నిన్ను కాపాడలేక పోయాను బిడ్డా

ABN , First Publish Date - 2020-10-08T09:36:07+05:30 IST

ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వెంటనే స్పందిం చే మనస్తత్వం. అలా ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఆయన, తన కుమారుడి ప్రాణం కాపాడుకోలేకపోయారు.

నిన్ను కాపాడలేక  పోయాను బిడ్డా

నేరేడుచర్ల, అక్టోబరు 7: ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వెంటనే స్పందిం చే మనస్తత్వం. అలా ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఆయన, తన కుమారుడి ప్రాణం కాపాడుకోలేకపోయారు. గరిడేపల్లి మండలం పొనుగోడుకు చెందిన నక్కా సాయి(19) నేరేడుచర్ల మునిసిపాలిటీ పరిధిలోని ముత్యాలమ్మకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అతని తండ్రి శ్రీనివాస్‌ పెన్‌పహాడ్‌లో 108 వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. నేరేడుచర్ల 108 వాహనం మరమ్మతుకు రావడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లగా, పెన్‌పహాడ్‌నుంచి శ్రీనివాస్‌ నాయక్‌ రావాల్సి వచ్చింది.


అప్పటికే తన కొడుకు గాయపడ్డాడని సమాచా రం రాగా, దుఃఖాన్ని దిగమింగుకొని ఘటనాస్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో ఆటోలో క్షతగాత్రులను తరలిస్తుండగా, 108 ద్వారా చేరుకున్న శ్రీనివాస్‌ మధ్యలోనే ఆటోను ఆపారు. 108లో ఎక్కిస్తుండగా క్షతగాత్రుల్లో ఒకరైన తన కుమారుడు నక్కా సాయి(19) మృత్యువాతపడ్డాడు.  ‘ఎంతో మంది ప్రాణాలు కాపాడిన నేను, నీ ప్రాణాలు కాపాడలేకపోయాను బిడ్డా’ అంటూ ఆ తండ్రి విలపించిన తీరు అందరినీ కలచివేసింది. ఇదే ప్రమాదం లో బొమ్మనబోయిన వెంకటేష్‌(21) చికిత్స పొందుతూ మృతి చెందగా, నక్కా రవి, మిర్యాలగూడకు చెందిన బొడ్డు మధులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-10-08T09:36:07+05:30 IST