కరోనా బాధితులుగా అనుమానం

ABN , First Publish Date - 2020-03-23T10:19:43+05:30 IST

కరోనా బాధితులుగా అనుమానం

కరోనా బాధితులుగా అనుమానం

సంపర్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఎన్‌ఆర్‌ఐని అదుపులోకి తీసుకున్న పోలీసులు

భువనగిరిలో అర్ధాంతరంగా దింపి గాంధీ ఆసుపత్రికి తరలింపు


భువనగిరిటౌన్‌, మార్చి 22: సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్న ఓ ఎన్‌ఆర్‌ఐను ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రైల్వేస్టేషన్‌లో దింపి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉద్యోగం చేసే ఏపీ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన యువకుడు శనివారం రాత్రి హైదరాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడినుంచి కాచిగూడ రైల్వేస్టేషన్‌కు చేరుకుని ఆదివారం ఉదయం సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రె్‌సలో నాగపూర్‌ బయలుదేరాడు.


ఏసీ బోగీలో చేతికి ఎయిర్‌పోర్టులో వేసిన క్వారంటైన్‌ గుర్తును గమనించిన సహ ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రైలును అర్ధాంతరంగా భువనగిరి రైల్వే స్టేషన్‌లో నిలిపివేసి, యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తనకు విమానాశ్రయంలో థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేశారని; మధ్యలో ఎందుకు ఆటంకపరుస్తున్నారని ఎన్‌ఆర్‌ఐ ప్రయాణికుడు పోలీసులతో వాదనకు దిగాడు. అయినాసరే 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టంచేసిన పోలీసులు సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎన్‌ఆర్‌ఐ ప్రయాణించిన బోగీని క్రిమినిరోధక ద్రావణంతో శుభ్రం చేసి, ప్రయాణికులకు శానిటైజర్లు అందజేశారు. దీంతో కాచిగూడ నుంచి ఢిల్లీకి వెళుతున్న సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ దాదాపు అరగంట పాటు భువనగిరిలో నిలిచింది.


రోడ్డు మార్గంగుండా వెళ్తుండగా..

రోడ్డు మార్గం గుండా వెళ్తున్న ఎన్‌ఆర్‌ఐని భువనగిరి పోలీసులు ఆదివారం నిలిపివేశారు. వరంగల్‌ జిల్లా మామునూరు పోలీసు క్యాంపునకు చెందిన ఓ యువకుడు అమెరికాలోని డల్లా్‌సలో ఉన్నత విద్యాభ్యాసంచేస్తూ సెలవుల నిమిత్తం స్వగ్రామానికి వస్తుండగా జనతా కర్ఫ్యూ రోజున భువనగిరిలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలో అతను పట్టుబడ్డాడు. డల్లా్‌సనుంచి ఆదివారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుని అక్కడినుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చి రోడ్డుమార్గంగుండా కారులో మామునూరు క్యాంపునకు వెళ్తుండగా వాహన తనిఖీలో గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని 108 అంబులెన్స్‌ ద్వారా సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. అయితే తనకు ఢిల్లీ, శంషాబాద్‌ విమానాశ్రయంలో తనకు స్ర్కీనింగ్‌ టెస్టు నిర్వహించి 14రోజులపాటు ఇంట్లోనే స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారని, అయినప్పటికీ పరీక్షల నిమిత్తం తాను గాంధీ ఆసుపత్రికి రావడానికి సిద్ధమేనని తెలిపారు. 


ఎన్‌ఆర్‌ఐ పెళ్లి కొడుకుకు కరోనా నెగిటివ్‌

వలిగొండ: మండలకేంద్రానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ నూతన వరుడికి కరోనా నెగిటివ్‌గా తేలింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మార్చి 20న అధికారుల అంగీకారంతో పెళ్లి చేసుకున్న అతన్ని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. 24గంటల ఐసోలేషన్‌, క్వారంటైన్‌ నడుమ బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరించి, పరీక్షలు నిర్వహించారు. మార్చి 21న అతనికి కరోనా టెస్టులు చేసినా ఎలాంటి లక్షణాలు కనబడలేదు. రిపోర్టు నెగిటివ్‌ అని వచ్చాయి. డాక్టర్లు వెంటనే ఆ ఎన్‌ఆర్‌ఐ పెళ్లి కొడుకుని తిరిగి ఇంటికి పంపారు.

Updated Date - 2020-03-23T10:19:43+05:30 IST