‘పేట’ తొలి కౌన్సిల్‌ సమావేశంలోనే రగడ

ABN , First Publish Date - 2020-09-01T08:57:36+05:30 IST

సూర్యాపేట మునిసిపల్‌ మొదటి సర్వసభ్య సమావేశంలోనే వాగ్వాదం జరిగింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. కాంగ్రెస్‌,

‘పేట’ తొలి కౌన్సిల్‌ సమావేశంలోనే రగడ

తాము రాకుండా సమావేశం ప్రారంభించారని కాంగ్రెస్‌ వాకౌట్‌


సూర్యాపేట, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట మునిసిపల్‌ మొదటి సర్వసభ్య సమావేశంలోనే వాగ్వాదం జరిగింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ కౌన్సిలర్లు సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. సోమవారం సూర్యాపేట మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం 11గంటలకు మొదలైంది. చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ అనుమతితో కమిషనర్‌ రామాంజులరెడ్డి ఎజెండా ప్రవేశపెట్టారు. అప్పటికే టీఆర్‌ఎస్‌కు చెందిన 28మంది కౌన్సిలర్లు హాజరయ్యారు.


ఎజెండాలో ఉన్న 38అంశాలు చదివిన తర్వాత కాంగ్రెస్‌, బీజేపీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరయ్యారు. తాము రాకముందే సమావేశం జరపడంపై వారు నిరసన తెలిపారు. కోరం ఉండడంతో సమావేశం ప్రారంభిం చినట్లు చైర్‌పర్సన్‌ తెలిపారు. ప్రతిపక్ష కౌన్సిలర్లు సమావేశాన్ని అడ్డుకొని, చర్చ జరపాలని డిమాండ్‌ చేశారు. మెజార్టీ సభ్యుల మద్దతుతో ఎజెండా అమలు చేసినట్లు చైర్‌పర్సన్‌ ప్రకటించారు. దీనికి నిరసనగా కాంగ్రెస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు.


అనంతరం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ డి.సంజీవరెడ్డికి వినతిపత్రం అందజేశారు. భారత్‌-చైనా సరిహద్దులో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబుకు కౌన్సిల్‌ శ్రద్ధాంజలి ఘటించింది. కోర్టు చౌరస్తాను సంతోష్‌బాబు చౌరస్తాగా నామకరణం చేస్తునట్లు చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ ప్రకటించారు. ఆ స్థలంలో సంతోష్‌బాబు కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. 


Updated Date - 2020-09-01T08:57:36+05:30 IST