నిండా ముంచి మూసీ

ABN , First Publish Date - 2020-11-06T10:55:50+05:30 IST

మూసీ వరద, అధిక వర్షాలతో పరివాహక ప్రాంతాల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎగువనుంచి భారీగా వరద రావడంతో మూసీ ప్రాజెక్టులో ఉన్న 13 గేట్లను ఎత్తివేశారు. మూసీ ఎడమ కాల్వ కింద సేద్యం చేస్తున్న 1098 మంది రైతులకు చెందిన 1,487

నిండా ముంచి మూసీ

వరదలు, అధిక వర్షాలతో రూ.3 కోట్లకుపైగా నష్టం 

1,487 ఎకరాల్లో నేలవాలిన వరి 

137 ఎకరాల్లో నల్లబారిన పత్తి 

నష్టపరిహారం ఇవ్వాలంటున్న రైతులు


మూసీ వరదలు తెచ్చిన నష్టం అంతా ఇంతా కాదు. పరివాహక ప్రాంతంలోని సన్న, చిన్న కారు రైతుల  ఎకరం, రెండు ఎకరాల పంట పొలాలు నీట మునగడంతో దిక్కుతోచని వారయ్యారు. ఇన్నాళ్లు పడిన కష్టం దిగుబడి రూపంలో చేతికందు తుందనుకునే సమయంలో వరదలు నిండా ముంచాయి. దీంతో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.3కోట్లపైగా నష్టం వాటిల్లింది. 


(ఆంధ్రజ్యోతి, సూర్యాపేట)

మూసీ వరద, అధిక వర్షాలతో పరివాహక ప్రాంతాల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎగువనుంచి భారీగా వరద రావడంతో మూసీ ప్రాజెక్టులో ఉన్న 13 గేట్లను ఎత్తివేశారు. మూసీ ఎడమ కాల్వ కింద సేద్యం చేస్తున్న 1098 మంది రైతులకు చెందిన 1,487 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. సూర్యాపేట మండలం రత్నవరం వద్ద మూసీ కట్టకు గండి కొట్టడంవల్ల ఆ గ్రామంలోనే 197 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. సూర్యాపేట మండలంలోని యండ్లపల్లిలో 171 ఎకరాలు, కాసరబాదలో 158, బాలెంలలో 194, యర్కారం 195, ఇమామ్‌పేట 179, రామన్నగూడెం 136, తాళ్ళఖమ్మంపహాడ్‌ 110, బిమాదారం 147 ఎకరాలు వరిపొలం దెబ్బతింది. దీంతో సుమారు రూ. 2.97 కోట్లు పంటనష్టం జరిగింది. 


137 ఎకరాల్లో నల్లబారిన పత్తి 

మూసీ వరద వల్ల పత్తిపంటకు కూడా నష్టం వాటిల్లింది. సూర్యాపేట మండలం బాలెంలలో 61 ఎకరాలు, యర్కారంలో 29 ఎకరాలు, రామన్నగూడెంలో 25 ఎకరాలు, బి.దాచారంలో 22ఎకరాల్లో పత్తి నల్లబారింది. మొత్తం 83మంది రైతులకు చెందిన 137 ఎకరాల్లో పత్తి దెబ్బతిన్నది. వరిపత్తి కలిపి రూ. 3కోట్ల10 లక్షల70వేల పంటనష్టం జరిగినట్లు తెలుస్తోంది. వరి ఎకరాకు పెట్టుబడి ఖర్చు రూ.15వేలు కాగా, పత్తికి రూ.14వేల దాకా ఉంటుంది. ఆయా గ్రామాల్లో పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 


ప్రభుత్వం ఆదుకోవాలి

నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాను. మూసీ వరద నీటితో వరి పంట పూర్తి నీటముగినింది. దీంతో రూ. 60 వేలు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. 

భీంరెడ్డి, కేటీఅన్నారం గ్రామం, సూర్యాపేట

Updated Date - 2020-11-06T10:55:50+05:30 IST