కడదాకా ప్రజాసేవలోనే...

ABN , First Publish Date - 2020-12-03T06:20:52+05:30 IST

అభివృద్ధి కోసం పరితపించిన నేత అసెంబ్లీలో ప్రజాసమస్యలపై నిత్యం పోరు

కడదాకా ప్రజాసేవలోనే...
వ్యవసాయ క్షేత్రంలో సతీమణితో నోముల(ఫైల్‌)

అభివృద్ధి కోసం పరితపించిన నేత 

అసెంబ్లీలో ప్రజాసమస్యలపై నిత్యం పోరు 

సాగర్‌ నియోజకవర్గాన్ని పరుగులు పెట్టించిన నోముల

వ్యవసాయమన్నా, రైతులన్నా ఎనలేని ప్రేమ   

ఆయనలేక బోసిపోయిన ప్రజావేదిక

నేడు స్వగ్రామం పాలెంలో అంత్యక్రియలు 

హాజరుకానున్న సీఎం కేసీఆర్‌


చిన్న నాటి నుంచి కష్టపడే తత్వం. ఎవరైనా సాయం కోరి వస్తే లేదనని మనస్తత్వం. నిత్యం ప్రజ ల్లో ఉంటూ, ప్రజలకోసం పనిచేసిన నర్సన్న నియోజకవర్గానికి చేసిన సేవ, చేపట్టిన పనులు అభివృద్ధికి బాటలువేశాయి. సామాన్య కార్యకర్తగా మొదలైన ఆయ న జీవితం ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో కష్టనష్టాల నుంచి నాయకుడంటే ఇలా ఉండాలి అనే స్థాయికి ఎదిగారని నియోజకవర్గవాసులు అంటున్నారు. బాల్యంలోనే తల్లిదండ్రుల వెంట పొలానికి వెళ్లే నర్సింహయ్యకు వ్యవసాయం అంటే ప్రాణం. అప్పుడప్పుడు కూలీలతో కలిసి సరదాగా కాసేపు నాట్లు వేస్తుండేవారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఖాళీ దొరికినప్పుడల్లా వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి పంటలను పర్యవేక్షిస్తుండేవారు. అందరికీ అన్నివేళలా అందుబాటులో ఉండే నర్సన్న ఇక లేరని తెలుసుకున్న నియోజకవర్గ ప్రజల గుండె దుఃఖసాగరం అయ్యింది. ఇన్నాళ్లు తమ కన్నీళ్లు తుడిచిన చేతులు ఇక లేవని తెలిసి కన్నీటి పర్యంతమైంది. 

హాలియా, డిసెంబరు 2: పోరాటాలే పరమావధిగా ఆవిర్భవించిన కమ్యూనిస్టు పార్టీ భావాల్లోంచి వచ్చిన నోముల నర్సింహయ్య 2014లో నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో అడుగుపెట్టారు. అప్పటిదాకా ఉన్న నకిరేకల్‌ నియోజకవర్గం ఎస్సీ కి రిజర్వ్‌ కావడంతో ఇక్కడికి మారారు. కాంగ్రె్‌సకు కంచుకోటగా ఉన్న సాగర్‌లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసి కుందూరు జానారెడ్డి పై ఓటమి చవిచూశారు. అయినా పట్టువదలకుండా ప్రజల మఽధ్యే ఉండి నిరంతరం వారికి చేదోడు వాదోడుగా ఉండడంతో ప్రజలు 2018 ఎన్నికల్లో నోములకు పట్టంకట్టారు. నాటినుంచి నేటి వరకు నియోజకవర్గాన్ని అభివృద్ధి పుంతలు తొక్కించడంలో తనదై న ముద్ర వేసుకున్నారు. కేంద్రం నిధులతోపాటు, రాష్ట్రం నిధులను మంజూరు చేయిస్తూ సాగర్‌ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తూ వస్తున్నారు. ఇంతలో ఆయన మృతి చెందారన్న విషయం తెలుసుకున్న కార్యకర్తలు, అభిమానులు దిగ్ర్భాంతికి లోనయ్యారు. 


అభివృద్ధి కార్యక్రమాల పరంపర

శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన నాటినుంచి నర్సింహయ్య నియోజకవర్గానికి ఏమి కావాలో తెలుసుకొని, వాటిని తీసుకురావడంలో విజయవంతమయ్యారు. సాగర్‌లో 100పడకల ఆస్పత్రి, పా లిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేశారు. 100 ఎకరాల్లో అర్బన్‌ పార్కుతోపాటు ఎన్నెస్పీ నుంచి మునిసిపాలిటీకి బదిలీచేయించారు. మునిసిపాలిటీలుగా సాగర్‌, హాలియాలను మార్చడంలో కీలకపాత్ర పోషించారు. హాలియాలో మినీ స్టేడియం, రాచకాల్వ ఏర్పాటు చేశారు. ఏడు చెక్‌ డ్యాంల మంజూరు చేయించి, డబుల్‌ బెడ్‌రూం ఇ ళ్లకు టెండర్‌ ప్రక్రియ పూర్తి చేశారు. నియోజకవకర్గంలోని గుర్రంపోడులో వెంకటాపురంనుంచి ఊట్లపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మించారు. పాల్వాయి బస్టాండ్‌, ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మించారు. నిడమనూరు మండలంలో మినీ ట్యాంక్‌బండ్‌ని అభివృద్ధి చేశారు. గుంటిపల్లిలో కేటీఆర్‌ ప్రకృతివనం, మున్సిఫ్‌ కోర్టు భవనం మంజూరు చేయించారు. త్రిపురారంలో సబ్‌ మార్కెట్‌ యార్డు, త్రిపురారం నుంచి కుక్క డంవరకు రూ.230 కోట్లతో బీటీ రోడ్డు మంజూరు చేయించారు. డొంకతండా లిఫ్టు ఇరిగేషన్‌ను మంజూరు చేయించారు. 


వ్యవసాయ ప్రేమికుడు ‘నోముల’ 

ప్రజాసమస్యలపై నిత్యం పనిచేస్తూనే ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తనకున్న వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పనులను పరిశీలించేవారు. వ్యవసాయమన్నా, రైతులన్నా విపరీతమైన ఇష్టం ఉండేది. ఎమ్మెల్యేగా ఉన్నా, వ్యవసాయంపై ఉన్న మక్కువతో స్వగ్రామం పాలెంలోని పొలంలో వరి, పత్తి, బత్తా యిసాగుచేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండేవారు. హాలియాలోని నోముల నివాసం నిత్యం ప్రజలతో కళకళలాడేది. స్థాయితో సంబంధం లేకుండా నేరుగా సామాన్యుడు సైతం ఇంటికి చేరుకొని తన సమస్యను నోములకు విన్నవించుకునేవాడు. నోముల మృతితో ఆయ న నివాసం ప్రజావేదిక బోసిపోయింది. 


సాగు, తాగునీటికోసం కృషి 

నిడమనూరు మండలం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలుచేసిన ఎమ్మెల్యే నోముల ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. తాగు, సాగు నీరందించే చెరువు తెగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరించారు.


నేడు నోముల అంత్యక్రియలు: ఏర్పాట్లు చేసిన అధికారులు 

నకిరేకల్‌, డిసెంబరు 2: నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామం నకిరేకల్‌ మండలం పాలెం గ్రామంలో అధికార లాంఛనాలతో నిర్వహించనున్నా రు. ఈనెల 1న గుండెపోటుతో మృతి చెందిన నర్సింహయ్య భౌతికదేహాన్ని నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రిలో భద్రపరిచారు. గురువారం ఉదయం 9 గంటల సమయంలో నార్కట్‌పల్లి కామినేని నుంచి పార్ధీవదేహాన్ని నకిరేకల్‌లోని ఆయన సొంత ఇంటికి తీసుకొచ్చి పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్ధం ఉంచుతారు. అనంతరం సొంత గ్రామమైన మండలంలోని పాలెం గ్రామశివారులోని ఆయన వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు తరలిస్తారు. 


సీఎం కేసీఆర్‌ పర్యటన ఇలా 

- ఉదయం 10.50గంటలకు ప్రగతిభవన్‌ నుంచి బయలుదేరి 10.55గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

- 11.00గంటలకు బేగంపేట నుంచి బయలుదేరి 11.25గంటలకు నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం నోముల హెలీప్యాడ్‌ వద్దకు వస్తారు.

- నోముల అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం 12.00గంటలకు తిరిగి హెలీప్యాడ్‌ నుంచి బయలుదేరి 12.25గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

- 12.30గంటలకు అక్కడినుంచి బయలుదేరి 12.35గంటలకు ప్రగతిభవన్‌కు చేరుకుంటారు. 

Updated Date - 2020-12-03T06:20:52+05:30 IST