పంట పైసల కోసం పడిగాపులు
ABN , First Publish Date - 2020-12-06T05:20:51+05:30 IST
అన్నదాతకు అడుగడుగునా కష్టమే. అకాల వర్షాలు, చీడపీడలను తట్టుకొని పంట విక్రయానికి వస్తే అన్నీ ఆటంకాలే. మద్దతు ధర లభించకపోగా, టోకెన్లు, కాంటాల కోసం రోజు ల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారు.

అధికారులు, బ్యాంకుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు
నల్లగొండ జిల్లాలో రూ.424కోట్ల బకాయిలు
10 రోజులుగా పత్తి, ధాన్యం రైతుల ఎదురుచూపులు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ)
అన్నదాతకు అడుగడుగునా కష్టమే. అకాల వర్షాలు, చీడపీడలను తట్టుకొని పంట విక్రయానికి వస్తే అన్నీ ఆటంకాలే. మద్దతు ధర లభించకపోగా, టోకెన్లు, కాంటాల కోసం రోజు ల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారు. లాభమో, నష్టమో పంట విక్రయించాక డబ్బుల కోసం రైతులు 10 రోజు లు ఎదురుచూడక తప్పడంలేదు. డబ్బుల కోసం అధికారులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రైతు పంటవిక్రయించిన 42 గంటల్లో వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని ప్రభుత్వం, అధికారులు నిత్యం చెబుతున్నా ఎప్పుడు వస్తాయో తెలియని దుస్థితి. ఒక్క నల్లగొండ జిల్లాలో పత్తి, ధాన్యానికి సంబంధించి రైతులకు రూ.424కోట్లు రావాల్సి ఉంది.
నల్లగొండ జిల్లాలో ఈ ఏడాది 7.25లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. పంట చేతికొచ్చే సమయంలో వారం పాటు ఎడతెగని వర్షాలతో పత్తి నాని బూజు పట్టింది. వాతావరణం అనుకూలించక తెగుళ్లు చుట్టుముట్టాయి. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, 5క్వింటాళ్లకే పరిమితమైంది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.5,825 కాగా, నల్లబారింది, తేమ శాతం ఎక్కువగా ఉందని, పింజ పొడువు తక్కువగా ఉందనే కారణాలతో మద్దతు ఽధర చెల్లించడం లేదు. నల్లగొండ జిల్లాలో డిసెంబరు 2వ తేదీ వరకు 26,490 మంది రైతులు పత్తి విక్రయించగా, 15234 మందికి డబ్బు జమైంది. మిగతా రైతులకు సొమ్ము జమకాకపోగా, 10 రోజులుగా వారు ఎదురుచూస్తున్నారు. మొత్తం రూ.502 కోట్లకు ఇప్పటి వరకు రూ.261 కోట్లు మాత్రమే చెల్లించారు. పత్తి కొనుగోలు చేశాక కాంటా వివరాలను మార్కెట్ కార్యదర్శి, సీసీఐ అధికారి మహబూబ్‌నగర్‌లోని రీజనల్ ఆఫీసుకు ఆన్‌లైన్‌లో పంపాలి. కొనుగోళ్లు పెరగడంతో ఏ రోజుకు ఆరోజు వివరాలు పంపకపోవడం, నమోదులో తేడాల కారణంగా బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతోంది. 45 క్విం టాళ్లకు మించిన వాహ నం ఏదైనా ఉంటే దానికి రీజనల్ ఆఫీసు నుంచి అనుమతి తీసుకోవాలి. అక్కడ సీరియల్ ఉంటోంది. అంతా పూర్తయ్యాక బ్యాంకుల్లో సొమ్ము జమ అయితే నగదు అందుబాటులో లేదని బ్యాంకర్లు పూర్తిస్థాయిలో కాకుండా వాయిదా పద్ధతుల్లో రైతులకు చెల్లింపులు చేస్తున్నారు. మండల కేంద్రాల్లో రెండు నుంచి మూడు బ్యాంకులు ఉండగా, అందులో అత్యధికంగా రైతుల ఖాతాలే ఉంటాయి. దీంతో నగదు కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
ధాన్యం చెల్లింపులు సైతం..
సన్నరకం వరి సాగు చేసిన రైతులు ధాన్యం విక్రయానికి అష్టకష్టాలు పడ్డారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో దొడ్డురకం ధాన్యం విక్రయించిన రైతులు డబ్బు కోసం ఎదురుచూడక తప్పడంలేదు. జిల్లాలో ఎక్కువ శాతం సన్నాలు సాగు చేయగా, విక్రయానికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేతికి వచ్చిన ధాన్యాన్ని రోజుల తరబడి కల్లాలు, ఇంటి వద్ద నిల్వచేసే పరిస్థితి లేక మద్దతు ధర రాకున్నా రైతులు దళారులకు విక్రయించారు. ఈ నేపథ్యంలో టోకెన్ విధానం అమలులోకి తీసుకురాగా, ప్రభుత్వం సైతం కొనుగోలు కేంద్రాల్లో సన్నాలు కొనుగోలు చేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటికే విక్రయించిన దొడ్డు రకం ధాన్యానికి సంబంధించిన రైతులకు చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, ప్యాక్స్, వ్యవసాయ మార్కెట్ల ఆధ్వర్యంలో 161 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా రూ.300కోట్ల విలువైన 1,59,208 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. సాఽధారణంగా ప్రభుత్వం దొడ్డు రకం ఽధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తుంది. కానీ, ఈమారు సన్నరకం ఎక్కువ విస్తీర్ణంలో సాగు కాగా, దిగుబడి భారీగా రావడంతో మిల్లర్లు మొత్తం కొనుగోలు చేయలేమని చేతులు ఎత్తేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుకొచ్చి సన్నరకం కొనుగోలు చేయడం ప్రారంభించగా, శుక్రవారం నాటికి జిల్లా వ్యాప్తంగా 28,609 మంది రైతుల నుంచి 1,59,208 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో సన్న, దొడ్డు రకం ధాన్యం ఉంది.
10 రోజులైనా పత్తి డబ్బులు పడలేదు : లింగంపల్లి సైదులు, జంగారెడ్డిగూడెం
సీసీఐ కేంద్రంలో 10రోజుల క్రితం పత్తి విక్రయించా. ఇప్పటి వరకు డబ్బులు బ్యాంకు ఖాతాలో జమకాలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. అసలే దిగుబడి తక్కువ. పెట్టుబడులు కూడా రాలేదు. యాసంగి సాగుకు పెట్టుబడి కోసం చేతిలో చిల్లిగవ్వ లేదు. ప్రభుత్వం వెంటనే పత్తి డబ్బు చెల్లించాలి.
19 రోజులైనా డబ్బులు రాలేదు : జంగా అంజయ్య, కచాపురం, మునుగోడు
మునుగోడు సీసీఐ కేంద్రానికి నవంబరు 16న పత్తిని అద్దె ట్రాక్టర్‌లో తీసుకెళ్లి విక్రయించా. 29 క్వింటాళ్ల తూకం వచ్చింది. క్వింటాకు రూ.5500 ధర పలికింది. వారంలోగా డబ్బులు బ్యాంక్ ఖాతాలో పడతాయన్నారు. 19 రోజులైనా ఇప్పటి వరకు డబ్బు జమకాలేదు.