తప్పిన సాగు లెక్కలు

ABN , First Publish Date - 2020-12-20T05:29:26+05:30 IST

పంటల సాగు, దిగుబడిని అంచనావేయడంలో వ్యవసాయశాఖ సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారు. వారి అంచనాకు, వాస్తవానికి మధ్య చాలా తేడా ఉంది.

తప్పిన సాగు లెక్కలు

ధాన్యం దిగుబడి అంచనా 10.40లక్షల మెట్రిక్‌ టన్నులు

5లక్షల మెట్రిక్‌ టన్నులు కూడా రాని దిగుబడి

67 కొనుగోలు కేంద్రాల మూత

వారంలో మొత్తం బందయ్యే అవకాశం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ)

పంటల సాగు, దిగుబడిని అంచనావేయడంలో వ్యవసాయశాఖ సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారు. వారి అంచనాకు, వాస్తవానికి మధ్య చాలా తేడా ఉంది. దిగుబడి పెరిగిందన్న అంచనా కారణంగా ధాన్యం విక్రయించేందుకు రైతులు ఒక్కసారిగా పోటెత్తారు. మిల్లర్లు ఇదే అదునుగా ధర తగ్గించారు. ఆ తరువాత కలెక్టర్‌,ఎస్పీ జోక్యం, టోకెన్ల విధానం అమలవడం, ఏదో ఒక చోట రైతులు ఆందోళనలు చేయడం వంటివి వానాకాలం సీజన్‌లో చోటుచేసుకున్నాయి. భారీ అంచనాలతో మిల్లర్లు, అధికార యంత్రాంగం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయగా, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉండటంతో మిల్లర్లు బయటి ప్రాంతాల నుంచి ధాన్యం దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.

నియంత్రిత సాగు లెక్క తప్పింది. వానాకాలంలో రైతులు సన్న రకాలు ఎక్కువగా సాగు చేశారు. అవి చేతికొచ్చినప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు సన్నాల విక్రయానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీగా మార్కెట్‌కు వస్తుందనుకున్న దొడ్డు ధాన్యం కొనుగోళ్లు అప్పుడే పూర్తయ్యాయి. దీంతో కొనుగోలు కేంద్రాలను మూతపడుతున్నాయి. వానాకాలంలో నల్లగొండ జిల్లాలో 10లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచ నా వేసింది. అందులో 4.5లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డు ధాన్యం ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావల్సి ఉంది. అయితే జిల్లాలో 180 ఐకేపీ, పీఏసీఎస్‌, వ్యవసాయ మార్కెట్ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా, వీటిలో 46 కేంద్రాల్లో సన్నా లు కొనుగోలు చేశారు. ఈనెల 16 వరకు 2,48,656 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఈ కేంద్రాల్లో కొనుగోలు చేశారు. 4లక్షల మెట్రిక్‌ టన్నులు మిల్లర్లు కొనుగోలు చేసి ఉంటారని అంచనా. ప్రస్తుతం దొడ్డురకం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావడం నిలిచిపోవడంతో జిల్లా వ్యాప్తంగా 67 కేంద్రాలను మూసి వేశారు. అయితే అధికారులు గ్రామస్థాయికి వెళ్లి ఏ రైతు ఎన్ని ఎకరాల్లో సన్నాలు, దొడ్డు రకాలు సాగు చేశారో క్షేత్రాస్థాయిలో వివరాలు సేకరించకుండా, గత ఏడాది ఉన్న అంకెలకు పది శాతం పెంచి ఉజ్జాయింపుగా లెక్కలు ఇవ్వడంతోనే అంచనాలు తప్పాయని రెవెన్యూశాఖ అధికారులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.


సన్నాల విక్రయానికి నానా ఇబ్బందులు

ప్రభుత్వం ప్రకటించిన నియంత్రిత సాగు విధానానికి అనుగుణంగా సన్నాలు సాగు చేసిన రైతులు ధాన్యం విక్రయానికి నానా కష్టాలు పడ్డారు. దిగుబడి వచ్చిన సమయంలో కేంద్రాలు అందుబాటులో లేవు. అదే సమయంలో అకాల వర్షాలతో ధాన్యం తడిసి నష్టపోయారు. ధాన్యం మొత్తం కొనుగోలు చేయలేమని మిల్లర్లు చేతులెత్తేయడంతో మద్దతు ధరకు తక్కువగానే రైతులు విక్రయించాల్సి వచ్చింది. బీపీటీ ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయలేదు. కేవలం పీఏసీఎస్‌ కేంద్రాల ద్వారా మండలానికి ఒకటి ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం బీపీటీ ధాన్యమే కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. దొడ్డు, సన్నాలు, బీపీటీ ధాన్యం సాగు చేసిన వారు మూడు ప్రాంతాలకు వెళ్లి విక్రయించాల్సి వచ్చింది. అధికారుల సమన్వయ లోపం, అంచనా సక్రమంగా లేకపోవడం వల్లే ఇన్ని సమస్యలు తలెత్తాయని ఆయకట్టు ప్రాంత రైతులతోపాటు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇప్పుడు బిల్లులు దిద్ది ఇస్తున్నాం : భాస్కరరావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే

లెక్కలు తప్పి నల్లగొండ, సూర్యాపేట రైతులు ఒక్కసారే మిల్లులకు వచ్చారు. అప్పుడు రైతులకు తక్కువ బిల్లు వేసిన వారికి ఇప్పుడు దిద్ది ఇస్తున్నాం. క్వింటాకు రూ.1700 బిల్లు ఇచ్చినవాటిని రూ.1800, రూ.1850 వేయిస్తున్నాం. ఇప్పుడు ఎవరొచ్చినా మిల్లర్లు క్వింటా రూ.2200 కొనుగోలు చేస్తారు. మిర్యాలగూడకు ఇప్పుడు బీహార్‌, చత్తీ్‌సఘడ్‌ నుంచి ధాన్యం రూ.2200 ధరకు దిగుమతి అవుతోంది.


అప్పులే మిగిలాయి : మెండె రామలింగం, రైతు, బాబాసాయిపేట

మూడెకరాల్లో వానాకాలంలో హె చ్‌ఎంటీ సన్నధాన్యం సాగుచేశా. వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో పైరుకు చీడపీడలు సోకాయి. గతంకంటే రెండుమార్లు అదనంగా పురుగు మందు పిచికారీ చేశా. మొత్తంగా ఎకరానికి రూ.28వేల పెట్టుబడి కాగా, 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. తేమ కారణంచూపి క్వింటా రూ.17వందలకే విక్రయించా. మూ డెకరాల్లో పండిన పంటకు రూ.18వేల ఆదాయం రాగా, ఆరుగాలం ఇంటిల్లిపాది చేసిన కష్టం, రోజువారీ తిండి అవసరాలకే సరిపోయాయి. అప్పులు అలాగే మిగిలాయి.


తుపాను, తెగుళ్లతో తగ్గిన దిగుబడి : శ్రీధర్‌రెడ్డి, జేడీఏ

తుపానుతోపాటు తెగుళ్ల కారణంగా ధాన్యం దిగుబడి తగ్గింది. అం చనాలకు అనుగుణంగా ఈమారు దిగుబడి రాలేదు. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో వర్షాలు సకాలంలో కురవడంతోపాటు చెరువులు, కుంటలు నిండాయి. మైనర్‌, మేజర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులతో పాటు బోరుబావుల కింద రైతులు భారీగా వరి సేద్యం చేశారు. అయితే అకాల వర్షాల ప్రభావం పడింది.

Updated Date - 2020-12-20T05:29:26+05:30 IST