కోటి 90 లక్షలు

ABN , First Publish Date - 2020-04-08T10:47:11+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉంది. రబీ సీజన్‌లో నీటి లభ్యత పెరగడంతో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా

కోటి 90 లక్షలు

ఇవీ ఉమ్మడి జిల్లాకు కావల్సిన

గన్నీ బ్యాగుల సంఖ్య


సూర్యాపేట,ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి)/నల్లగొండ / హుజూర్‌నగర్‌  : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉంది. రబీ సీజన్‌లో నీటి లభ్యత పెరగడంతో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో దిగుబడి కూడా భారీగానే వస్తుందని అధికారులు ప్రణాళికలు రూపొందించుకున్నారు. కానీ, అందుకు తగ్గ ఏర్పాట్లలో మాత్రం విఫలమవుతున్నారు. వారం రోజుల కిందటే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా, గన్నీ బ్యాగుల కొరత ఇతర కారణాలతో కొనుగోళ్లు జరగడం లేదు. ఆకాశంలో కమ్ముతున్న మబ్బులతో రైతుల్లో ఓ వైపు ఆందోళన మొదలైంది. అయినా కేంద్రాలకు చేరాల్సిన గన్నీబ్యాగులు రాలేదు. నల్లగొండ జిల్లాలో 600 కొనుగోలు కేంద్రాల్లో 6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందు కోసం కోటి 50 లక్షల గన్నీ బ్యాగులు కావాల్సి ఉండగా, ప్రస్తుతం 80 లక్షల బ్యాగులు సివిల్‌ సప్లయ్‌ సంస్థ వద్ద ఉన్నాయి. వీటితో 3.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించే అవకాశం ఉంది.


మరో మూడు రోజుల్లో 5 లక్షల బ్యాగులు వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇంకా 65 లక్షల గన్నీ బ్యాగులు అవసరం కానున్నాయి. అదేవిధంగా టార్ఫాలిన్ల కొరత కూడా ఉంది. ప్రస్తుతం అకాల వర్షాలు వచ్చే అవకాశాలు ఉండటం, ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం, వడగండ్ల వాన వచ్చే అవకాశాలు ఉండటంతో ధాన్యం రాశులు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ధాన్యం విక్రయించకముందే తడిస్తే రైతులు నష్టపోయే ప్రమాదముంది. సూర్యాపేట జిల్లాలో జిల్లాలో 310 కొనుగోలు కేంద్రాల్లో  సుమారు 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించారు. ఇందుకోసం 87 లక్షల గన్నీ బ్యాగులు కావాల్సి ఉంది. పాతవి 20 లక్షల వరకు ఉండగా, 10 లక్షల వరకు కొత్తవి వచ్చాయి.


ఇందులో 10 లక్షలు మాత్రమే కొనుగోలు కేంద్రాలకు పంపిణీ చేశారు. ఇంకా 50 లక్షల గన్నీ బ్యాగులు రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రతి కొనుగోలు కేంద్రానికి 10 వేల క్వింటాళ్లకు మించి ధాన్యం వచ్చింది. ఈ తరుణంలో 15 వేలకు పైగా గన్నీ బ్యాగులు అవసరం కాగా ప్రతి కేంద్రంలో 3 నుంచి 5 వేల లోపు గన్నీ బ్యాగులు ఉన్నాయి.  వసతులు కల్పించకుండానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాత్రం అట్టహాసంగా ప్రారంభించారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో అతిపెద్ద ఆయకట్టు నాగార్జునసాగర్‌ ప్రాంతంలోని కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా ధాన్యం రాశులు కనిపిస్తున్నాయి. మార్చి 15 నాటికే చాలాచోట్ల పూర్తి స్థాయిలో పంట చేతికొచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కోటి గన్నీ బ్యాగులు అవసరం కాగా కేవలం 25 లక్షల బ్యాగులు మాత్రమే వచ్చాయి. ఇంకా 75 లక్షల బ్యాగులు రావాల్సి ఉంది. 


గన్నీ బ్యాగులు పంపిణీ చేస్తాం

సాంకేతిక సమస్య ఒకటి, రెండు రోజుల్లో పరిష్కారం కానుంది. కొనుగోలుకు సంబంధించిన తేమ శాతం యంత్రాలు, టార్ఫాలిన్లు సిద్ధంగానే ఉన్నాయి. రేషన్‌ డీలర్లకు అందజేసిన గన్నీ బ్యాగులను కూడా తెప్పించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేస్తాం.

-  సంజీవరెడ్డి, అదనపు కలెక్టర్‌, సూర్యాపేట జిల్లా

Updated Date - 2020-04-08T10:47:11+05:30 IST