ఇట్లనే చేస్తే ఆత్మహత్యకు పాల్పడటం ఖాయం

ABN , First Publish Date - 2020-12-11T05:47:23+05:30 IST

‘మమ్మల్ని ఇబ్బంది పెట్టకు, ఇట్లనే చేస్తే ఇదే కార్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడడం ఖాయం’ అని పాండ్యానాయక్‌తండా సర్పంచ్‌ బిక్షంనాయక్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇట్లనే చేస్తే ఆత్మహత్యకు పాల్పడటం ఖాయం
ఎంపీవో గోపికి దండం పెడుతున్న పాండ్యానాయక్‌తండా సర్పంచ్‌ భిక్షంనాయక్‌

ఎంపీవో తీరుపై సర్పంచ్‌ల ఆగ్రహం

చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

చివ్వెంల, డిసెంబరు 10: ‘మమ్మల్ని ఇబ్బంది పెట్టకు, ఇట్లనే చేస్తే ఇదే కార్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడడం ఖాయం’ అని పాండ్యానాయక్‌తండా సర్పంచ్‌ బిక్షంనాయక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జరిగిన మండల సమావేశంలో సర్పంచ్‌లు ఎంపీవో గోపి తీరుపై సర్పంచ్‌లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సర్పంచులందరూ ఎంపీవోను నిలదీయగా సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎంపీవో పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక గుండెపోటుకు గురవుతానేమోనని సర్పంచ్‌ బిక్షంనాయక్‌ గుండె పరీక్ష చేయించుకుంటూ దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టుచేసి సమావేశానికి హాజరయ్యాడు. ప్రతి పనిలో జోక్యం చేసుకుంటూ అర్ధరాత్రి, తెల్లవారకముందే తమకు ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్న ఎంపీవో గోపిపై చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు కోరారు. కావాలనే ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. సమావేశం ముగిసిన తర్వాత మాట్లాడుతామని ఎంపీపీ కుమారి కోరడంతో శాంతించారు. సమావేశం జరుగుతున్నపుడు ఎంజీనగర్‌తండాకు చెందిన కొందరు వ్యక్తులు సర్పంచ్‌ కమల్‌నాధసింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి పెట్రోల్‌ పోసుకున్నాడు. ఏదైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. సమావేశంలో ఎంపీపీ ధరావత్‌ కుమారి, జడ్పీటీసీ భూక్యా సంజీవనాయక్‌, వైస్‌ఎంపీపీ జూలకంటి జీవన్‌రెడ్డి, తహసీల్దార్‌ శేషగిరిరావు, ఎంపీడీవో జమలారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మారినేని సుదీర్‌రావు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-11T05:47:23+05:30 IST