కరోనాపై పోరులో ప్రజలు సహకరించాలి

ABN , First Publish Date - 2020-05-09T09:41:23+05:30 IST

జిల్లాలో ఒక్క వ్యక్తి కూడా కరోనా బారిన పడకుండా కాపాడుకున్నామని, ఇదే పట్టుదలను కొనసాగించడానికి జిల్లా

కరోనాపై పోరులో ప్రజలు సహకరించాలి

యాదాద్రి డీసీపీ కె. నారాయణరెడ్డి


యాదాద్రి, మే8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఒక్క వ్యక్తి కూడా కరోనా బారిన పడకుండా కాపాడుకున్నామని, ఇదే పట్టుదలను కొనసాగించడానికి జిల్లా ప్రజలు అధికార యంత్రాంగానికి సహకరించాలని యాదాద్రిభువనగిరి డీసీపీ కె. నారాయణరెడ్డి కోరారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘మీ గ్రామాలు, పట్టణాలకు ఇతర రాష్ర్టాలు, జిల్లాల నుంచి కొత్తగా ఎవరైనా వస్తే వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలి’ అని సూచించారు. ముఖ్యంగా జిల్లా సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.  మాస్క్‌లు ధరించకుండా బయటకు వస్తే రూ.1,000 జరిమాన విధిస్తామని, అనవసరంగా వాహనాలపై బయట తిరిగితే వాహనం జప్తు చేసి, కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.


మాస్క్‌ లేని 124 మందికి జరిమానా

కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల కారణంగా కనీస జాగ్రత్తలు పాటించకుండా బయటకు వస్తున్నవారిపై ప్రత్యేక దృష్టి సారించి జరిమానాలు విధిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం మాస్క్‌ తప్పనిసరి నిబంధనలు ఉల్లంఘించిన 124మందికి జరిమానాలు విధించారు. జిల్లాలోని 5 పోలీస్‌ స్టేషన్ల పరిధిలోనే జరిమానాలు విధించగా, మిగతా  చోట్ల  కౌన్సిలింగ్‌ ఇచ్చి మొదటి హెచ్చరికగా వదిలిపెట్టారు. డీసీపీ కె.నారాయణరెడ్డి, ఏసీపీ భుజంగరావు, పర్యవేక్షణలో పట్టణ ఇన్స్‌పెక్టర్‌ ఎ.సుధాకర్‌, ఎస్‌ఐలు వాహనాలను తనిఖీ చేశారు. 


నెలరోజుల లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వివిధ వ్యాపారులకు రూ.83,500 జరిమానా విధించినట్లు కమిషనర్‌ బట్టు నాగిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు.  

Updated Date - 2020-05-09T09:41:23+05:30 IST