పిలిప్పైన్స్‌లో చిక్కిన ఇద్దరు మెడికో విద్యార్థులు
ABN , First Publish Date - 2020-03-23T10:34:27+05:30 IST
పిలిప్పైన్స్‌లో చిక్కిన ఇద్దరు మెడికో విద్యార్థులు

స్వదేశానికి రప్పించాలని వేడుకుంటున్న తల్లిదండ్రులు
మిర్యాలగూడఅర్బన్, మార్చి 22: మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఇద్దరు మెడికో విద్యార్థులు పిలిప్పైన్స్ దేశంలో చిక్కుకొనిపోయారు. కరోనా వైరస్ ప్రభావంతో అంతర్జాతీయ విమాన సేవలను ఆ దేశం రద్దు చేసింది. దీంతో విద్యార్థులు స్వదేశానికి వచ్చేందుకు ఇబ్బందిపడుతూ ఓ అపార్ట్‌మెంట్ గదిలో బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలో వారు విలేకరులతో మాట్లాడారు. పట్టణంలోని గణే్‌షనగర్‌కు చెందిన ఈగ ప్రభాకర్, కల్యాణి దంపతుల కుమారుడు శ్రీనివాస్, శాంతినగర్‌కు చెందిన పాతోజు వెంకటాచారి కుమారుడు సాయికుమార్ నాలుగేళ్ల క్రితం మెడిసిన్ కోర్సు నిమిత్తం పిలిప్పైన్స్ దేశానికి వెళ్లారు.
అయితే కరోనా ప్రాబల్యం బలపడుతున్న నేపథ్యంలో కళాశాలలకు సెలవులు ప్రకటించి విదేశీ రవాణా వ్యవస్థ ఎయిర్‌లైన్స్ సేవలను నిలిపివేస్తూ పిలిప్పైన్స్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో అక్కడ చిక్కుకున్న మెడికో విద్యార్థులు స్వదేశానికి చేరుకునేందుకు వీలులేకుండా పోయింది. తమ కుమారులను స్వస్థలానికి రప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని శ్రీనివాస్, సాయికుమారర్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.