ని‘వర్రీ’

ABN , First Publish Date - 2020-11-27T05:49:57+05:30 IST

ప్రకృతి వైపరీత్యాలు అన్నదాతను వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవల కురిసిన వాన తడి ఆరక ముందే మళ్లీ నివర్‌ రూపంలో తుపాను విరుచుకుపడుతోంది.

ని‘వర్రీ’
చివ్వెంల పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రంలో ధాన్యంపై టార్పాలిన్లు కప్పిన రైతులు

ఉదయం చలిగాలులు, సాయంత్రం చిరుజల్లులు

చాలాచోట్ల పూర్తికాని వరి కోతలు

కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో తడుస్తున్న ధాన్యం

ఆందోళనలో అన్నదాతలు

త్రిపురారం, సూర్యాపేట సిటీ, నవంబరు 26: ప్రకృతి వైపరీత్యాలు అన్నదాతను వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవల కురిసిన వాన తడి ఆరక ముందే మళ్లీ నివర్‌ రూపంలో తుపాను విరుచుకుపడుతోంది. నిన్నటి వరకు సన్నరకం ధాన్యానికి మద్దతు ధర కోసం పోరాడిన రైతులు రెండు రోజుల నుంచి ప్రకృతితో పోరా టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తుపాను కారణంగా వాతావరణం రాత్రికి రాత్రే మారిపోయింది. ఫలితంగా ధాన్యం కొనుగోళ్లు నిలిచాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి చలిగాలులతో ప్రారంభమైన నివర్‌, తుపాను ప్రభావంతో సాయంత్రం కొన్నిచోట్ల చిరుజల్లులు, మరికొన్నిచోట్ల తేలికపాటి వర్షం నమోదైంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానాతంటాలు పడ్డారు. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో సుమారు 30వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పేరుకుపోయింది. సాగర్‌ ఆయకట్టులో కాల్వ ఆధారంగా సాగు చేసిన సాంబమసూరి వరి రకం ప్రస్తుతం కోతలు జరుగుతున్నాయి. పంటకాలం 150 రోజులు కావడంతో నూర్పిడి పనుల్లో జాప్యం ఏర్పడింది. పంట కోతకు సిద్ధంగా ఉన్న దశలో తుపాను ప్రభావంతో వర్షం కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


చలిగాలులతో ప్రారంభమై..

నివర్‌ తుపాను కారణంగా రోజంతా బలమైన చలిగాలలు వీచాయి. దీంతో పల్లె ప్రజలతో పాటుగా పట్టణవాసులు బయటికి వెళ్లలేక ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయం 9గంటల వరకు కూడా సూర్యుడు కనిపించలేదు. చలిగాలుల కారణంగా కొంతమంది దూర ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మార్పు వచ్చి చలిగాలులకు తోడుగా వర్షం ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి వరకు జల్లులు కురుస్తూనే ఉన్నాయి.


కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో..

ఈ ఏడాది వానాకాలంలో 15 శాతం మేర సాంబమసూరి సాగైంది. ప్రస్తుతం కోతలు పూర్తయిన వరకు ధాన్యాన్ని కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబెట్టారు. ఈ నెల 25 రాత్రి నుంచి వర్షం కురుస్తుండగా, పట్టాలు కప్పి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో మంగళవారం నాటికి 23,759 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. అందులో 21,209 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించగా, ఇంకా 2,550 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు గురువారం సెలవు ప్రకటించగా, అది తెలియని సుమారు 20 మందికిపైగా రైతులు ట్రాక్టర్లలో ధాన్యం తీసుకొచ్చారు. వారిని మార్కెట్‌లోపలికి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. రైతుల ఇబ్బందిని మార్కెట్‌ చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లగా, రాత్రి సమయంలో ట్రాక్టర్లను లోనికి అనుమతించారు. అయితే అప్పటికే ధాన్యం తడిచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా బుధవారం ధాన్యాన్ని కొనుగోలు చేసిన కొంతమంది ఖరీదుదారులు బస్తాలను ఎగుమతి చేయకుండా మార్కెట్‌ యార్డులో నిల్వ ఉంచారు. అదేవిధంగా ధాన్యం బస్తాలను లోడ్‌చేసిన వాహనాలు సైతం మార్కెట్‌ యార్డులోనే ఉన్నాయి.


ఏం చేయాలో అర్థం కావడం లేదు : ఖాసీం, రైతు, త్రిపురారం

మూడు రోజుల క్రితం రెండు ఎకరాల్లో సాగు చేసిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టా. ఇంతలోనే వర్షం మొదలైంది. ధాన్యం కుప్పలుగా పోసి పట్టాలు కప్పాం. నేలనాని పట్టా కింద నుంచి తేమ వస్తోంది. వర్షం ఆగితే తప్ప ధాన్యం విక్రయించేందుకు వీలు ఉండదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.


పంట వాలిపోతోంది : బాల్తి శ్రీనివాస్‌, రైతు, మర్రిగూడెం

ఏడెకరాల్లో సాంబమసూరి రకాన్ని సాగు చేశా. ప్రస్తుతం కోతలు ప్రారంభిద్దామని అనుకునేలోపే తుపాను ప్రారంభమైంది. వర్షంతో కంకి తడిచి బరువుకు పంట నేల వాలుతోంది. తుపాను ఇలాగే ఉంటే గింజ మొత్తం తడిచి మొలకెత్తి పంట చేతికొచ్చేది కూడా కష్టమే.


నేడు సీసీఐ, మార్కెట్‌కు సెలవు

నివర్‌ తుపాను ప్రభావం కారణంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌, బాలెంల సీసీఐ కేంద్రానికి శుక్రవారం సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఉప్పల లలిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Read more