ఉమ్మడి జిల్లాకు రూ.2.10 కోట్ల ఆదాయం

ABN , First Publish Date - 2020-02-12T06:24:51+05:30 IST

మేడారంలో సేవలం దించినందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన బస్సులు, సిబ్బందికి రూ.2.10కోట్ల ఆదాయం

ఉమ్మడి జిల్లాకు రూ.2.10 కోట్ల ఆదాయం

 నల్లగొండ ఆర్బన్‌, ఫిబ్రవరి 11: మేడారంలో సేవలం దించినందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన బస్సులు, సిబ్బందికి రూ.2.10కోట్ల ఆదాయం వచ్చింది. జాతరకు వెళ్లిన ఆర్టీసీ బస్సులు తిరిగి జిల్లాకు చేరుకున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఏడు డిపోల్లో కలిపి 350 బస్సులు మేడారం జాతరకు తరలించారు. 700మంది డ్రైవర్లు, 200మంది కండక్టర్లు, 50మంది సూపర్‌వైజర్లు, ఏడుగురు అధికారులు జాతర విధుల్లో పాల్గొన్నారు.

ఆరురోజులపాటు బస్సులు, సిబ్బంది మేడారం జాతరలో సేవలందించారు. జాతరలో సేవలందించినందుకు ఒక్కో బస్సుకు రోజుకు రూ.12వేలు ములుగు జిల్లా అధికారులు చెల్లించనున్నారు. ఆర్టీసీ అధికారులు తెలిపిన లెక్కల ప్రకారం ఉమ్మ డి జిల్లాకు చెందిన బస్సులు, సిబ్బంది సేవలకు రూ.2.10కోట్ల ఆదాయం వచ్చింది. రోజుకు ఒక్కో బస్సుకు చెల్లించే రూ.12వేలల్లో సుమారు రూ.10వేల వరకు డీజిల్‌, సిబ్బందితో పాటు ఇతర ఖర్చులు పోను ఒక్కో బస్సుకు రూ.2వేల మిగిలినట్లు ఆర్టీసీ ఆధికారులు తెలిపారు. ఈ లెక్కన ఖర్చులు పోను రోజుకు రూ.7లక్షల చొ ప్పున ఆరు రోజులకు రూ.42 లక్షలు సంస్థకు లాభం చేకూరింది.

బస్సులు సగానికి పైగా మేడారం జాతరకు తరలించడంతో ఉమ్మడి జిల్లాలో ఏడు డిపోల పరిధిలో చాలా రూట్లలో బస్సు సర్వీసులను తగ్గించారు. దీంతో ప్రయాణికులు బస్సులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జాతర ముగియడంతో బస్సులన్నీ యథావిధిగా ఆయా డిపోల పరిధిలోకి చేరుకొని రూట్లకు వెళ్లనున్నాయి. మేడారం జాతరలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించిన సిబ్బంది, అధికారులకు ఆర్టీసీ రీజనల్‌ మేనేజరు సీహెచ్‌. వెంకన్న అభినందించారు.  

Updated Date - 2020-02-12T06:24:51+05:30 IST