పరుగెత్తింది... ప్రాణం కాపాడుకుంది

ABN , First Publish Date - 2020-12-11T06:46:36+05:30 IST

డిండి మండలం ఖానాపూర్‌ గ్రామంలో గురువారం ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనతో ఇంట్లోని వస్తువులు కాలిపోగా, గోడలు బీటలు వారాయి.

పరుగెత్తింది... ప్రాణం కాపాడుకుంది
పేలుడు ధాటికి కాలిన్ గృహోపకరణాలు, బీటలు వారిన గోడలు

ప్రమాదవశాత్తు పేలిన గ్యాస్‌ సిలిండర్‌ 

ఇంటి గోడలకు బీటలు

తప్పిన పెను ప్రమాదం 

డిండి, డిసెంబరు 10:  డిండి మండలం ఖానాపూర్‌ గ్రామంలో గురువారం ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనతో ఇంట్లోని వస్తువులు కాలిపోగా, గోడలు బీటలు వారాయి. ఇంటి యజమానురాలు అప్రమత్తమై బయటకు పరుగెత్తడంతో ప్రమాదం తప్పింది. డిండి ఆర్‌ఐ గోపరాజు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్‌ గ్రామానికి చెందిన దండుగల సైదమ్మ కూలి పని చేస్తూ జీవనం సాగిస్తోంది. భర్త మృతిచెందటంతో కుమారుడు హైదరాబాద్‌లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం ఉదయం వంట చేసేందుకు సైదమ్మ గ్యాస్‌ స్టవ్‌ను వెలిగించగా ఒక్కసారిగా మంటలు రెగ్యులేటర్‌ వరకు వ్యాపించాయి. భయాందోళనకు గురైన సైదమ్మ ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసింది. కొద్దిసేపటికే పెద్ద శబ్దంతో సిలిండర్‌ పేలి ఇంట్లో మంటలు వ్యాపించాయి. అప్పటికే సైదమ్మ బయటకు రావడంతో ప్రాణపాయం తప్పింది. మంటల్లో గృహోపకరణాలు, ఇంట్లోని వస్తువులు కాలిపోయాయి. పేలుడు ధాటికి గోడలు బీటలు వారగా, చుట్టుపక్కల ఇళ్లు కంపించాయి. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తి నష్టంపై రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2020-12-11T06:46:36+05:30 IST