అంతా బంద్‌కరోనా..
ABN , First Publish Date - 2020-03-23T10:36:26+05:30 IST
అంతా బంద్‌కరోనా..

- కర్ఫ్యూకు జిల్లా జనం సంఘీభావం
- పల్లె, పట్టణంలో స్వచ్ఛందంగా బంద్
- జాతీయ రహదారులు సైతం మూసివేత
- ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు
- అంత్యక్రియలు సైతం వాయిదా
- కుటుంబ సభ్యుల వరకే పరిమితమైన వివాహ వేడుకలు
- చప్పట్లతో వైద్యులకు అభినందనలు
కరోనా వైరస్ కట్టడికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్ ఇచ్చిన జనత కర్ఫ్యూ పిలుపునకు పల్లె, పట్టణం, పేద, ధనిక తేడా లేకుండా జనం మద్దతు పలికారు. ఆదివారం జిల్లా యావత్తు ప్రజలు, వ్యాపార, వాణిజ్యవర్గాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. కరోనా వైరస్ కట్టడికి నిరంతరాయంగా సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి సంఘీభావంగా చప్పట్లతో జనం అభినందనలు తెలిపారు. జాతీయ రహదారులను సైతం మూసివేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. జనసంచారం లేక రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
యాదాద్రి,మార్చి22(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ కట్టడికి ప్రధాని నరేంద్రమోదీ పిలుపు జనతా కర్ఫ్యూకు ఆదివారం పల్లె, పట్టణం, పేద, ధనిక అనే తేడాలేకుండా జనమద్దతు లభించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో యావత్తు ప్రజలు, వ్యాపార, వాణిజ్యవర్గాలు స్వచ్ఛంద కర్ఫ్యూను పాటించాయి. కరోనా వైరస్ వ్యాప్తికి చిత్తశుద్ధితో సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి సంఘీభావంగా చప్పట్లతో అభినదంనలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రధాన జాతీయ రహదారులు విజయవాడ-హైదరాబాద్, భూపాలపట్నం జాతీయ రహదారులనుంచి పల్లెల్లోని వీధులు సైతం వాహన, జనసంచారం లేకుండా నిర్మానుష్యంగా మారాయి.
జిల్లాలోని పంతంగి, బీబీనగర్ టోల్‌ప్లాజాల వద్ద వాహనాలులేక వెలవెలబోయాయి. జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, మోత్కూరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి పట్టణాల్లో దుకాణాలు, ప్రైవేట్ వాహనాలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోనుంచి బస్సులు బయటకు రాలేదు. బీబీనగర్ మండలంలోని హిందుస్తాన్ శానిటరీ వేర్‌లో మొదటిషిఫ్టు కార్మికులు పనిచేస్తుండగా స్థానికుల ఫిర్యాదుమేరకు తహసీల్దార్ కె.వెంకటరెడ్డి ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి రెండో షిఫ్టునుంచి మూసేయించారు. అత్యవసరంకోసం ఐదు బస్సులు సిద్ధంగా ఉంచినప్పటికీ, ప్రయాణికులకు అత్యవసర పరిస్థితులు లేనందున బయటకు తీయలేదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు అత్యవసర వైద్యసేవలకు రోగులు ఎవరూరాలేదు. పోలీసు, వైద్య, మునిసిపల్ సిబ్బంది రహదారులపై కర్ఫ్యూ పరిస్థితులను పర్యవేక్షించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు పట్టణాల్లో పర్యటించారు.
అంత్యక్రియలు వాయిదా
సామాజిక బాధ్యతగా జనతా కర్ఫ్యూను పాటించిన యాదాద్రి భువనగిరి జిల్లాలో అంత్యక్రియలను సైతం వాయిదా వేసుకున్నారు. భువనగిరి మండలం చీమలకొండూరలో శనివారం రాత్రి కరిపే నర్సయ్య అనే వృద్ధుడు మృతి చెందగా ఆదివారం జరగాల్సిన అంత్యక్రియలను కర్ఫ్యూ కారణంగా సోమవారానికి వాయిదావేసినట్లు గ్రామస్తులు తెలిపారు. సంస్థాన్‌నారాయణపూర్ మండలం చిమిర్యాల గ్రామంలో గడ్డం ముత్తయ్య అనే వృద్ధుడు, ఆలేరులో మణెమ్మ అనే వృద్ధురాలు మృతి చెందగా, వారి అంత్యక్రియలను సోమవారానికి వాయిదావేశారు. తుర్కపల్లిలో బాలు అను యువకుడి అంత్యక్రియలు ఆదివారం నిర్వహించినా, కేవలం కుటుంబ సభ్యులే పరిమితంగా పాల్గొన్నారు. అదేవిధంగా ఆత్మకూర్(ఎం) మండలంలో మూడు వివాహాలు జరిగాయి. ఈ వేడుకల్లో బంధుమిత్రులు లేకుండా కుటుంబసభ్యుల మధ్య మాత్రమే జరిగాయి.
చప్పట్ల అభినందనలు
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడమే కాకుండా సముచిత వైద్యసేవలు అందిస్తున్న వైద్యులు, వైద్యసిబ్బంది, పోలీస్, రెవెన్యూ శాఖలకు చప్పట్లతో అభినందనలు పలికారు. యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ తన నివాస భవనంలో చప్పట్లుకొట్టారు. అదనపు కలెక్టర్ రమేష్, కిమియానాయక్ కలెక్టరేట్‌లో సిబ్బందితో కలిసి చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు. ఆర్డీవో భూపాల్‌రెడ్డి, ఏసీపీ భుజంగరావు, తహసీల్దార్ జనార్ధన్‌రెడ్డి, మునిసిపల్ కమిషనర్ నాగిరెడ్డి పట్టణంలో చప్పట్లు కొడుతూ సంఘీభావం ప్రకటించారు.