పెళ్లి కార్డు పైనే అదంతా రాసి.. పెళ్లయిన వారం రోజులకే...

ABN , First Publish Date - 2020-03-23T15:28:34+05:30 IST

కాళ్ల పారణి ఆరకముందు నవ వధువుకు నూరేళ్లు నిండాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న...

పెళ్లి కార్డు పైనే అదంతా రాసి.. పెళ్లయిన వారం రోజులకే...

నవవధువు ఆత్మహత్య

భర్త మోసం చేశాడని కుటుంబ సభ్యుల ఆరోపణ


చివ్వెంల (సూర్యాపేట): కాళ్ల పారణి ఆరకముందే నవ వధువుకు నూరేళ్లు నిండాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న తండ్రికి కూతురు కడుపుకోత మిగిల్చింది. వివాహమైన వారం రోజులకే వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చివ్వెంల మండలంలోని కుడకుడ గ్రామంలో గల వినాయకనగర్‌లో శనివారం రాత్రి జరిగింది. ఆదివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్‌(ఎస్‌) మండలం ఘట్టికల్‌ గ్రామానికి చెందిన సామ ఇంద్రారెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ వినాయకనగర్‌లో నివాసముంటున్నారు. ఆయన పెద్దకుమార్తె మౌనికారెడ్డికి హైదరాబాద్‌ ఈసీఎల్‌కు చెందిన బద్దం శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు సాయికిరణ్‌రెడ్డికి ఈ నెల 15న సూర్యాపేటలో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. మౌనికారెడ్డి సీఏ పూర్తి చేసి ఉద్యోగం చేస్తుంది. తనకు ఉద్యోగం ఉందని, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయని అబద్దాలు చెప్పి సాయికిరణ్‌రెడ్డి వివాహమాడాడు. అతడికి ఉద్యోగం లేకపోగా, ఆస్తిపాస్తులు కూడా లేవని తెలుసుకున్న మౌనికారెడ్డి తల్లిదండ్రులు అతడిని నిలదీశారు. దీంతో సాయికిరణ్‌రెడ్డి, అతడి తల్లిదండ్రులు మౌనికారెడ్డితో పాటు ఆమె తల్లిదండ్రులను తిట్టారు. ఇక్కడే ఉండాలని, లేకుంటే విడాకులు ఇవ్వాలని మౌనికను హెచ్చరించారు. 


శనివారం రాత్రి కూడా వినాయకనగర్‌లోని తమ నివాసానికి వెళ్లారు. ఆదివారం ఉదయం ఎంత కొట్టినా గది తలుపులు తీయకపోవడంతో కిటికీల్లోంచి చూడగా ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని మౌనికారెడ్డి ఆత్మహత్యకు చేసుకుంది. తనకు జరిగిన మోసం, మెట్టినింటి కష్టాలను తన పెండ్లి కార్డుపైనే సూసైడ్‌ నోట్‌గా రాసింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటికి తీశారు. పెండ్లి సమయంలో రూ.10లక్షలతో పాటు 35 తులాల బంగారం, 4 కేజీల వెండిని వరకట్నంగా ఇచ్చి పెళ్లి చేశానని పెళ్లైన వారం రోజులకే తన బిడ్డను చిత్రహింసలకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని మౌనిక తండ్రి ఇంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ లవకుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-03-23T15:28:34+05:30 IST