అంతా నిర్మానుష్యం

ABN , First Publish Date - 2020-03-28T11:01:39+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి వాహనాలు లేక నిర్మానుష్యంగా మారింది. అడపాదడపా స్థానిక వాహనాలు

అంతా నిర్మానుష్యం

ఖాళీగా జాతీయ రహదారులు

అత్యవసర సేవల వాహనాలు మాత్రమే రోడ్లపైకి 

టోల్‌గేట్ల వద్ద పోలీసుల తనిఖీలు


నల్లగొండ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి), చౌటుప్పల్‌రూరల్‌/ కేతేపల్లి: లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి వాహనాలు లేక నిర్మానుష్యంగా మారింది. అడపాదడపా స్థానిక వాహనాలు మినహా జాతీయ రహదారిపై రద్దీ కనిపించలేదు. ఎక్కడి ప్రజలు అక్కడే ఉండాలని, ఆంధ్రప్రదేశ్‌కు శుక్రవారం నుంచి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు అనుమతించేది లేదని ఇరు రాష్ర్టాల ప్రభుత్వాలు హెచ్చరించడంతో వాహనదారులు రాజధాని నుంచి బయటకు వెళ్లలేదు. దీంతో జాతీయ రహదారిపై వాహనాల సందడి కనిపించలేదు. హైదరాబాద్‌ నుంచి వాహనాల రాకలు పూర్తిగా తగ్గిపోయాయి.


అత్యవసర వాహనాలు మాత్రమే రోడ్లపై కనిపించాయి. చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేట్‌ వద్ద పోలీసులు ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేసి సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. అత్యవసర వాహనాలు, అనుమతి పత్రాలు ఉన్న వాహనాలను మాత్రమే పంపించారు. టోల్‌ఫీజులు రద్దు చేయడంతో వాహనాలను ఉచితంగానే పంపారు. కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌ శివారులో టోల్‌ప్లాజా వద్ద జీఎమ్మార్‌ సిబ్బంది రేయింబవళ్లు కాపలా కాస్తున్నారు. శాలిగౌరారం సీఐ నాగదుర్గాప్రసాద్‌ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2020-03-28T11:01:39+05:30 IST