డీజిల్ దొంగలు ఎవరు
ABN , First Publish Date - 2020-11-13T10:46:31+05:30 IST
తెలంగాణ-ఆంధ్రాకు ప్రయాణికులను చేర్చడంలో కీలకంగా ఉన్న మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌లో నిఘా కరువైంది. రాత్రి పది దాటితే ఆకతాయిల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది.
పక్కా ప్లాన్‌తోనే కాజేశారా!
బస్టాండ్‌లో పనిచేయని సీసీ కెమెరాలు
లోతుగా విచారిస్తున్న పోలీసులు
మిర్యాలగూడ అర్బన్, నవంబరు 12: తెలంగాణ-ఆంధ్రాకు ప్రయాణికులను చేర్చడంలో కీలకంగా ఉన్న మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌లో నిఘా కరువైంది. రాత్రి పది దాటితే ఆకతాయిల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. నిత్యం ప్రయాణికులు కలియదిరిగే బస్టాండ్‌లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగల ముఠాల సంచారం ఎక్కువైంది. ఈనెల 10న బస్టాండ్ ఆవరణలో నిలిపిన ఆర్టీసీ అద్దె బస్సుల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు డీజిల్ దొంగిలించిన ఘటన ఆర్టీసీ అధికారులను ఇరకాటంలో పడవేసింది. దీని వెనుక ఇంటిదొంగల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన రహదారి వెంట పార్క్ చేసిన వాహనాల నుంచి డీజిల్‌ను దొంగిలించే ముఠా పనే అనే సందేహాలూ ఉన్నాయి. ఏకకాలంలో మొత్తం తొమ్మిది అద్దె బస్సుల ట్యాంకుల నుంచి సుమారు వెయ్యిలీటర్ల డీజిల్ కాజేయడం ఒక్కరిద్దరితో సాధ్యపడదని, ఇదీ కచ్చితంగా ముఠాపనై ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
సీసీ కెమెరాలు పనిచేసి ఉంటే..
ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నాలుగేళ్ల క్రితం దాతల సహాయంతో పోలీసులు తొమ్మిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కొంత కాలంగా ఇవి పనిచేయకపోయినా అధికారులు పట్టించుకోలేదు. విషయాన్ని కనీసం పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంలో కూడా ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఫలితంగానే ఆకతాయిలు, దొంగల ముఠాల ఆగడాలకు అడ్డు లేకుండాపోయింది. మరికొందరు బస్టాండ్ ఆవరణలో పార్క్ చేసిన బస్సుల చాటున మద్యం సేవించడంతోపాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా జరిగిన డీజిల్ చోరీకి సంబంధించిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు గురువారం ప్రయత్నించారు.
టూటౌన్ సీఐ ఆధ్వర్యంలో టెక్నీషియన్ సహాయంతో సీసీటీవీ పుటేజీలను సేకరించేందుకు చేసిన ప్రయత్నం విఫలం కాగా, దొంగలెవరో గుర్తించడం సవాల్‌గా మారింది. సీసీ కెమెరాలు పనిచేసి ఉంటే ఘటన జరిగిన కొద్దిగంటల వ్యవధిలోనే ఛేదించే అవకాశం ఉండేది. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికుల కదలికతోపాటు బస్సుల పార్కింగ్ ప్రదేశంలో నిఘా ఉంచడం సాధ్యపడటం లేదు. వీటన్నింటినీ నిశితంగా పరిశీలించిన వ్యక్తులే పక్కా ప్లాన్‌తో డీజిల్ కాజేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
పర్యవేక్షణ మావల్ల కాదు..
మిర్యాలగూడ ఆర్టీసీ డిపో నుంచి 42 అద్దె బస్సులు వివిధ రూట్లలో నడుస్తున్నాయి. రాత్రి 10 గంటల తరువాత డిపోకు చేరుకునే బస్సులను ఇక్కడే పార్క్ చేసి, విషయాన్ని డిపో సీఐ, మేనేజర్లకు చెప్పి డ్రైవర్లు ఇంటికి వెళ్తుంటారు. బస్టాండ్ ఆవరణలో నిలిపిన అద్దె బస్సులను ఆర్టీసీ సిబ్బంది కొంతకాలంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే డీజిల్ దొంగతనం ఘటన తరువాత అద్దె బస్సుల పర్యవేక్షణ తమవల్ల కాదంటూ డీఎం తెగేసి చెప్పడం, యాజమానులే ప్రైవేటు వ్యక్తులను కాపలా పెట్టుకోవాలని సూచించడం చర్చనీయాంశమైంది.
విచారణ ముమ్మరం చేశాం : శ్రీనివా్‌సరెడ్డి, సీఐ
ప్రైవేటు అద్దెబస్సుల్లో జరిగిన డీజిల్ చోరీ కేసును ఛేదించేందుకు విచారణ ముమ్మరం చేశాం. ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల అవుట్‌పుట్ కేబుల్ పనిచేయకపోవడంతో ఫుటేజీ సేకరించడం సాధ్యపడలేదు. టెక్నీషియన్‌తో వాటిని సేకరించి నిందితులను గుర్తిస్తాం. దీంతో పాటు సాగర్, కోదాడ, నల్లగొండ రోడ్లపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలు సేకరించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.