగతి ఉండటం లేదని యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాయలం వద్ద పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక రిజిస్ట్రేషన్లకు సిద్ధమైన క్రయ, విక్రయదారుల మధ్య వివాదాలు, తగాదాలు చోటుచేసుకుంటున్నాయి.
రిజిస్ట్రేషన్ల ట్రయల్ రన్ నిర్వహిస్తున్నాం : మదన్ గౌడ్, భువనగిరి సబ్ రిజిస్ట్రార్
ప్రభుత్వ సూచనల మేరకు ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతేర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ట్రయల్ రన్‌ను నిర్వహిస్తున్నాం. రోజుకు 5 డమ్మి రిజిస్ట్రేషన్లు చేస్తూ, సాంకేతిక సమస్యలను పరిశీలిస్తున్నాం. ఉత్పన్నమైన సమస్యలను కాల్ సెంటర్‌కు నివేదిస్తున్నాం. భువనగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో భువనగిరి, బొమ్మలరామారం పరిధిలోని వ్యవసాయేతర ఆస్తుల వివరాలను సీడీఎంఏ, హెచ్‌ఎండీఏ, గ్రామ పంచాయతీ, పంచాయతీరాజ్ పోర్టల్‌లో నమోదుకాగా, వాటి ప్రాతిపదికన ట్రయల్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాం.