అమెరికాలో ఉంటున్న ఈ సాఫ్ట్వేర్ దంపతుల పరిస్థితి తెలిస్తే...
ABN , First Publish Date - 2020-04-05T13:11:46+05:30 IST
కరోనా ప్రభావం, లాక్డౌన్తో విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్నాం. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మునిసిపాలిటీ కేంద్రానికి చెందిన...

విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం
అమెరికాలో సాఫ్ట్వేర్ దంపతుల ఆందోళన
తిరుమలగిరి: కరోనా ప్రభావం, లాక్డౌన్తో విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్నాం. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మునిసిపాలిటీ కేంద్రానికి చెందిన రాపాక మహేష్, అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతని భార్య పూజతో కలిసి అమెరికాలో హార్ట్ఫోర్డ్ రాష్ట్రంలోని కనెక్టికట్ నగరంలో ఉంటున్నారు. వారు శనివారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడం, పాజిటివ్ కేసులు పెరిగి చాలామంది చనిపోతుండడంతో భయంగా గడుపుతున్నాం. అయిన వాళ్లు, ధైర్యం చెప్పేవాళ్లు లేక ప్రతిరోజూ ఏమి జరుగుతుందో అర్థంకాక ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటూ, జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే ఉంటున్నాం.
భారత్కు సంబంధించిన అన్ని స్టోర్లను మూసేశారు. కనీసం మంచినీళ్లు కూడా దొరకడంలేదు. నెలకు కావాల్సిన సరుకులు ముందే తెచ్చుకున్నాం. వాటర్ బాటిళ్లకోసం గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వస్తుంది. ఇంకా ఎన్నిరోజులు ఇలా ఉండాల్సి వస్తుందో తెలియడం లేదు. ఇండియా రావాలని జనవరి నెలలో టికెట్లు బుక్ చేసుకున్నాం. విమానాలు రద్దు కావడంతో చాలా బాధపడ్డాం. అంతా కుదుటపడ్డాక స్వదేశానికి వచ్చి కుటుంబ సభ్యులతో కొన్ని రోజులు హాయిగా గడిపి తిరిగి వెళ్లిపోతాం.