ధాన్యం టోకెన్ల కోసం రోడ్డెక్కిన రైతులు
ABN , First Publish Date - 2020-11-13T10:52:48+05:30 IST
రైతులకు టోకెన్ కష్టాలు తప్పడం లేదు. ముందస్తు సమాచారం లేకుండా టోకెన్ల పంపిణీని గురువారం నిలిపివేయటంతో రైతులు నిరసన వ్యక్తం చేశారు.
మిర్యాలగూడ, వేములపల్లి, నవంబరు 12: రైతులకు టోకెన్ కష్టాలు తప్పడం లేదు. ముందస్తు సమాచారం లేకుండా టోకెన్ల పంపిణీని గురువారం నిలిపివేయటంతో రైతులు నిరసన వ్యక్తం చేశారు. మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ నెల 13వ తేదీకి సంబంధించిన టోకెన్లను 10వ తేదీనే అధికారులు జారీ చేశారు. 18వ తేదీ వరకు సంబంధించిన టోకెన్ల కోసం 11వ తేదీన 1350 మంది రైతులకు సీరియల్ నంబర్లు ఇచ్చి పంపారు.
ఇందులో గురువారం విషయాన్ని పేర్కొనలేదు. కాగా, దీనిపై ముందస్తు సమాచారం లేకపోవటంతో రైతులు గురువారం పలు గ్రామాల నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. తీరా టోకెన్లు ఇవ్వడం లేదని తెలిసి కార్యాలయం గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ వన్‌టౌన్ సీఐ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి పంపించారు. ఇదిలా ఉండగా, టోకెన్ల కోసం రైతులు వేములపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై రాస్తారోకో చేశారు. గురువారం ఉదయం టోకెన్ల కోసం రైతులు ఎంపీడీవో కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చారు. అయితే ఈ 13వ తేదీ వరకు టోకెన్లు జారీచేసేది లేదని అధికారులు చెప్పడంతో ఆగ్రహించిన రైతులు రాస్తారోకో చేశారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోగా, విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సుధీర్‌కుమార్ అక్కడికి చేరుకొని అవసరమైన టోకెన్లు రైతులకు అందేలా చూస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. అదేవిధంగా ఎంపీడీవో కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.