మునిసిపల్ స్థలం ఆక్రమణకు యత్నం
ABN , First Publish Date - 2020-11-27T06:03:56+05:30 IST
భువనగిరి పట్టణం ఎల్బీనగర్‌లో జనావాసాల మధ్య ఉన్న సుమారు 650 గజాల మునిసిపల్ స్థలంపై కొద్దిమంది కన్నేశారు.

ప్రజల ఫిర్యాదుతో స్వాధీనం చేసుకున్న అధికారులు
భువనగిరి టౌన్, నవంబరు 26: భువనగిరి పట్టణం ఎల్బీనగర్‌లో జనావాసాల మధ్య ఉన్న సుమారు 650 గజాల మునిసిపల్ స్థలంపై కొద్దిమంది కన్నేశారు. ఈ మేరకు గతంలో మునిసిపాలిటీ నిర్మించిన ప్రహారీ గోడను తొలగించి సిమెంట్ ప్లేట్స్‌తో నూతన ప్రహారీని నిర్మిస్తుండగా గమనించిన స్థానికులు ఆక్రమణ యత్నాలపై మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని మునిసిపల్ స్థలంగా పేర్కొంటూ బోర్డు నాటడండంతో కబ్జాదారులు వెనక్కి తగ్గారు. ఆక్రమణకు యత్నించిన స్థలంలో గతంలో సామూహిక మరుగుదొడ్లు ఉండేవి. అనంతరం సుమారు 8ఏళ్ల క్రితం సామూహిక మరుగుదొడ్లను ఆ స్థలాన్ని ఆ పరిసరాలకు డంపింగ్ యార్డుగా వినియోగించేందుకు నిర్మించారు. కానీ డంపింగ్ యార్డు ఏర్పాటుపై స్థానికులు వ్యతిరేకత తెలపడంతో నేటి వరకు నిరుపయోగంగా ఉన్నది. దీంతో ఇప్పటి మార్కెట్ ప్రకారం సుమారు రూ.50లక్షల విలువైన సదరు స్థలంపై కన్నేసిన కొద్ది మంది అక్రమార్కులు ఆ స్థలంలో తమ పట్టా భూమి ఉందని పేర్కొంటూ నిరుపయోగంగా ఉన్న డంపింగ్ యార్డు ప్రహారీని కూల్చివేసి నూతన ప్రహారీ నిర్మాణ పనులు చేపట్టారు. పైగా ఖరీదైన ఆ స్ఠలాన్ని విక్రయించేందుకు ప్రయత్నాలు చేసినట్లు ప్రచారంలోకి వచ్చింది. దీంతో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు ఖరీదైన ఆ స్థలాన్ని సందర్శించి, ప్రహరీ నిర్మాణ పనులను అడ్డుకొని మునిసిపల్ స్థలంగా పేర్కొంటూ బోర్డు నాటి స్వాధీనం చేసుకున్నారు.
కమ్యూనిటీ హాల్ నిర్మించాలి
ఆక్రమణకు గురవుతున్న స్థలాన్ని మునిసిపాలిటీ స్వాధీనం చేసుకుని అద్దెదారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు బీసుకుంట్ల సత్యనారాయణ, బెండ లాల్‌రాజ్, కూర వెంకటేష్ తదితరులు గురువారం కలెక్టర్, ఆర్డీవో, మునిసిపల్ కమిషనర్‌కు వేర్వేరుగా వినతిపత్రం అందజేశారు. ఆక్రమణదారులు నిర్మించిన ప్రహరీని తొలగించి మునిసిపల్ స్థలాన్ని పరిరక్షించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అలాగే కబ్జాకు పాల్పడుతున్న స్థలాన్ని మునిసిపాలిటీ స్వాధీనం చేసుకొని స్థానికుల ఆవసరాల మేరకు కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ఆ వార్డు కౌన్సిలర్ మాయ దశరథ మునిసిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.