తగ్గించారా..?.. ఐదు రోజులుగా అక్కడ కరోనా కేసులు నిల్..
ABN , First Publish Date - 2020-04-28T18:29:33+05:30 IST
సూర్యాపేట జిల్లాలో ఐదు రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఈ నెల 2వ తేదీ నుంచి 22 వరకు వరుసగా అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవడంతో అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరైంది. ఈ నేపథ్యంలో పర్యటించిన

పేటలో నమోదుకాని పాజిటివ్ కేసులు
వైరస్ లక్షణాలు కనిపిస్తేనే వైద్య పరీక్షలు
అందుకే కేసుల సంఖ్య తగ్గిందన్న ఆరోపణలు
(సూర్యాపేట, ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లాలో ఐదు రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఈ నెల 2వ తేదీ నుంచి 22 వరకు వరుసగా అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవడంతో అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరైంది. ఈ నేపథ్యంలో పర్యటించిన రాష్ట్ర బృందం ప్రస్తుతం కరోనా పాజిటివ్ వచ్చిన ప్రైమరీ కాంటాక్టులకు మాత్రమే పరీక్షలు నిర్వహించాలని సూచించింది. గతంలో ప్రైమరీ కాంటాక్టులకేగాక, ద్వితీయ, తృతీయ కాంటాక్టులకు కూడా పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో అధికారులు చేసిన ప్రయత్నం మంచిదే అయినా, ఒకేసారి అంతమందికి పరీక్షలు నిర్వహించడం కష్టసాధ్యమవుతోందని రాష్ట్రస్థాయి అధికారులు భావించారు. ఫలితంగా ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచే అనుమానితుల సంఖ్య భారీగా తగ్గింది. సెంకడరీ కాంటాక్ట్ చైన్ తెగిపోవడం వల్లే జిల్లాలో కేసుల సంఖ్య పెరగడంలేదని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఈ నెల 22న మొత్తం 796 మంది స్వాబ్ నమూనాలు సేకరించగా, ఆ తరువాత ఎవరి నమూనాలు తీసుకోలేదు. ప్రభుత్వ క్వారంటైన్‌లో ఆ రోజు 187 మంది ఉండగా, ప్రస్తుతం 16 మందే ఉన్నారు. హోంక్వారంటైన్‌లో 4382 మంది ఉండగా, ప్రస్తుతం 4551 మంది ఉన్నారు. ప్రభుత్వ క్వారంటైన్‌లో సంఖ్య తగ్గగా, హోంక్వారంటైన్‌లో ఉండే వారి సంఖ్య పెరిగింది. అయితే పరీక్షల సంఖ్య తగ్గడం వల్లే పాజిటివ్ కేసులు బయటపడటం లేదన్న ఆరోపణలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. కేసుల సంఖ్య తగ్గడంతో కట్టడి జాబితా నుంచి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ, మట్టంపల్లి, నేరేడుచర్ల ప్రాంతాలను తొలగిస్తున్నట్లు కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. ఆయా ప్రాంతాల్లో గత 14 రోజులుగా ఎటువంటి పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు.
వైరస్ లక్షణాలు ఉంటేనే పరీక్షలు
కరోనా వైరస్ లక్షణాలు ఉంటేనే పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో 4551 మంది హోంక్వారంటైన్‌లో ఉన్నా రు. వీరందరి ఇళ్లకు ఆరోగ్య శాఖ బృందాలు నిత్యం వెళ్తున్నాయి. ఆరో గ్య పరీక్షలు నిర్వహించి, ఎవరికైన కరోనా లక్షణాలైన గొంతునొప్పి, దగ్గు, జలుబు, జ్వరం ఉంటే స్వాబ్ నమూనాలు సేకరించి పరీక్షలకు హైదరాబాద్‌కు పంపుతున్నారు. అయితే గతంలో కరోనా లక్షణాలు లేకున్నా సుమారు 70 మంది వరకు పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టు వచ్చింది. మరి ఇలాంటి కేసులను ఎలా గుర్తిస్తారో అధికారులు చెప్పడం లేదు. కరోనా వైరస్ సోకి లక్షణాలు లేని వ్యక్తి బయట తిరిగితే మళ్లీ కేసుల సంఖ్య పెరిగే ప్రమాదముంది.
పరీక్షలు తగ్గించడంపై చర్చ
కరోనా పరీక్షలు తగ్గించడంపై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. కరోనా తగ్గిం దా, లేక అధికారులు కావాలనే సంఖ్యను తగ్గించారా అనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది. 83పాజిటివ్ వచ్చిన చోట తిరిగి కేసులు నమోదుకాకపోవడమేంటని అంతా ప్రశ్నిస్తున్నారు. కావాలనే పరీక్షలు నిర్వహిండం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉద్దేశ్యపూర్వకంగానే నమూనాలు తగ్గించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వీటిని అధికారులు కొట్టివేస్తున్నారు. ఇది లా ఉండగా, జిల్లాలో ఇప్పటి వరకు సూర్యాపేటలో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తొండతిరుమలగిరిలో ఆరు, నాగారం మండలం వర్ధమానుకోటలో ఆరు, ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూరులో 15, బీబీగూడెంలో మూడు, నేరేడుచర్ల, పెన్‌పహాడ్ మండలం అనంతారం, మద్దిరాల మండలం పోలుమళ్లలో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి. మొత్తం 83 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు చికిత్సపొంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 77 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
వైరస్ లక్షణాలు ఉంటేనే నమూనాల సేకరణ: వినయ్‌కృష్ణారెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్.
వైరస్ లక్షణాలు ఉంటేనే పరీక్షల నిమిత్తం స్వాబ్ నమూనాలు సేకరిస్తున్నాం. జిల్లాలో ఇప్పటికే ఆరుగురు వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మిగితావారు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా నమూనాల సేకరణ తగ్గించారణడం వాస్తవం కాదు. ప్రజలు ధైర్యంగా ఉండి లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాలి.
కేసులు తగ్గుతున్నా పర్యవేక్షణ కొనసాగుతుంది
కరోనా వైరస్ పాజిటి వ్ కేసులు తగ్గుతున్నా, అనుమానితులపై అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కట్టడి ప్రాంతమైన కుడకుడను ఎస్పీ భాస్కరన్‌తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 14 రోజుల నుంచి కుడకుడ ప్రాంతంలో ఎటువంటి పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో రెడ్‌జోన్ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు తెలిపారు. ఇప్పటి నుంచి కరోనా వైరస్ లక్షణాలు ఉంటేనే పరీక్షల కోసం నమూనాలు సేకరిస్తామన్నారు. కుడకుడను కట్టడి జాబితా నుంచి తొలగించినా ఆరోగ్య సర్వే యథావిధిగా కొనసాగుతుందన్నారు. అన్ని ప్రాంతాల్లో 28 రోజుల పాటు ఇంటింటి సర్వే కొనసాగుతోందన్నారు. జిల్లాలో సెకండరీ కాంటాక్ట్ చైన్ తెగిపోవడంతో పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గిందన్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకుం డా స్వీయనియంత్రణలో ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించి భౌతికదూరం పాటించాలన్నారు. కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కేసులు నమో దు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట డీఎస్పీ మోహన్‌కుమార్, రూరల్ సీఐ విఠల్‌రెడ్డి, తహసీల్దార్ పులి సైదు లు, చివ్వెంల ఎస్‌ఐ లోకే్‌షకుమార్ తదితరులు ఉన్నారు.
కరోనా అప్‌డేట్స్:
నల్లగొండ | సూర్యాపేట | యాదాద్రి | మొత్తం | |
మొత్తం పాజిటివ్ కేసులు | 15 | 83 | 0 | 98 |
మొత్తం నెగటివ్ కేసులు | 486 | 658 | 67 | 1211 |
మృతుల సంఖ్య | 0 | 0 | 0 | 0 |
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి | 11 | 6 | 0 | 17 |
సేకరించిన శాంపిళ్లు | 512 | 747 | 67 | 1326 |
వెలువడాల్సిన ఫలితాలు | 0 | 0 | 0 | 0 |
ప్రభుత్వ క్వారంటైన్‌లో | 10 | 16 | 0 | 26 |
హోం క్వారంటైన్‌లో | 9,293 | 4551 | 598 | 14,442 |