వరుస వానలతో చేనుకు చేటు

ABN , First Publish Date - 2020-09-21T06:58:29+05:30 IST

వరుస వర్షాలతో ఓ పక్క రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నా పత్తి, వరికి తెగుళ్లు వ్యాపిస్తుండటంతో కంటిమీద

వరుస వానలతో చేనుకు చేటు

వరికి పచ్చపురుగు, దోమ బెడద 

పత్తికి వ్యాపిస్తున్న గులాబిరంగు పురుగు


త్రిపురారం, మోత్కూరు, నల్లగొండ, సెప్టెంబరు 20: వరుస వర్షాలతో ఓ పక్క రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నా పత్తి, వరికి తెగుళ్లు వ్యాపిస్తుండటంతో కంటిమీద కునుకులేకుండా పోతోంది. నల్లరేగడి నేలల్లో పత్తి చేలు జాలు పట్టగా, ఎర్రనేలల్లోని పంటలు కళకళలాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పత్తి చేలకు తెగుళ్లు సోకుతున్నాయి. వరి పంటపై తెల్ల మచ్చలు కనిపిస్తున్నాయి. పచ్చ పురుగు, తెల్లదోమ ఆశించింది. సాధారణంగా క్లోరోపైరీపాస్‌తో ఈ పురుగులు నియంత్రణలోకి వచ్చేవి. అయితే వాతావరణంలో మార్పులతో ఎన్ని మందులు పిచికారీ చేసినా ప్రయోజనం ఉండటం లేదు. వరి పొట్టదశకు రాక ముందే దోమ ఉధృతి పెరిగింది. పిలకల దశ నుంచే తెగుళ్ల వ్యాప్తి పెరిగింది. పత్తి బెట్ట పరిస్థితులతో దెబ్బతింటుండగా, పంట ఏపుగా పెరిగినా పల్లబారుతోంది. రసం పీల్చే పురుగుతో పాటు గులాబి రంగు పురుగులు ఆశించి నష్టపరుస్తున్నాయి. జాజురోగంతో ఆకులు ఎర్రబారి రాలిపోతున్నాయి.


పూత, పిందె(గూడ) రాలుతోంది. పత్తికాయ విచ్చుకోకముందే చెట్టుపైనే మురిగి బూజు పడుతోంది. కాయ విచ్చుకున్న పత్తి తడిసి నల్లగా మారుతోంది. మోత్కూరు మండలంలో 12,712ఎకరాల్లో, అడ్డగూడూరు మండలంలో 14,257, ఆత్మకూరు (ఎం) మండలంలో 11,069, గుండాల మండలంలో 13,384 ఎకరాల్లో మొత్తం నాలుగు మండలాల్లో 51,422 ఎకరాల్లో పత్తి సాగైంది. ఇప్పటికే రెండు, మూడు పర్యాయాలు కాంప్లెక్స్‌ ఎరువులు వేశారు. క్రిమిసంహారక మందులు పిచికారీ చేశారు. తీరా పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలతో జాజు తెగులు వ్యాపించింది. ఎన్నిమందులు పిచికారీ చేసినా తెగులు అదుపులోకి రావడంలేదు. వరి చేలల్లో దోమ ఉధృతి పెరిగింది. ఆకులు ఎర్రబారుతుండగా, కొన్నిచోట్ల గొట్టం తెగులు ప్రబలింది.పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్‌ 0.3 మి.లీ., గులాబిరంగు పురుగు యాజమాన్యానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయాలి.


ఆకు ముడత

వరిలో రెక్కల పురుగులు పొలంలో గుంపులు గుంపులుగా ఎగురుతూ లార్వా లు ఆకులు మడిచి పత్రహరితాన్ని తింటా యి. దీంతో ఆకులు తెల్లగా మారతాయి. 

నివారణ : నాటు వేసిన 30రోజుల లోపు ఎకరానికి కార్బోప్యూరాన్‌ గుళికలు 10కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ 0.4జి గుళికలు నాలుగు కిలోలు నీరు పలుచగా ఉంచి పొలం అంతా చల్లాలి. పిలక దశలో ప్లూబెండమైడ్‌ 0.25గ్రా., ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


ఆకునల్లి

ఆకుల వెనుక భాగంలో ఈనిల వెంబడి రసాన్ని పీల్చడం వల్ల ఆకులపై తెలుపు లేదా పసుపు రంగు మచ్చలు లేదా చార లు ఏర్పడతాయి. ఆకులన్నీ ఎండిపోతా యి. అధిక ఉష్ణోగ్రత ఈ పురుగు ఉధృతి ని అధికం చేస్తుంది. వర్షాలు లేక బెట్ట పరిస్థితుల్లో వీటి వ్యాప్తి అధికంగా ఉంటుంది. 

నివారణ : లీటరు నీటిలో కరిగే గంధకం 3గ్రా., లేదా స్పైరోమెసిఫెన్‌ 1మి.లీ., లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


సుడి దోమ

వరిలో సుడిదోమ వ్యాప్తి అధికమైంది. గాలిలో తేమశాతం అధికంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.

నివారణ : నత్రజని ఎరువులు వాడకం తగ్గించడంతోపాటు పొలాన్ని తరచూ ఆరబెట్టాలి. పిల్లదోమలు మొదళ్ల వద్ద  కనిపిస్తే బ్యుప్రోపెజిన్‌ 1.6 మి.లీ., లేదా ఎసిఫేట్‌ +ఇమిడాక్లోప్రిడ్‌ 1.5 గ్రా., లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


అగ్గి తెగులు

ఆకులపై నూలు కండె ఆకారం మచ్చలు గమనిస్తే వెసోప్రోథయాలేన్‌ 1.6 మి.లీ., లేదా ట్రెసైక్లోజోల్‌ 0.6గ్రా., లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.


వరికి తెగుళ్ల బెడద పెరిగింది

వరి సాగు ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. వాతావరణంలో మార్పులతో ఏదో ఒక తెగులు వ్యాపిస్తూనే ఉంది. ప్రస్తుతం పొలానికి పచ్చపురుగు ఆశించి తెల్లగా మారింది. సుడిదోమ అధికమైంది. రూ.2వేల వరకు ఖర్చుచేసి ఇప్పటికే మూడుమార్లు మందులు పిచికారీ చేశా. అయినా ప్రయోజనం కనిపించడ ం లేదు. పంటలో ఎదుగుదల లేదు. దిగుబడులపై ప్రభావం పడేలా ఉంది.

- సుధాకర్‌రెడ్డి, వరి రైతు, త్రిపురారం


పత్తికాయలు మురిగిపోతున్నాయి

నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశా. వర్షాలకు పత్తి చేనుకు జాజు రోగం తగిలి ఆకులు ఎర్రబారి రాలిపోతున్నాయి. ఇప్పటికి రెండుమార్లు మందు పిచికారీ చేశా. అయినా అదుపులోకి రావడం లేదు. పూత, పిందె(గూడ) రాలుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పత్తి కాయలు చెట్టు మీదనే మురిగిపోతున్నాయి. వ్యవసాయాధికారులు పంటలను పరిశీలించి ఏం మందు పిచికారీ చేయాలో సూచించాలి.

- మెతుకు వెంకటయ్య, పత్తి రైతు, అడ్డగూడూరు

Updated Date - 2020-09-21T06:58:29+05:30 IST