కమల దళంలో కలహం
ABN , First Publish Date - 2020-10-08T09:48:11+05:30 IST
‘అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డితో కలిసి పనిచేయలేం. ఆయనను మార్చాల్సిందే. తనకు సంఘ్ పెద్దల ఆశీర్వాదం ఉందని, తననెవరూ ఏమీ చేయలేరంటూ బెదిరిస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ): ‘అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డితో కలిసి పనిచేయలేం. ఆయనను మార్చాల్సిందే. తనకు సంఘ్ పెద్దల ఆశీర్వాదం ఉందని, తననెవరూ ఏమీ చేయలేరంటూ బెదిరిస్తున్నారు. జిల్లా కమిటీలో ఆయన భార్య పెత్తనమేంటి, కార్యక్రమం ఉంటే ఏ ఒక్కరికి ఫోన్ చేయరు, కమిటీ వేయాలంటే కనీసం రాష్ట్ర నాయకులకు సమాచారం ఇవ్వరు. ఇదేం గోల, నేడో రేపో తేలాల్సిందే.
ఈనెల 10న హైదరాబాద్‌లో రాష్ట్ర అధ్యక్షుడి వద్దే తేల్చుకుందాం.’ అం టూ బీజేపీ అసమ్మతి నేతలు గళం విప్పారు. ఇందుకు జిల్లా కీలక నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఈ పంచాయితీ ఎంతదూరం పో తుందోనన్న ఆందోళన కమళదళంలో నెలకొంది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ముసలం
నల్లగొండ జిల్లాలో అంతంత మాత్రంగా ప్రభావం ఉన్న బీజేపీని బహిరంగ అసమ్మతి మరింత బలహీనం చేస్తోంది. మొన్నటి మునిసిపల్ ఎన్నికల వరకు ఫర్వాలేదు అనిపించినా ఆ తర్వాత అసమ్మతికి తెరలేచింది. పట్టభద్రుల ఎన్నికల సమయంలో అంతా కలిసికట్టుగా పనిచేయాల్సిఉండగా ఎవరికి వారే యమునా తీరే చందంగా మారారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టిపోటీనిచ్చి రెండో స్థానంలో ఉన్నారు, మోదీ హవా, రాష్ట్రంలో రెండు ఎంపీ స్థానాలు కొంత ఊరటనిచ్చే అంశాలు కాగా గ్రూపుల గోలతో బీజేపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. పట్టభద్రుల ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో అధ్యక్షుడు తప్ప ఏ ఒక్క సీనియర్ నేత కానరాకపోవడంతోనే అసంతృప్తి బయటపడింది. తాజా సమావేశంతో అది పతాకస్థాయికి చేరింది. రాబోయే రోజుల్లో ఏం జరగనుందో అన్న ఆసక్తి పార్టీ నేతలు, సానుభూతిపరుల్లో నెలకొంది.
అసమ్మతి నేతల సమావేశం
బీజేపీ జిల్లా కమిటీకి అధ్యక్షుడి గా ఎంపికైన కంకణాల శ్రీధర్‌రెడ్డి లక్ష్యంగా బుధవారం మాజీ అధ్యక్ష డు నూకల నరసింహారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం అని పైకి చెప్పినప్పటికీ నూ తన అధ్యక్షుడి తప్పులు, ఆయనను తప్పిం చే వరకు విశ్రమించొద్దు అనే ఏకైక ఎజెండాతో సమావేశం కొన సాగింది. ఎలాంటి బ్యానర్ కూడా లేకుండా అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్షుడి ఎంపిక కోసం ముగ్గురు ప్రతినిధులు రాష్ట్ర కమిటీ నుం చి రాగా 84 మంది కీలక నేతల నుంచి అభిప్రాయాలు సేక రించారు. ఇందులో 85శాతం మంది నూకల నరసింహారెడ్డి పేరు చెబితే ఆయన్ని పక్కన పెట్టి ఒకరిద్దరు సూచించిన వ్యక్తికి అధ్యక్ష పదవి కట్టబెట్టడంతోనే ప్రమాదం జరిగిందని నేతలు అభిప్రాయపడ్డారు. సంఘ్ నేతల ఆశీర్వాదంతో వచ్చాడని భరిస్తే అందరినీ అనుమానించడం, నువ్వు ఫలా నా నాయకుడి వర్గం అంటూ అందరినీ దూరం పెడుతూ సంఘ్ నేతలు వద్దన్న వారికి జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారని ఆరోపించారు. ఏ కార్యక్రమం ఉన్నా తానొక్కరే చేసుకుంటారని, ఏ ఒక్కరికి ఫోన్ చేసి ఆహ్వానించరని, కనీసం సమాచారం కూడా ఇవ్వరని చెప్పారు. కమిటీలు వేసే క్రమంలో జిల్లా నుంచి రాష్ట్ర కమిటీలో స్థానం సంపాదించుకున్న వారిని కూడా పరిగణలోకి తీసుకోరు ఒంటెద్దు పోకడ ఏంటి? అన్ని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మకాం వేసి అక్కడి నుంచే కమిటీలు, కార్యక్రమాలకు సంబంధించి ప్రెస్‌నోట్లు రిలీజ్ చేస్తే పార్టీ పురోగమిస్తుందా? అంటూ ప్రశ్నలు సంధించారు. తనకు ఆర్‌ఎ్‌సఎస్ పెద్దల అండ ఉందని, తనను ఎవరూ ఏమీ చేయలేరు అంటూ అహంకార పూరితంగా ప్రవరిస్తున్నారని ఆరోపించారు. ఆయనతో కలిసి పనిచేయలేమని, నాయకులు, కార్యకర్తలను బెదిరించిన ఆడియో టేపులు, ఒంటెద్దు పోకడలకు సంబంధించిన ఆఽధారాలతో ఈనెల 10న పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలుద్దాం అంటూ నిర్ణయించారు. సుమారు 100 మంది నేతలు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో నూకల నర్సింహారెడ్డి, పోతెపాక సాంబయ్య, బండారు ప్రసాద్, యాసా అమరేందర్, నర్సా వెంకటేశ్, బొజ్జ శేఖర్, మదన్‌మోహన్, వాసుదేవుల జితేందర్, చెన్ను వెంకటనారాయణరెడ్డి, ఈటల మల్లికార్జున్ తోపాటు 20మంది నాయకులు ప్రసంగించారు.