పేటలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-04-21T09:31:20+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

పేటలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు

రెడ్‌జోన్లలో కొనసాగుతున్న వైద్యశిబిరాలు 

ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ


సూర్యాపేట, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం 13 రెడ్‌జోన్లలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి అనుమానితుల స్వాబ్‌ నమూనాలు సేకరిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంతోపాటు, బీబీగూడెం సమీపంలోని జామ్లాతండా, పెన్‌పహాడ్‌ మండలంలోని అనంతారం గ్రామంలో కూడా కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి బంధువులను, వారితో సన్నిహితంగా మెలిగిన వారిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. వారి స్వాబ్‌ నమూనాలను పరీక్షలకు పంపారు. వీరిలో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే గాంధీ ఆసుపత్రికి, నెగిటివ్‌ వస్తే ఇంటికి పంపిస్తున్నారు.


ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో 54మందికి కరోనా పాజిటివ్‌ రాగా, 713 మంది స్వాబ్‌ నమూనాలు పంపారు. 205 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు వెలుగుచూసిన పాజిటివ్‌ గ్రామాల్లో 43 ఆరోగ్య బృందాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించారు. మూడు అర్బన్‌హెల్త్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది, బీబీగూడెం తండాల్లోని 2258 గృహల సర్వే నిర్వహించి 7805 మందికి ఆరోగ్య పరీక్షలు చేశారు. కరోనా పాజిటివ్‌ వ్యక్తుల కుటుంబ సభ్యులకు, వారిని కలిసిన వ్యక్తులను గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. సోమవారం 60 మంది స్వాబ్‌ నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. వాటి ఫలితాలు రావాల్సి ఉంది.


Updated Date - 2020-04-21T09:31:20+05:30 IST