గుంతలో పడి యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-12-07T05:22:08+05:30 IST

ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ఓ యువకుడు మృతి చెందాడు.

గుంతలో పడి యువకుడి మృతి

వలిగొండ, డిసెంబరు 6: ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. రామన్నపేట మండల కేంద్రానికి చెందిన బండిరాళ్ల పవన్‌ (19) మండలంలోని నాగారం మదిర ఖమ్మగూడెం సమీపంలో ద్విచక్రవాహనంపై వెళుతూ రోడ్డు పక్కనే ఉన్న నీటిగుంతలో పడ్డాడు. విషయాన్ని ఎవరూ గమనించకపోవడంతో కొద్దిసేపటికి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని  మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

హైనాల దాడిలో 30 గొర్రెలు..

చౌటుప్పల్‌ రూరల్‌: చౌటుప్పల్‌ మండలం ఎనగంటితండా శివారు రాచకొండ గుట్టల్లో హైనాల దాడిలో 30గొర్రెలు మృత్యువాతపడ్డాయి. తండాకు చెందిన మంగ్యానాయక్‌ వ్యవసాయబావి వద్ద ఉన్న గొర్రెల మందపై శనివారం రాత్రి హైనాలు దాడి చేశాయి. మందలోని 30 గొర్రెలను హతమార్చగా, మరో 20 గొర్రెలను గాయపరిచాయి. దాదాపు రూ.2లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు మంగ్యా నాయక్‌ తెలిపాడు. సంఘటనా స్థలాన్ని అటవీశాఖ అధికారి వెంకట్‌రాములు సందర్శించి పంచనామా నిర్వహించారు. బాధితుడిని ప్రభుత్వం ఆదుకుంటుందని ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి తెలిపారు. 


పాడి గేదె అపహరణ

వలిగొండ, డిసెంబరు 6: గుర్తుతెలియని వ్యక్తులు పాడి గేదె, లేగ దేడను అపహరించుకుపోయారు. మండలంలోని దుప్పల్లి గ్రామానికి చెందిన రైతు బాసవాడ సాయిలు తన పొలం వద్ద పశువుల కొట్టంలో పాడిగేదె, లేగ దూడను కట్టేసి ఇంటికి వచ్చాడు. శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వాటిని అపహరించుకు వెళ్లారు. వాటి విలువ సుమారు రూ.60వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని సాయిలు కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివనాగప్రసాద్‌ తెలిపారు. 


రేషన్‌ బియ్యం పట్టివేత : ఇద్దరిపై కేసు

రాజాపేట, డిసెంబరు 6: రాజాపేట మండలం నెమిల క్రాస్‌రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని రాజాపేట పోలీసులు ఆదివారం సాయంత్రం పట్టుకొని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. దూదివెంకటాపూర్‌ వైపు నుంచి పుట్టగూడెం తరలిస్తున్న వాహనంలో 15 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. వాహనంతోపాటు బియ్యాన్ని సీజ్‌చేసి పుట్టగూడెం గ్రామానికి చెందిన మోడావత్‌ సురేష్‌, మోడావత్‌ నమాలపై కేసు నమోదు చేసినట్లు రాజాపేట ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. 


ఆటో, టిప్పర్‌ ఢీ : ఒకరికి గాయాలు

ఆత్మకూరు(ఎం), డిసెంబరు 6: మోటకొండూరు మండలం కొండాపురం–ముత్తిరెడ్డిగూడెం గామాల మధ్య ఆదివారం ఆటో, టిప్పర్‌ ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం భువనగిరినుంచి వస్తున్న టిప్పర్‌, మోత్కూరు నుంచి హైదరాబాద్‌  వెళుతున్న ఆటో కొండాపురం–ముత్తిరెడ్డిగూడెం గ్రామాల మధ్య ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో దేవరుప్పల మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ ఉమేష్‌ గాయపడ్డాడు. కాగా ఆటోలో ఉమేష్‌ ఒక్కడే ఉండడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఉమేష్‌ను చికిత్సకోసం 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.  

Read more