ధరలు పెంచేస్తున్నారు
ABN , First Publish Date - 2020-03-27T11:32:45+05:30 IST
కరోనా వైరస్ నియంత్రణకు చేపట్టిన 21రోజుల భారత్ లాక్‌డౌన్ బ్లాక్ మార్కెటింగ్‌కు కేరా్‌ఫగా మారింది.
భువనగిరి టౌన్, మార్చి26: కరోనా వైరస్ నియంత్రణకు చేపట్టిన 21రోజుల భారత్ లాక్‌డౌన్ బ్లాక్ మార్కెటింగ్‌కు కేరా్‌ఫగా మారింది. నిత్యావసర వస్తువుల ధరలను పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చేస్తున్న హెచ్చరికలు భువనగిరి వ్యాపారులు బేఖాతారు చేస్తున్నట్లు సమాచారం. పెరిగిన ధరలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులు తనిఖీలు చేస్తున్నప్పటికీ ధరలు మాత్రం దిగి రావడంలేదు.
కరోనా కారణంగా మార్కెట్‌తోపాటు రవాణా వ్యవస్థ స్తంభించిందని, ఒకటి రెండు రోజుల్లో మార్కెట్‌లో నిత్యావసర వస్తువులన్నీ నిండుకుని దుకాణాలను మూసివేయాల్సి వస్తుందని, దీంతో చివరి రెండు రోజుల్లోనైనా తాము ధరలు పెంచకుంటే ఎలాగా అని పలువురు వ్యాపారులు బహిరంగంగానే పేర్కొంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు, ప్రస్తుత ధరలతో పోలిస్తే నిత్యావసర ధరలు హోల్‌సేల్ దుకాణాల్లో కిలోకి రూ.15నుంచి రూ.50వరకు పెరిగాయి.
రిటైల్ దుకాణాల్లో
హోల్‌సేల్ దుకాణాల్లో పెరిగిన ధరల ప్రభావంతో రిటైల్ మార్కెట్‌లో కూడా ధరలు భగ్గుమంటున్నాయి. మండలకేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ధరలు మరింత ఇబ్బందికరంగా మారినట్టు కొనుగోలుదారులు వాపోతున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలు నివసించే ప్రాంతాల్లో, ఖాతాల రూపంలో ఉద్దెరగా కొనుగోలుజరిగే ప్రాంతాల్లో ధరల ప్రభావం మరింతగా చూపుతున్నట్లు వినియోగదారులు వాపోతున్నారు. కరోనా భయంతో ఇప్పటికే ఉపాధి కోల్పోయి పైసా చూడని పరిస్థితుల్లో ఆకలి రోజులు గడుపుతున్న తమకు ధరల పెరుగుదల కష్టంగా మారుతోందని దినసరి కూలీలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
రెండు రోజుల్లో ఖాళీ కానున్న హోల్‌సేల్ దుకాణాలు
మరో ఒకటి రెండు రోజుల్లో హోల్‌సేల్ దుకాణాల్లో స్టాక్ ఖాళీ కానున్నట్లు సదరు వ్యాపారులు పేర్కొంటున్నారు. కొద్దిమంది బ్లాక్ వ్యాపారులు నిల్వలను దాచి కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు మార్కెట్‌లో ప్రచారమవుతోంది. ఇదే అదనుగా రిటైల్ వ్యాపారులు కూడా అందిన కాడికి హోల్‌సేల్ దుకాణాల్లో కొనుగోలు చేస్తూ నిల్వ చేస్తున్నట్టు, అదను చూసి అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు గడించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉన్న కొద్దిపాటి సరుకును అధిక ధరలకు విక్రయించినప్పటికీ ఎవ్వరూ నియంత్రించలేరని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం పేర్కొంటున్నట్టు సరుకు రవాణాకు పోలీసులు అనుమతిస్తే పరిస్థితుల్లో కొద్ది మేర మార్పులు వస్తాయని, ధరలు నిలకడగా ఉంటాయని అంటున్నారు.