పది పరీక్షలకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2020-03-16T12:17:31+05:30 IST

పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద కరోనా నివారణకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుకు సన్నాహాలు చేపడుతూ

పది పరీక్షలకు సర్వం సిద్ధం

19 నుంచి ప్రారంభం

జిల్లావ్యాప్తంగా 49 పరీక్షా కేంద్రాలు

పరీక్ష కేంద్రాల వద్ద కరోనా నివారణ ముందస్తు ఏర్పాట్లు 


భువనగిరి రూరల్‌, మార్చి 15: పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద కరోనా నివారణకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుకు సన్నాహాలు చేపడుతూ అత్యవసర వైద్య సేవలు అందించనున్నారు. ఈనెల 19నుంచి ఏప్రిల్‌ 1 వరకు రెగ్యులర్‌ విద్యార్థులకు పరీక్షలు జరగనుండగా జిల్లా వ్యాప్తంగా 49 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15గంటల వరకు పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 10,151మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో 10,066మంది రెగ్యులర్‌ విద్యార్థులు కాగా 85మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పరీక్ష కేంద్రాల వద్ద తాగు నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.కరెంటు కోత..లేకుండా చర్యలు చేపడుతున్నారు. మాల్‌ ప్రాక్టీస్‌ పై నిఘా పెట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొంటున్నారు. ఆయా పాఠశాలల ఆధ్వర్యంలో విద్యార్థులకు హాల్‌టికెట్లను అందజేస్తున్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగే విధంగా సిట్టింగ్‌ స్క్వాడ్‌ను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్యజైనీ పరీక్ష కేంద్రాలను సందర్శించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆయా పాఠశాలల యాజమాన్యాలకు సూచించారు. 


జిల్లాలో 49పరీక్షా కేంద్రాలు 

పది పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 49పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు 10,066 మంది రెగ్యులర్‌ విద్యార్థులు, 85మంది ప్రైవేటు విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షలు ఈనెల 19నుంచి ప్రారంభమై ఏప్రిల్‌1 వరకు జరుగనున్నాయి. జిల్లాలో 267ఉన్నత పాఠశాలలు ఉండగా ఇందులో కేజీబీవీ 10,మోడల్‌ స్కూల్స్‌7, ప్రైవేటు పాఠశాలలు 79, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 160, ఎయిడెడ్‌ పాఠశాలలు2, ప్రెసిడెన్సీయల్‌ పాఠశాలలు 9 ఉన్నాయి. 


పరీక్షల పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బంది 

జిల్లాలో ఏర్పాటు చేసిన కేంద్రాలలో జరుగనున్న పది పరీక్షల పర్యవేక్షణకు సిబ్బందిని నియమించారు. జిల్లాలో 49పరీక్ష కేంద్రాలకు 49 సీఎ్‌సలు, 49డీఈవోలు, 550మంది ఇన్విజిలేటర్లను నియమించారు. మాస్‌ కాపీయింగ్‌కు తావు లేకుండా ప్రత్యేకంగా 4ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. 


ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు 

ఈనెల 19నుంచి పది పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు పాఠశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లను ఇప్పటికే పంపిణీ చేశాయి. అదే విధంగా హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చును. ఇందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 


 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి 

పది పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో 49కేంద్రాలలో మౌలిక సౌకర్యాల కల్పనకు ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఏర్పాట్లు చేశాయి. పరీక్ష కేంద్రాల్లో తాగు నీరుతో పాటు కరోనా నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు అందుబాటులో ఉంటాయి. 

-చైతన్య జైనీ, జిల్లా విద్యాశాఖ అధికారి 




Updated Date - 2020-03-16T12:17:31+05:30 IST