ఉమ్మడి జిల్లాలో పెళ్లి సందడి

ABN , First Publish Date - 2020-11-26T06:22:10+05:30 IST

జహంగీర్‌ ఊరెళ్లాలి డ్రైవింగ్‌కు వస్తావా.. సారీ సార్‌ కుదరదు.. వెయ్యి రూపాయలు ఇచ్చినా డ్రైవర్‌ దొరికే పరిస్థితి లేదు.. పెళ్లిళ్ల సీజన్‌, తుంగభద్ర పుష్కరాలు.. బండ్లన్నీ అటే వెళ్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలో పెళ్లి సందడి

ఆరు నెలల తర్వాత మొదలైన హడావుడి

జనవరి 6 వరకు ముహూర్తాలు

ఫంక్షన్‌ హాళ్లు ఫుల్‌, పురోహితులు, డ్రైవర్లు బిజీ

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): జహంగీర్‌ ఊరెళ్లాలి డ్రైవింగ్‌కు వస్తావా.. సారీ సార్‌ కుదరదు.. వెయ్యి రూపాయలు ఇచ్చినా డ్రైవర్‌ దొరికే పరిస్థితి లేదు.. పెళ్లిళ్ల సీజన్‌, తుంగభద్ర పుష్కరాలు.. బండ్లన్నీ అటే వెళ్తున్నాయి. అనిల్‌ జుట్టు బాగా పెరిగింది కటింగ్‌ చేస్తావా.. అయ్యో.. కదరదు. ఇవ్వాళ, రేపు పెళ్లిళ్లు ఎక్కువగా ఉన్నాయి.  జిల్లాలో ఏ శ్రామిక వర్గాన్ని  కదిలించినా ఇదే సమాధానం వస్తోంది. 

కరోనా ప్రభావంతో ఆరు నెలల పాటు అన్నీ వాయిదా వేసుకున్న జనం ఇక ఆగే పరిస్థితి లేదు. అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేయడం మొదలైంది. రోడ్డుమీదికి వెళితే చాలు పెళ్లికి ముస్తాబు చేసిన వాహనాల సందడి కనిపిస్తోంది. టోల్‌ గేట్ల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. పంతుళ్లల, బాజా భజంత్రీలు, ఫొటో, వీడియో, పూల డెకరేషన్లు, కార్ల పరుగులు, ఫంక్షన్‌ హాళ్లు కళకళలాడుతున్నాయి. ఒక్క పెళ్లితో వందల మందికి ఉపాధి. ఉమ్మడి జిల్లా అంతటా పెళ్లి సందడి కనిపిస్తోంది. జనవరి 6 వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో జనం ఆగే పరిస్థితి లేదు. ఆ తరువాత మళ్లీ మూడు నెలల వరకు ముహూర్తాలు లేకపోవడంతో అంతా బాధ్యతలు తీర్చుకునేందుకు తొందరపడుతున్నారు. ఫంక్షన్‌ హాళ్లు అప్పుడే బుక్‌ అయిపోయాయి.

ముహూర్తాలే.. ముహూర్తాలు

కరోనా మహమ్మారి అందరి జీవితాల్లో పెను మార్పులు తెచ్చింది. ఆరు నెలల పాటు అంతా అన్ని కార్యకలాపాలు నిలిపివేసి ఇళ్ల వద్దే కాలం గడిపారు. ముహూర్తాలు ఉన్నా, మంచి సంబంధాలు దొరికినా మాట ముచ్చట, ఒప్పందాలకే పరిమితం అయ్యారు తప్ప పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు చేసేందుకు ఏ ఒక్కరూ సాహసించలేదు. కరోనా తొలి దశ ముగియడం, లాక్‌డౌన్‌ నిబంధనలు పూర్తిగా ఎత్తివేయడంతో ఒక్కసారిగా పెళ్లిళ్ల సందడి పెరిగింది. కార్తీకం, మార్గశిరం పెళ్లిళ్లకు అత్యంత అనుకూలం. వాతావరణం దృష్ట్యా, పంటలు విక్రయించిన రైతుల చేతుల్లో డబ్బు రావడంతో నవంబరు, డిసెంబరు, జనవరి 6వరకు పెద్ద సంఖ్య లో పెళ్లిళ్లు ఫిక్సయ్యాయి. ఆ తరువాత మూఢాలు కావడంతో  మూడు నెలలు శుభకార్యాలు ఉండవు.

ఒక్కరోజే 2200 పెళ్లిళ్లు

ఈ నెల 25న అంటే బుధవారం ఒక్కరోజే ఉమ్మడి జిల్లాలో 2200 పెళ్లిళ్లు జరిగినట్టు అంచనా. మొత్తం 500 ఫంక్షన్‌ హాళ్లు ఉండగా ఏ ఒక్కటీ ఖాళీగా లేదు. నల్లగొండ జిల్లాలో 900మంది ఫొటోగ్రాఫర్లు ఉంగా, అందరూ బీజీ. కిరాయి వాహనాల సంఖ్య సుమారు 5,400 కాగా, డ్రైవర్లు ఆరువేల మంది ఉంటారు. వారందరికీ చేతి నిండా పని దొరికింది. ఒక్కనల్లగొండ జిల్లా కేంద్రంలోనే 400 వాహనాలు ఉండ గా, 450మంది డ్రైవర్లు ఉన్నారు. వీరితోపాటే వంట మనుషులు, భోజనాలు సరఫరా చేసే క్యాటరింగ్‌ సిబ్బంది, ఫంక్షన్‌ హాళ్లు డెకరేషన్‌ చేసేవారు, బాజాభజంత్రీలు, సౌండ్‌ సిస్టమ్‌, కుండలు చేసే కుమ్మరులు, బుట్టలు అల్లే మేదరులు, పెళ్లి తంతులో భాగస్వాములు అయ్యే రజకులు ఇలా అందరి జీవన చక్రం ఒకే సారి వేగం పుంజుకుంది.  సంపాదన చేతికి వస్తుండటంతో అన్ని వర్గాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. 

 అంతటా పెళ్లిళ్ల సందడి :అనంత కృష్ణ శర్మ, పూజారి

జనవరి 6 వరకే మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తరువాత మూడునెలలు పుష్యం,మాఘం, పాల్గు ణంవరకు మూఢాలు. శుభ కార్యాలకు పనికిరావు. ఏది ఏమైనా ఉగాది, శ్రీరామ నవమి తరువాతే మళ్లీ మంచి ముహూర్తాలు ఉన్నాయి. ముహూర్తం ఉంటే చాలు పట్టణాల్లో పెళ్లిళ్లు జరిగిపోతాయి. అదే పల్లెల్లో అయితే పంటలు చేతికొచ్చి వాటిని విక్రయించాక చేతిలో కొంత డబ్బు పడితేనే, మళ్లీ యాసంగి పనులు మొదలైతే పెళ్లిళ్లు చేసేందుకుఆసక్తి చూపరు.


కరోనా నిబంధనలు పాటిస్తూ : నేలపట్ల రవీందర్‌, ఫంక్షన్‌ హాల్‌ మేనేజర్‌

కరోనా కారణంగా ఏప్రిల్‌, మేలో జరగాల్సిన పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. కార్తీకం, మార్గశిర ఇప్పుడు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ప్రస్తుతం కుదిరిన వాటితోపాటు గతంలో ఆగిన అన్ని పెళ్లిళ్లు ఒకేసారి జరుగుతుండటంతో ఫంక్షన్‌ హాళ్లు జనవరి 6 వరకు దాదాపు ఖాళీ లేవు. ఎనిమిది నెలల తరువాత ఫంక్షన్‌ హాళ్లలో శుభకార్యాలు జరుగుతున్నాయి. 100 మందికే అనుమతి ఉంది. 150 కుర్చీలు వేసి కుర్చీల మధ్య ఖాళీలు, దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్నీ డిస్పోజబుల్‌ వస్తువులే వాడాలి. గతంలో ప్లేట్లు, గ్లాసులు ఇతర సామగ్రిని ఫంక్షన్‌ హాళ్లే ఇచ్చేవి. కరోనా నిబంధనల మేరకు ఇప్పుడు ఇవ్వడం లేదు. శానిటైజర్లు అందుబాటులో పెట్టాం.

Updated Date - 2020-11-26T06:22:10+05:30 IST