రైతు గుండెపై నివర్ గప్పిన తుపాను
ABN , First Publish Date - 2020-11-25T05:58:49+05:30 IST
నివర్ తుపాను రైతులకు గుబులు పుట్టిస్తోంది. రెండు రోజుల నుంచి వాతావరణంలో భారీగా మార్పులు చోటుచేసుకోవడంతో అన్నదాతలకు కంటిమీద కునుకు కరువైంది.

భారీ వర్షాలు కురిసే అవకాశం
కల్లాల వద్దనే ధాన్యం
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
సూర్యాపేట సిటీ, నవంబరు 24: నివర్ తుపాను రైతులకు గుబులు పుట్టిస్తోంది. రెండు రోజుల నుంచి వాతావరణంలో భారీగా మార్పులు చోటుచేసుకోవడంతో అన్నదాతలకు కంటిమీద కునుకు కరువైంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయిగుండం తీరం దాటడంతో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో వచ్చే 24 గంటల్లో జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ధాన్యం విక్రయాలు పూర్తికాలేదు. ఆలస్యంగా సాగైన వరి పంటలు ఇప్పుడిప్పుడే చేతికి వస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు ఆలస్యం కావడంతో ధాన్యాన్ని రైతులు ఆరబెట్టారు. ఈ నేపథ్యంలో వర్షాలు కురిస్తే రైతులు నష్టపోనున్నారు.వానాకాలం సీజన్‌లో సూర్యాపేట జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో వరి, నల్లగొండ జిల్లాలో 5లక్షలు, యాదాద్రి జిల్లాలో లక్ష ఎకరాల్లో వరి సాగైంది. దిగుబడులు వస్తుండగా, సెప్టెంబరు మాసం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కోతకోసిన పంట మొత్తంలో సగంమేర మాత్రమే దిగుబడులను అధికారులు కొనుగోలు చేశారు. మిగిలిన ఽధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ల లో విక్రయాలకు సిద్ధంగా ఉంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మంగళవారం సాయంత్రం నాటికి 1,7667.920 మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేశారు. అందులో 1,6240.400 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించారు. కాగా, రెండు రోజులు నుంచి వాతావరణం చల్లగా ఉండటంతో ధాన్యం కొనుగోలు నిర్వాహకులు విక్రయాలు చేయడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. దీంతో రైతులు ఇప్పటికే ఇబ్బందులు పడుతుండగా, వర్షం వస్తే ధాన్యమంతా తడుస్తుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతులు అప్రమత్తంగా ఉండాలి : రామారావు నాయక్, సూర్యాపేట ఏడీఏ
తుపాను ప్రభావంతో అతిభారీ వర్షాలు కురిసే అ వకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలి. పొలాలు, రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఐకేపీ, పీఏసీఎస్‌లో టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలి. రైస్ మిల్లులకు తరలించే ధాన్యంపై కూడా టార్పాలిన్లు కప్పాలి.
అంతా జాగ్రత్తగా ఉండాలి :వినయ్‌కృష్ణారెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్
జిల్లాలో బుధ, గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలతో ఎలాంటి నష్టం చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండాలి. రైతులు పొలాల వద్ద ధాన్యం రాశులు, బస్తాలు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలిన్నారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పాలి.