వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం

ABN , First Publish Date - 2020-12-31T04:37:00+05:30 IST

వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ రుణ ప్రణాళికను ఆవిష్కరించారు

వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం
రుణ ప్రణాళికను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌

నాబార్డు పీఎల్‌పీ రుణ ప్రణాళిక రూ. 2521.89 కోట్లు

యాదాద్రి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. బ్యాంకుల నుంచి రుణపరపతిని అందజేసే సంభావ్యత రుణ ప్రణాళికలను బుధవారం నాబార్డు విడుదల చేసింది. రూ.2521.89 కోట్ల నాబార్డు రూపొందించిన రుణ ప్రణాళిక గత ఏడాది కంటే 30శాతం ఎక్కువగా సిఫారసు చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పంట రుణాలు, వ్యవసాయ రుణాలకు రూ.1392.97 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.189.01 కోట్లు, గోదాములు, ఇతర మౌలిక వసతుల కల్పనకు రూ.938.61 కోట్లు, ఇతర రంగాలకు రూ.416 కోట్లు కేటాయించారు. సూక్ష్మ, చిన్న తరహా ఔత్సాహిక పారిశ్రామిక రంగాలకు రూ.293.25 కోట్లు, విద్యా రుణాలకు రూ. 436.50 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.616.50కోట్లు, సామాజిక అవసరాలకు రూ.173.93 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ మాట్లాడుతూ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి రంగాలకు నాబార్డు రూపొందించిన రుణ ప్రణాళికలను బ్యాంకులు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి సత్యనారాయణ, లీడ్‌ బ్యాంక్‌ అధికారి నాగార్జున బాబు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


రెవెన్యూ కార్యాలయాల నిర్మాణానికి స్థలాన్ని ప్రతిపాదించాలి

చౌటుప్పల్‌ పట్టణంలో రెవెన్యూ శాఖకు చెందిన కార్యాలయాల నిర్మాణానికి తగిన స్థలాన్ని ప్రతిపాదించాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్‌ సందర్శించారు. ధరణిలో జరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను ఆర్డీవో సూరజ్‌కుమార్‌, తహసీల్దార్‌ కె.గిరిధర్‌రావులతో కలెక్టర్‌ సమీక్షించారు. అనంతరం మునిసిపల్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ సందర్శించారు. కార్యక్రమంలో ఆర్డీవో సూరజ్‌కుమార్‌, చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, కమిషనర్‌ రామ దుర్గారెడ్డి, వైస్‌ చైర్మన్‌ బత్తుల శ్రీశైలం పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T04:37:00+05:30 IST