రైతులకు తేమ తంటాలు

ABN , First Publish Date - 2020-11-19T05:30:00+05:30 IST

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తేమ శాతం అధికంగా ఉన్న వరి ధాన్యాన్ని తరలిస్తుండడంతో ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. తేమ శాతం అధికంగా ఉన్న ధాన్యాన్ని మ్యాచర్‌ తీసే అధికారులు తూకాలు వేసేందుకు తిరస్కరిస్తున్నారు.

రైతులకు తేమ తంటాలు
చౌటుప్పల్‌లోని ఏఎంసీ కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని శుభ్రం చేస్తున్న మహిళా రైతు

 కొనుగోలు కేంద్రాల్లో ఘర్షణ వాతావరణం

చౌటుప్పల్‌ టౌన్‌, నవంబరు 19: ప్రభుత్వ  కొనుగోలు కేంద్రాలకు తేమ శాతం అధికంగా ఉన్న వరి ధాన్యాన్ని తరలిస్తుండడంతో ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. తేమ శాతం అధికంగా ఉన్న ధాన్యాన్ని మ్యాచర్‌ తీసే అధికారులు తూకాలు  వేసేందుకు తిరస్కరిస్తున్నారు. దీంతో  రైతులు, కొనుగోలు కేంద్రాల  నిర్వాహకుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. పొలాల్లో పచ్చిగా ఉన్నటువంటి వరి పంటను మిషన్లతో కోసి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. దీంతో వరి ధాన్యంలో  తేమ శాతం అధికంగా ఉండి తూకం వేయడానికి ఇబ్బంది కరంగా మారుతోంది. దీనికంతటికీ కారణం అకాల వర్షాలు కురిసి నష్టాల పాలు చేస్తాయన్న భయంతోనే రైతులు వరి పంటలను త్వరత్వరగా  కోస్తున్నారు. గత నెలలో కురిసిన వర్షాలకు వరి పంట తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు 50 శాతం మేరకు ఇప్పటికే నష్టాల పాలయ్యారు. ఆ భయంతోనే రైతులు పచ్చిగా ఉన్నటువంటి వరి పంటను కోసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇలాంటి పరిణామాలతోనే ధాన్యంలో తేమ శాతం కాస్త ఎక్కువగా ఉంటోంది.

తిరస్కరిస్తున్న మిల్లర్లు

తేమ శాతం అధికంగా ఉన్న ధాన్యాన్ని అన్‌లోడింగ్‌ చేయడానికి మిల్లర్లు  తిరస్కరిస్తున్నారు. అదే క్రమంలో  తేమ ఎక్కువగా ఉన్న ధాన్యానికి తూకాలు వేసి మిల్లులకు తరలించే లోపుగా తేమ తగ్గిపోయి ఒక్కో లోడ్‌లో మూడు నుంచి ఐదు  క్వింటాళ్ల  తరుగు వస్తుంది. ఈ తరుగుదలను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు వచ్చే కమీషన్‌ నుంచి భరించవలసి వస్తుంది. ఇలాంటి పరిణామాలతో  పచ్చి ధాన్యాన్ని చూస్తే మిల్లర్లు, ఇటు కొనుగోలుదారులు  హడలెత్తి పోతున్నారు. కాగా, ధాన్యంలో తేమ శాతం 17కు లోపల ఉండాలి. కానీ తూకాలకు తెస్తున్న ధాన్యంలో 17నుంచి 28 శాతంగా వస్తుండడంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు నచ్చజెప్పలేక తలలు పట్టుకుంటున్నారు.

ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తేవాలి

పొలాల నుంచి తీసిన ధాన్యాన్ని బావుల వద్ద కల్లాలలో ఆరబెట్టాలి. తేమ శాతం తగ్గిన అనంతరమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి. అదే విధంగా ధాన్యంలో తాలు, చెత్తా, చెదారం లేకుండ శుభ్రం చేయాలి. లేని పక్షంలో తూకం వేయడానికి నిరాకరిస్తారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టడం, శుభ్రం చేయడం సాధ్యం కాదు. ధాన్యం రాశులు పోసేందుకే స్థలం సరిపడడం లేదు. తేమ అధికంగా ఉన్న ధాన్యాన్ని తీసుకువచ్చి మ్యాచర్‌ తీసే అధికారులను  ఇబ్బంది పెట్టకూడదు.

-ఎండి.ఫసియొద్దిన్‌, ఏఎంసీ కార్యదర్శి, చౌటుప్పల్‌

Updated Date - 2020-11-19T05:30:00+05:30 IST