నల్లగొండలో నకిలీ ఫేక్‌బుక్ అకౌంట్స్ ముఠా అరెస్ట్
ABN , First Publish Date - 2020-10-03T18:51:41+05:30 IST
జిల్లా ఎస్పీ రంగనాథ్‌తో సహా పలువురు పోలీసు అధికారుల పేరుతో నకిలీ ఫేసుబుక్ అకౌంట్లు ఓపెన్ చేసి మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

నల్లగొండ: జిల్లా ఎస్పీ రంగనాథ్‌తో సహా పలువురు పోలీసు అధికారుల పేరుతో నకిలీ ఫేసుబుక్ అకౌంట్లు ఓపెన్ చేసి మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యులతో కూడిన అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ జిల్లా కేత్వాడ మండల కేంద్రానికి చెందిన ముస్తఖీమ్ ఖాన్, మనీష్, షాహిద్, సద్దాం ఖాన్‌లను పోలీసులు అదపులోకి తీసుకున్నారు. వీరిలో మనీష్ మైనర్. నిందితుల నుండి లక్ష నగదు, ఎనిమిది మొబైల్ ఫోన్లు, ఒక లాప్‌టాప్, 30 సిమ్ కార్డులు, నకిలీ ఆధార్ కార్డులు, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్‌లకు సంబంధించిన వివరాలను ఎస్పీ కార్యాలయంలో డీఐజీ రంగనాథ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశంలో తెలంగాణ, ఆంద్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 350 మంది పోలీస్ అధికారుల ఫేస్ బుక్ నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసినట్లు గుర్తించామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 81 మంది పోలీస్ అధికారుల పేరుతో నకిలీ ఎఫ్ బి అకౌంట్లు సృష్టించారని చెప్పారు. సులభంగా డబ్బు సంపాదించడం కోసం దక్షిణాది రాష్ట్రాలే లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఓఎల్‌ఎక్స్, ఫేస్‌బుక్ అప్లికేషన్స్ అడ్డాగా నేరాలు, ఆర్మీ పేరుతోనూ సైబర్ నేరాలు పాల్పడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ పోలీసుల ప్రతిష్ట నిలిపేలా తమ బృందం రాజస్థాన్ వరకు వెళ్ళి ముఠాను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారని డీఐజీ చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా ఫేస్ బుక్ అడ్డాగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను నల్లగొండ పోలీస్ బృందం ఛేదించిందన్నారు. కేసును చేధించడంలో కీలకంగా పని చేసిన జిల్లా పోలీసులకు అభినందనలు, రివార్డు అందజేయనున్నట్లు తెలిపారు. సైబర్ నేరస్థుల ఉచ్చులో పడి మోసపోవద్దని ప్రజలకు సూచనలు చేశారు. నగదు, సెల్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ రంగనాథ్ వెల్లడించారు.