రేషన్‌ కార్డులొచ్చేనా.. ఏడాదిన్నరగా ఎదురుచూపు

ABN , First Publish Date - 2020-12-11T06:12:06+05:30 IST

నిరుపేదలకు ఆహార భద్రత కొరవడింది. రేషన్‌ కార్డులకోసం దరఖాస్తు చేసి ఏడాదిన్నర గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

రేషన్‌ కార్డులొచ్చేనా.. ఏడాదిన్నరగా ఎదురుచూపు
రేషన్‌ దుకాణంలో సరుకులు తీసుకుంటున్న లబ్ధిదారులు


ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో 17,400 దరఖాస్తులు

నల్లగొండ, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిరుపేదలకు ఆహార భద్రత కొరవడింది. రేషన్‌ కార్డులకోసం దరఖాస్తు చేసి ఏడాదిన్నర గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో నిరుపేదలు పనులు వదులుకొని తహసీల్దార్‌, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా అధికారులు నేడు, రేపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప స్పష్టమైన హామీ ఇవ్వడంలేదు. కొత్త కార్డుల జారీ ఎండమావిగా మారిందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


ఆమోదం లేక ఆందోళన

ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఆహార భద్రతకార్డులకోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు ఆమోదం తెలపకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రేషన్‌ దుకాణాల ద్వారా సరుకులు అందక నిరా శ చెందుతున్నారు. కరోనా కాలంలో నగదు సాయం, ఉచిత రేషన్‌కు నిరుపేదలు దూరమయ్యారు. ఉన్న కార్డుల్లో అదనంగా సభ్యుల పేర్లు చేర్చుకోవడానికి దరఖాస్తు చేసుకోగా, వాటికి సైతం ఆమోదం లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతంచేసి కుటుంబంలోని ప్రతీ ఒక్కరికి రూపాయికి కిలో చొప్పున ఆరు కిలోల బియ్యం ప్రభుత్వం అందజేస్తోంది. సరుకులు పక్క దారి పట్టకుండా ఈ-పాస్‌ విధానం అమలు చేస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా కొత్త కార్డుల ఆమోదం 18 నెలలుగా పెండింగ్‌లో ఉండటంతో నిరుపేదలు రేషన్‌ సరుకులకు నోచక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఉమ్మడి జిల్లాలో కార్డులు

జిల్లా మొత్తం పెండింగ్‌  

నల్లగొండ 4,60,419 8,700  

సూర్యాపేట 2,93,973 5,200  

యాదాద్రి 1,90,883 3,500  



ప్రభుత్వ అనుమతి రాగానే:రుక్మిణి దేవి, డీఎ్‌సవో, నల్లగొండ

కొత్త రేషన్‌ కార్డులు, మార్పులు, చేర్పుల కోసం వచ్చిన దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కార్డులజారీ ప్రక్రియకు  ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పుడు అనుమతి ఇస్తే అప్పుడు కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 

Updated Date - 2020-12-11T06:12:06+05:30 IST