పీడీఎస్‌ బియ్యం పక్కదారి

ABN , First Publish Date - 2020-12-27T05:37:43+05:30 IST

పీడీఎస్‌ బియ్యం పక్కదారి పట్టకుండా కాపాడాల్సిన ప్రజాప్రతినిధే అధికారాన్ని అడ్డు పెట్టుకొని దర్జాగా దందా సాగిస్తున్నాడు.

పీడీఎస్‌ బియ్యం పక్కదారి
పీడీఎస్‌ బియ్యాన్ని గ్రామపంచాయతీ ట్రాక్టర్‌పై వేస్తున్న పంచాయతీ సిబ్బంది

పీడీఎస్‌ బియ్యం పక్కదారి
చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న ప్రజాప్రతినిధి
కొనుగోలుకు పంచాయతీ సిబ్బంది వినియోగం

మిర్యాలగూడ, డిసెంబరు 26 :
పీడీఎస్‌ బియ్యం పక్కదారి పట్టకుండా కాపాడాల్సిన ప్రజాప్రతినిధే అధికారాన్ని అడ్డు పెట్టుకొని దర్జాగా దందా సాగిస్తున్నాడు. ఈ దందాకు పంచాయతీ సిబ్బందినే వినియోగించడం విశేషం. కొనుగోలు చేసిన బియ్యాన్ని తన చేపల చెరువుకు తరలించేందుకు గ్రామపంచాయతీ ట్రాక్టర్‌నే వినియోగించడం కొసమెరుపు. వేములపల్లి మండలం మొలకపట్నం గ్రామపంచాయతీ ప్రజాప్రతినిధి సొంతంగా కుంటలో చేపల పెంపకం చేస్తున్నాడు. వాటికి కావాల్సిన దాణా మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుండటంతో సులభపద్ధతిలో చౌకగా చేపలకు ఆహారాన్ని అందించే యోచన చేశాడు. దీంతో చౌక ధరల దుకాణంతో పంపిణీ చేసే బియ్యంపై కన్ను పడింది. గ్రామ పంచాయతీలో రేషన్‌ లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలుకు ఆరా తీశాడు. గ్రామంలో లబ్ధిదారుల నుంచి కొందరు పీడీఎస్‌ బి య్యం కేజీ రూ.7 కొనుగోలు చేసి బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముకుంటున్న విష యం ప్రజాప్రతినిధి దృష్టికి వచ్చింది. దీంతో బియ్యం కొనే దళారులపైకి నెల క్రితం పోలీసులకు పట్టించి జైలుకు తరలించడంలో సహాయ సహకారాలు అందించాడు. ఇదే అదనుగా తానే వ్యాపారి అవతారం ఎత్తాడు. తన గ్రామపంచాయతీ సిబ్బందిచే ఇంటింటికీ తిప్పి కేజీ బియ్యం రూ.5కు పీడీఎస్‌ బియ్యాన్ని కొనుగోలు చేయించాడు. అలా కొనుగోలు చేసిన బియ్యాన్ని చేపలకు ఆహారంగా వేసేందుకు బియ్యం మూటలను పంచాయతీకి ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్‌పై తరలిస్తున్నాడు. పీడీఎస్‌ బియ్యం కొనుగోలు, పంచాయతీ సిబ్బంది, ట్రాక్టర్‌ను అక్రమ వ్యాపారానికి వాడుకుంటున్న సర్పంచ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
అధికారులు చర్యలు తీసుకోవాలి
సర్పంచ్‌ పంచాయతీ సిబ్బందితో బియ్యం కొనుగోలు చేస్తుంటే పట్టుకున్నాం. సర్పంచ్‌ మా మాట లెక్క చేయలేదు. పంచాయతీ ట్రాక్టర్‌ ఇంజన్‌పై బియ్యం మూటలు వేసుకుని వెళ్లారు. సిబ్బందిని, ట్రాక్టర్‌ను సర్పంచ్‌ సొంత పనులకు వినియోగిస్తున్నాడు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి.
- మాతంగి ఎల్లయ్య, మొలకపట్నం
మా దృష్టికి రాలేదు
సర్పంచ్‌ పీడీఎస్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి జీపీకి చెందిన ట్రాక్టర్‌లో తరలించినట్లు మా దృష్టికి రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారించి పై అధికారులకు నివేదిక ఇస్తాం.
- స్వరాజ్యం, పంచాయతీ కార్యదర్శి

Updated Date - 2020-12-27T05:37:43+05:30 IST