పరికరాలున్నా నిరుపయోగం

ABN , First Publish Date - 2020-11-21T05:51:10+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్‌స్థాయి వైద్యం అందించి ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుచేసి పరికరాలను సమకూర్చినా వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు అవసరమైన సాంకేతిక వైద్య సిబ్బంది, వైద్యుల పోస్టుల ఖాళీల కారణంగా అవి మూలనపడ్డాయి.

పరికరాలున్నా నిరుపయోగం
దేవరకొండ ఆస్పత్రి

కొవిడ్‌ పేరుతో సమకూరిన విలువైన యంత్రాలు

వినియోగించేవారు లేక మూలకు

వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత

 (ఆంధ్రజ్యోతియాదాద్రి/సూర్యాపేట,  చౌటుప్పల్‌ టౌన్‌, ఆలేరు, దేవరకొండ): ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్‌స్థాయి వైద్యం అందించి ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుచేసి పరికరాలను సమకూర్చినా వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు అవసరమైన సాంకేతిక వైద్య సిబ్బంది, వైద్యుల పోస్టుల ఖాళీల కారణంగా అవి మూలనపడ్డాయి. ఆధునిక వైద్య చికిత్సలకు అవసరమైన రోగ నిర్ధారణ పరికరాలు కొన్ని మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో పేదలు వ్యయప్రయాసలకోర్చి ప్రైవేట్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. యాదాద్రి జిల్లా భువనగిరిలో జిల్లా కేంద్ర ఆస్పత్రి, ఆలేరు, చౌటుప్పల్‌, రామన్నపేట సీహెచ్‌సీలను సిబ్బంది కొరత వేధిస్తోంది. యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్స్‌రే మొదలు దంత వైద్యానికి ఉపయోగించే పరికరాలు వినియోగంలో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా విపత్తు కాలంలో ప్రజలకు అందుబాటులో వైద్యం అందించేందుకు కొత్తగా 40 పడకలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా పది ఆక్సిజన్‌ బెడ్లు, ఒక వెంటిలేటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆస్పత్రిలోని అన్నివార్డులకు ఆక్సిజన్‌ సదుపాయం కల్పించారు. కోవిడ్‌ రోగులకు చికిత్సల కోసం ముగ్గురు వైద్యులతో పాటు వివిధ కేటగిరిలకు చెందిన మరో 17మంది సిబ్బంది నియామకం కూడా జరిగింది. 200 మంది ఇన్‌పేషంట్లకు చికిత్సలు చేసేందుకు సౌకర్యాలు కల్పించారు. కాగా, ఇప్పటి వరకు సుమారు 7వేలమందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసి, ఐసోలేషన్‌లో ఉన్న రోగులకు వైద్యం అందించారు. భువనగిరి ఆస్పత్రిలో స్కానింగ్‌ యంత్రం ఉన్నా, పరీక్షలు నిర్వహించే రేడియాలజిస్టు లేడు. దంత పరీక్షల కోసం ఏడాది క్రితం ప్రత్యేకమైన చైర్‌, పరికరాలను సరఫరా చేసినా వాటిని అమర్చే ఏజెన్సీ పత్తాలేదు. దీంతో ఆస్పత్రి ఆవరణలో అవి ఏడాదిగా మూలనపడ్డాయి. బ్లడ్‌ బ్యాంక్‌ను లాంఛనంగా ప్రారంభించి ఏడాదైనా, వినియోగంలోకి తేలే దు. ఆలేరు ఆస్పత్రిలో ఎక్స్‌రే పరికరం మరమ్మతుకు గురికాగా, ఏడాది క్రితం కొత్త యంత్రం వచ్చినా దాన్ని సైతం నేటికీ అమర్చక నిరుపయోగంగా ఉంది.

ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత

యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరి ఆస్పత్రిలో 130 పోస్టులకు 68 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వివిధ కేటగిరిల్లో 62 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వివిధ వైద్య విభాగాలకు చెందిన 60 వైద్య నిపుణుల పోస్టులకు కేవలం 20 మంది మాత్రమే ఉన్నారు. 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 11 మంది సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్టులకు ఒక్క పోస్టు మాత్రమే భర్తీ అయింది. 10 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ పోస్టులు 11కు ఒక్కరే పనిచేస్తున్నారు. 10 ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌ పోస్టులు 25కు 16మందే పనిచేస్తుండగా, 9 ఖాళీగా ఉన్నాయి. 28 స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు 20మంది పనిచేస్తుండగా, 8 ఖాళీగా ఉన్నాయి.

 ఐదారు మండలాలకు కూడలి ప్రాంతంలో ఉన్న చౌటుప్పల్‌లో 30 పడకలతో సామాజిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఈ ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువ. ఇక్కడి నుంచి వెళ్తున్న జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. అటు రోగులు, ఇటు క్షతగాత్రులతో ఆస్పత్రి నిత్యం కిటకిటలాడుతుంటోంది. రోజుకు 150 నుంచి 200 వరకు ఓపీ చూస్తుండగా, 15-20 మంది ఇన్‌పేషెంట్లు ఉంటున్నారు. వారానికి 30-40 ప్రసవాలు చేస్తున్నారు. ఈ ఆస్పత్రిలో పది మంది వైద్యులకు ఏడుగురు ఉండగా, మరో ఐదుగురు వైద్యులు, 10మంది స్టాఫ్‌నర్స్‌లకు మొత్తం ఏడుగురు పనిచేస్తున్నారు. మరో 12 మంది, ఇద్దరు ల్యాబ్‌ టెక్నిషియన్లు, ఒక ఫార్మాసిస్ట్‌, ఐదుగురు ఎంఎన్‌వోలు, ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ అవసరమని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రభుత్వానికి నివేదించారు. ఇక్కడి ల్యాబ్‌లో అధునాతన పరికరాలు, డిజిటల్‌ ఎక్స్‌రే యూనిట్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. 

ఆలేరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా వైద్య సేవలు అంతంతగానే అందుతున్నాయి. ఇక్కడ ఎక్స్‌రే సౌకర్యం కూడా లేదు. ఎక్స్‌రే పరికరం సరఫరా చేసినా బిగించలేదు. డెంటల్‌ విభాగంలో డెంటల్‌ చైర్‌ విరగడంతో కొత్తది ఏడాది క్రితం వచ్చినా ఏర్పాటుకు నోచుకోలేదు. ఇక్కడ కూడా సిబ్బంది కొరత ఉంది. రామన్నపేట ఆస్పత్రుల్లో సైతం ఇదే పరిస్థితి. 

 దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిని 2018లో 50 నుంచి 100 పడకలకు అప్‌గ్రేడ్‌ చేశారు. రూ.కోటి వ్యయంతో నూతన భవనాన్ని నిర్మించినా 100పడకలకు నోచుకోలేదు. ఇక్కడికి నిత్యం 700-800 మంది రోగులు వస్తుంటారు. 25 మంది డాక్టర్లు 22 మంది పనిచేస్తున్నారు. 28 మంది సిబ్బంది, నలుగురు స్టాఫ్‌ నర్సులు, నలుగురు పార్ట్‌టైం ఏఎన్‌ఎంలు, ఇద్దరు టెక్నిషియన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా, ఆస్పత్రిని 50 పడకలకు అప్‌గ్రేడ్‌ చేయడంతోపాటు అవసరమైన వైద్యులు, సిబ్బంది నియామకం చేయాల్సి ఉంది. సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో డయాలసిస్‌ కేంద్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు.


వైద్యుల పోస్టులు భర్తీ చేయాలి :డాక్టర్‌ అలివేలు, చౌటుప్పల్‌ సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌

ఆస్పత్రిలో మూడు వైద్యుల పోస్టులను భర్తీ చేయడంతో పాటు మరో ఐదుగురిని నియమించాలి. ల్యాబ్‌లో అధునాతన పరికరాలు ఏర్పాటు చేయాలి. చౌటుప్పల్‌ కూడలి ప్రాంతం కావడంతో ఐదారు మండలాలకు చెందిన రోగులతో పాటు హైవే ప్రమాదాల క్షతగాత్రులు వస్తున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం.


కొవిడ్‌ రోగులకు పూర్తిస్థాయి సేవలు : డాక్టర్‌ రవిప్రకాష్‌, భువనగిరి ఆస్పత్రి సూపరింటెండెంట్‌

జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రోగులతోపాటు,  కొవిడ్‌ పాజిటివ్‌లకు పూర్తిస్థాయి వైద్యసేవలు అందిస్తున్నాం. ఎన్ని కొవిడ్‌ కేసులు వచ్చినా చికిత్స చేస్తాం. వారం పది రోజుల్లో బ్లడ్‌ బ్యాంక్‌ సేవలను సైతం అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


Updated Date - 2020-11-21T05:51:10+05:30 IST