వ్యాక్సిన్‌ పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-12-26T05:30:00+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి ఉమ్మడి జిల్లాలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా, మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేశారు.

వ్యాక్సిన్‌ పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు

పోలింగ్‌ బూత్‌ల మాదిరిగా ఏర్పాట్లు

జనవరి 2వ వారం నుంచి ప్రక్రియ?

మొదటి కేటగిరీలో 20,100 మంది గుర్తింపు

ఉమ్మడి జిల్లాలో 6వేల మందికి శిక్షణ

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ)

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి ఉమ్మడి జిల్లాలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా, మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లా కమిటీ చైర్మన్లుగా జడ్పీ చైర్మన్లు, కన్వీనర్‌లుగా కలెక్టర్లు ఉంటారు. మూడు జిల్లాల్లో డిస్ట్రిక్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీల సమావేశాలు, ఆరోగ్య సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయింది. తొలి విడతలో 5లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించనుండగా, వారిని నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఇందులో కేటగిరి-1లో వ్యాక్సిన్‌ వేసే జాబితాను సిద్ధం చేసి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. జనవరి 2వ వారంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కరోనా వ్యాక్సిన్‌ తీసుకునేవారిని నాలుగు కేటగిరీలుగా విభజించారు. తొలి కేటగిరిలో ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లోని వైద్యులు, నర్సింగ్‌, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలుత 20,100 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించి వైద్యశాఖకు చెందిన 6వేల మంది సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తయింది. ఇక రెండో కేటగిరీలో ఉన్న పోలీసులు, పురపాలిక, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సిన్‌ వేస్తారు. మూడో కేటగిరీలో 50 ఏళ్లు నిండినవారు, నాలుగో కేటగిరీలో 50 ఏళ్లలోపు వయసు ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్‌ ఇస్తారు. తొలి విడత ముగిసిన తరువాత రెండో విడత వారికి టీకాలు వేస్తారు. ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసే పోలింగ్‌ బూత్‌ల మాదిరిగానే వ్యాక్సిన్‌ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.


వ్యాక్సిన్‌ పంపిణీకి నాలుగు గదులు

వ్యాక్సిన్‌ పంపిణీ కేంద్రాల్లో నాలుగు గదులు ఉంటా యి. మొదటి గదిలో పోలీస్‌ సిబ్బంది ఉంటారు. రెండో గదిలో డాటా నమోదు ఆపరేటర్‌గా రెవెన్యూ సిబ్బంది ఉంటారు. వీరు గుర్తింపు కార్డు (ఆధార్‌, ఓటర్‌, రేషన్‌, ఉపాధి జాబ్‌ కార్డ్‌)ను పరిశీలించి మూడో గదికి పంపిస్తారు. మూడో గదిలో ఇద్దరు వైద్య సిబ్బంది వ్యాక్సిన్‌ను ఇస్తారు. నాలుగో గదిలో ఓ డాక్టర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తిని అరగంటపాటు పర్యవేక్షిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 520 కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కేంద్రాలకు నిరంతంరం విద్యుత్‌ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలలు, ఫంక్షన్‌ హాళ్లను వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఎంపిక చేస్తున్నారు. ప్రతి బూత్‌లో రోజుకు వంద మందికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇస్తారు. ఉదయం 9 గంటల నుంచి సా యంత్రం 5 గంటల వరకు వ్యాక్సిన్‌ వేస్తారు. అందులో నమోదైతేనే వ్యాక్సిన్‌ పంపిణీ ఉంటుంది.


వ్యాక్సిన్‌ నిల్వకు 80 కోల్డ్‌ చైన్ల ఏర్పాట్లు

కరోనా వ్యాక్సిన్‌ను భద్రపరిచేందుకు 2 నుంచి 8 డిగ్రీల వాతావరణం ఉండేలా ఉమ్మడి జిల్లాలో 80 కోల్డ్‌చైన్లు ఏర్పాటు చేశారు. 1600 ఐస్‌ బాక్స్‌లు కొత్తవి ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు చేరాయి. వీటితోపాటు పోలియో టీకాలు నిల్వచేసే బాక్సులను వినియోగించే అవకాశం ఉంది. జనరల్‌ ఆస్పత్రితోపాటు, జిల్లా కేంద్ర ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, పీహెచ్‌సీల్లో వీటిని నిల్వ ఉంచుతారు. వ్యాకిన్‌ ఇచ్చే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తయింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తిని అరగంట పాటు కేంద్రంలోనే కూర్చోబెడతారు. ఎమైనా దుష్ఫ్రభావాలు ఎదురైతే వెంటనే ఇచ్చే ఇంజక్షన్‌ ఐఈఎ్‌ఫఐ (ఆఫ్టర్‌ ఈవెంట్‌ ఆఫ్‌దా ఫాలోడ్‌ ఇమ్యూనైజేషన్‌) కిట్‌ ప్రతి కేంద్రంలో అందుబాటులో ఉంటుంది. ఇంజక్షన్‌ చేశాక, అక్కడున్న వైద్యులు రియాక్షన్‌ స్వల్పంగా ఉందా, తీవ్రంగా ఉందా గుర్తిస్తారు. స్వల్పంగా ఉంటే అక్కడే చికిత్స చేస్తారు. తీవ్రంగా ఉంటే 108 సహాయంతో ప్రధాన ఆస్పత్రికి తరలిస్తారు. రియాక్షన్‌ వచ్చిన వారికి చికిత్స చేసేందుకు ప్రత్యేక వైద్య బృందాలు అంతటా అందుబాటులో ఉంటాయి. ఎలాంటి రియాక్షన్‌ లేని వారిని ఇళ్లకు పంపి ఆ తరువాత అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తల పర్యవేక్షణలో ఉంచుతారు. వ్యాక్సిన్‌ ఇచ్చే వారి పేర్లను కొవిన్‌ యాప్‌ ద్వారా నమోదు చేస్తున్నారు.


వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు : ఎ.కొండల్‌రావు, నల్లగొండ జిల్లా వైద్యాధికారి

భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ కొవిడ్‌ వ్యాక్సిన్‌ రూపొందిస్తోంది. ఈ సంస్థ మూడు దశల పరీక్షల అనంతరం వ్యాక్సిన్‌ను సిద్ధం చేసింది. ఒక వ్యక్తికి రెండు దశల్లో వ్యాక్సిన్‌ ఇస్తాం. రెండింటి మధ్య సమయం అది రెండు వారాలా లేక నాలుగు వారాలా అనేది ఇంకా నిర్ణయించలేదు. వ్యాక్సిన్‌ ద్రవరూపంలో ఉంటుంది. ఒక ఎంఎల్‌ కండరాలకు ఇస్తాం. వ్యాక్సినేషన్‌ అమలుకు జిల్లా, మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటయ్యాయి. డీఐవో (డిస్ట్రిక్‌ ఇమ్యూనైజేషన్‌ ఆఫీసర్‌) ఆధ్వర్యంలో సెంట్రల్‌ రిఫ్రిజిరేటర్‌ స్టోర్‌ ఉంటుంది. వ్యాక్సిన్‌ నిల్వ, డోసులను ఆయనే పర్యవేక్షిస్తారు. అయితే ఇంగ్లాండ్‌ నుంచి వచ్చిన వారిలో సెకండ్‌ వేరియంట్‌ ఆనవాళ్లు ఉండే అవకాశం ఉంది. అది నిర్ధారణ జరిగితే ప్రస్తుతం ఇచ్చే వ్యాక్సిన్‌ ఏ మేరకు పనిచేస్తుందో తేలలేదు. అది తేలితేగానీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


కేతేపల్లిలో కలకలం

కేతేపల్లి: కేతేపల్లి మండల పరిధిలోని ఓ గ్రామానికి బ్రిటన్‌ నుంచి ఒకరు రాగా, అతడికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో కలకలం రేగింది. బ్రిటన్‌లో కరోనా కొత్త వైరస్‌ స్ట్రెయిన్‌ ఉధృతం కావడంతో అప్రమత్తమైన వైద్యులు అతడికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. అది స్ట్రెయిన్‌ వైరస్‌ అవునో కాదో నిర్ధారించేందుకు స్వాబ్‌ నమూనాలను పుణె ల్యాబ్‌కు పంపించారు. అతడి కుటుంబ సభ్యులు నలుగురికి పరీక్షలు నిర్వహించగా, నెగటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. వారిని వైద్యులు హోంక్వారంటైన్‌ చేశారు. ఇదిలా ఉండగా, బ్రిటన్‌ నుంచి వచ్చిన అతడి ప్రైమరీ కాంటాక్టులను 14మందిని గుర్తించి శనివారం కరోనా పరీక్షల నిమిత్తం నల్లగొండకు పంపించినట్టు వైద్యులు తెలిపారు.

Updated Date - 2020-12-26T05:30:00+05:30 IST