అమెరికాలో నల్లగొండ జిల్లావాసి మృతి
ABN , First Publish Date - 2020-12-30T06:28:29+05:30 IST
అమెరికాలోని న్యూజెర్సీలో మంగళవారం కారులో షార్ట్ సర్క్యూట్‌తో నిప్పంటుకొని అందులోని దేవరకొండకు చెందిన నలమాద దేవేందర్‌రెడ్డి(44) మృతి చెందారు. అతడి మృతితో స్వగ్రామం కర్నాటిపల్లి, దేవరకొండలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

దేవరకొండ, కర్నాటిపల్లిలో విషాద ఛాయలు
దేవరకొండ, డిసెంబరు 29: అమెరికాలోని న్యూజెర్సీలో మంగళవారం కారులో షార్ట్ సర్క్యూట్‌తో నిప్పంటుకొని అందులోని దేవరకొండకు చెందిన నలమాద దేవేందర్‌రెడ్డి(44) మృతి చెందారు. అతడి మృతితో స్వగ్రామం కర్నాటిపల్లి, దేవరకొండలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దేవరకొండను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని అతడు తరచూ పరితపించేవాడు. ఈ విషయాన్ని మిత్రులతో ఫోన్‌లో మాట్లాడేవాడని, అతడి అకాల మరణం తీరనిలోటని బంధుమిత్రులు తెలిపారు. అతడి మృతి వార్త తెలియగానే దేవరకొండలో ఉన్న తల్లి భారతమ్మ శోకసంద్రంలో మునిగింది. దేవరకొండ మండలం కర్నాటిపల్లికి చెందిన నలమాద నర్సిరెడ్డి, భారతమ్మ దంపతుల రెండో కుమారుడు దేవేందర్‌రెడ్డి. నర్సిరెడ్డి ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ పదేళ్లక్రితం మృతి చెందారు. ఇంటర్ వరకు దేవరకొండలోనే విద్యాభ్యాసం చేసిన దేవేందర్‌రెడ్డి కర్నూల్‌లో బీటెక్ పూర్తిచేశారు. అనంతరం ఎమ్మెస్సీ కోసం 1998లో అమెరికాకు వెళ్లి అక్కడే సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడ్డారు. అక్కడ టీఆర్‌ఎస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్‌గా కొనసాగుతున్నారు. అమెరికాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 2006లో హైదరాబాద్‌కు చెందిన అనురాధతో వివాహం కాగా, ఏడేళ్ల కూతురు చెర్రి ఉంది. దేవరకొండ అభివృద్ధి గురించి చిన్ననాటి మిత్రులైన ఎమ్మెల్యే రవీంద్రకుమార్, టి.వెంకటనర్సింహరెడ్డితో ఫోన్‌లో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకునేవారు. దేవేందర్‌రెడ్డి మృతి వార్త తెలియగానే స్థానికులు, స్నేహితులు దేవరకొండలోని స్వగృహానికి చేరుకొని తల్లి భారతమ్మను ఓదార్చి అతడి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అమెరికా పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారని, అప్పుడే దేవేందర్‌రెడ్డి మృతికి కారణం తెలుస్తుందని అతడి సోదరుడు రవీందర్‌రెడ్డి తెలిపారు.
దేవేందర్‌రెడ్డి మృతి బాధాకరం : రవీంద్రకుమార్, దేవరకొండ ఎమ్మెల్యే
దేవేందర్‌రెడ్డి మృతి చెందడం బాధాకరం. అతడితో నాకు చాలా సన్నిహిత్యం ఉంది. ఎప్పుడూ దేవరకొండ ప్రాంత అభివృద్ధి గురించే పరితపించేవాడు. పేదలకు సేవ చేయాలనే తపన ఉండేది. ప్రాజెక్టుల నిర్మాణం గురించి తరచుగా ప్రస్థావించేవాడు.
దేవరకొండ జిల్లా కావాలనుకున్నాడు: వెంకట్‌నారాయణరెడ్డి, స్నేహితుడు, దేవరకొండ
దేవరకొండను జిల్లాగా ఏర్పాటు కావాలని దేవేందర్‌రెడ్డి అంటుండేవాడు. తరచుగా ఫోన్ చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధిని అడిగి తెలుసుకునేవాడు. లాక్‌డౌన్ కారణంగా ఇక్కడి ప్రజలు కష్టంలో ఉన్నారని ఎన్‌ఆర్‌ఐ మిత్రుల సహకారంతో నిధులు సమకూర్చి పంపాడు. వాటితో నియోజకవర్గంలోని నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీచేశాం.
