కొత్త ఏడాదికి కొంగొత్తగా..

ABN , First Publish Date - 2020-12-31T05:24:27+05:30 IST

నూతన సంవత్సర వేడుకలు అంటే ఆ జోషే వేరు. డిసెంబరు 31 అర్ధరాత్రి దాటిందంటే సందడే సందడి. కేక్‌ కటింగ్‌లు, మహిళల రంగుల ముగ్గులు, ఇక యువత హడావుడి చెప్పనవసరం లేదు. మద్యం ప్రియులు పాత ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు సరుకు సరంజామా సిద్ధం చేసుకుంటున్నారు.

కొత్త ఏడాదికి కొంగొత్తగా..

నూతన సంవత్సర వేడుకలకు అంతా సిద్ధం

మద్యం దుకాణాలకు రాత్రి 12గంటల వరకు అనుమతి  

బార్లు రాత్రి ఒంటిగంట వరకు

వేడుకలకు సిద్ధమైన యువత  

తాగి వాహనాలు నడిపితే భారీగా జరిమానా

నల్లగొండ, డిసెంబరు 30 : నూతన సంవత్సర వేడుకలు అంటే ఆ జోషే వేరు. డిసెంబరు 31 అర్ధరాత్రి దాటిందంటే సందడే సందడి. కేక్‌ కటింగ్‌లు, మహిళల రంగుల ముగ్గులు, ఇక యువత హడావుడి చెప్పనవసరం లేదు. మద్యం ప్రియులు పాత ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు సరుకు సరంజామా సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో గురువారం ఉమ్మడి జిల్లాలోని మద్యం, మాంసం, బేకరీ దుకాణాలు కిటకిటలాడనున్నాయి. దీనికి తోడు కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాలకు రెండు గంటలు, బార్లు గంట అందనంగా తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే మద్యం మత్తులో వాహనాలతో రోడ్లపైకి వచ్చే వారికి భారీగా జరిమానా  విధించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

గత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం చెప్పేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది కరోనా సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఈ మహమ్మారి కారణంగా అన్ని రంగాలు కుదేలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరం 2021లోకి అడుగిడబోతున్నాం. అయితే గత చేదు జ్ఞాపకాలను విడిచి కొత్త ఏడాదిలో అంతా శుభం జరగాలని కాంక్షిస్తూ స్వాగతం చెప్పేందుకు ఉమ్మడి జిల్లాలో అంతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు, ప్రధానంగా యువ త నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమైంది. దీంతో గురువారం అన్ని దుకాణాల్లో రద్దీ కనిపించనుంది. అయితే కొవిడ్‌ నిబంధనల మేరకు వేడుకలు నిర్వహించాలని, ఇంట్లోనే చేసుకుంటే మరీ మంచిదని అధికారులు చెబుతున్నారు.


మద్యం దుకాణాల సమయం పెంపు

రామగిరి: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం దుకాణాల సమయం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు మద్యం దుకాణాలు ఉయం 10-రాత్రి 10 వరకు ఉండగా, గురువారం ఒక్క రోజు 12 గంటల వరకు తెరిచే ఉండన్నాయి. ఇక బార్లకు రాత్రి 1 గంట వరకు అనుమతి ఇచ్చారు. అయితే మద్యం తాగి వాహనాలతో రోడ్డెక్కే మందుబాబులకు భారీగా జరిమానా విధించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.


ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

సూర్యాపేట క్రైం: నూతన సంవత్సర వేడుకలను కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్లపైకి గుంపులుగా రావొద్దని సూచించారు. డీజే, డ్యాన్స్‌, బాణాసంచా కాల్చడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, రోడ్లుపై కేకులు కట్‌ చేయడం, బైక్‌ ర్యాలీలు నిర్వహించడం నిషేధమని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్‌ బృందాలు తనిఖీలు నిర్వహిస్తాయని చెప్పారు. 


నృసింహుడి సన్నిధిలోప్రత్యేక ఏర్పాట్లు

 యాదాద్రికి 50 వేలకు పైగా భక్తులు వస్తారని అంచనా

 75వేల లడ్డూ ప్రసాదం సిద్ధం 

ఆలయ దర్శన వేళల్లో మార్పులు

యాదాద్రి,డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): కొంగొత్త కోర్కెలతో న్యూఇయర్‌ ప్రారంభం రోజున ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు జనవరి1న వచ్చే వేలాదిమంది భక్తుల కోసం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవైపు కొవిడ్‌-19, మరోవైపు ఆలయ పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరుకోవడంతో యాదాద్రికొండపై ఏర్పడిన స్థలాభావంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి ప్రసాదాల కొరత ఏర్పడకుండా 75వేల లడ్డూ ప్రసాదం, అవసరమైన పులిహోర నిరంతరం అందుబాటులో ఉంచుతున్నారు. భక్తులు కొండపైన బసచేసేందుకు ఎలాంటి వసతి లేనందున, కొండకింద బస్టాండ్‌, తులసికాటేజ్‌ వద్దగల దేవస్థాన వసతి గదులు కేటాయించనున్నారు. కొండపైకి వాహనాలను అనుమతించనందున భక్తులు వాహనాలు కొండకిందనే పార్కింగ్‌ చేయాల్సి ఉంటుంది. భక్తులు తలనీలాలు సమర్పించే కల్యాణకట్టను ఉదయం 4గంటల నుంచి రాత్రి 9గంటల వరకు, వాహన పూజలు ఉదయం 5గంటల నుంచి రాత్రి 9గంటల వరకు తెరిచి ఉంచుతారు. ఇక స్వామివారి సర్వ దర్శనాలు ఉదయం 5 గంటల నుంచి ప్రారంభించి రాత్రి 9.45గంటల వరకు దర్శనాలు కొనసాగించనున్నారు.


మౌలిక సదుపాయాలేవీ

యాదాద్రికి 50వేల మందికిపైగా భక్తులు సందర్శిస్తారని అధికారుల అంచనా మేరకు మౌలిక సదుపాయాల మాటేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వేల మంది భక్తులు గంటలకొద్దీ నిరీక్షించే పరిస్థితుల్లో నాలుగు మూత్రశాలలు ఏమేరకు సరిపోతాయని అంటున్నారు. ఈమేరకు ఈవో గీతారెడ్డి, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావును హిందూ ఆలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి, సంప్రదించగా, ఇద్దరు అధికారులు బాధ్యతలను ఒకరిపై మరొకరు నెట్టివేసినట్లు చేసి న సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఇరువురి నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


బొకేలకు బదులు దుప్పట్లు తీసుకురండి

  కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌ విజ్ఞప్తి

నల్లగొండ టౌన్‌, డిసెంబరు 30: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చేవారు పూల బొకేలు, స్వీట్‌ బాక్సులు, పండ్లకు బదులు దుప్పట్లు, బెడ్‌షీట్లు తీసుకురావాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తనను కలిసేందుకు వచ్చేవారు దుప్పట్లు తీసుకొస్తే చలికాలంలో అనాథలకు, వృద్ధాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్నవారికి ఉపయోగపడతాయని తెలిపారు. నూతన సంవత్సరంలో వినూత్న ఆలోచనలతో అధికారులు నూతన ఉత్తేజంతో పనిచేసి, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాను అన్నిరంగాల్లో సమగ్రాభివృద్ధిలో ముందుంచి, ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేయాలని కోరారు. విద్యార్థులు ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ ఏడాదంతా  విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.

Updated Date - 2020-12-31T05:24:27+05:30 IST