విజ్ఞాన కేంద్రంగా నడిగూడెం కోట

ABN , First Publish Date - 2020-09-06T10:36:05+05:30 IST

చదువులకు మించిన సంపద లేదు, భావితరాలకు నడిగూడెం కోట విజ్ఞాన కేంద్రంగా మారుతుందని వ్యవసాయ ..

విజ్ఞాన కేంద్రంగా నడిగూడెం కోట

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి


నడిగూడెం, సెప్టెంబరు 5: చదువులకు మించిన సంపద లేదు, భావితరాలకు నడిగూడెం కోట విజ్ఞాన కేంద్రంగా మారుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. నడిగూడెం రాజవారికోటను డాక్రీ సంస్థ నిర్వహిస్తున్న కేంద్ర గ్రంథాలయాన్ని ఆయన శనివారం సందర్శించారు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య నివాసాన్ని, కొమరరాజు వెంకటలక్ష్మణరాయ్‌ విజ్ఞానచంద్రిక సాహిత్య సేవలను తెలుసుకున్నారు.


శ్రీకృష్ణదేవరాయలు, ప్రతాపరుద్రుడు కాలంనాటి తాళపత్ర గ్రంథాలు, శాసనాలు, శతాబ్దాల నాటి గ్రంథాలు, పుస్తక సంకలనాలు, చారిత్రక పరిశోధనలు భద్రపరిచి భావితరాలకు అందించేలా డాక్రీ సంస్థ చేస్తున్న కృషిని కొనియడారు. నడిగూడెం, వనపర్తి రాజుల వంశీకుల మధ్య వారసత్వ సంబంధాలతో ఆగస్టు 9న నిర్వహించే సురవరం ప్రతా్‌పరెడ్డి సంస్మరణ సభకు పురవాస్తు పరిశోధకుడు డాక్రీ ఎండీ కుర్ర జితేందర్‌బాబును స్వయంగా ఆహ్వానించేందుకు ఇక్కడికి వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఆయన వెంట డాక్రీ డైరెక్టర్‌ హిమబిందు, జడ్పీటీసీ బానాల కవిత నాగరాజు, ఉప్పల యుగంధర్‌రెడ్డి, సుంకరి అజయ్‌కుమార్‌, గోవర్ధన్‌, బలరాం ఉన్నారు.


‘ఆంధ్రజ్యోతి’ సాహితీ కథనంపై ముచ్చట

‘ఆంధ్రజ్యోతి’లో ప్రధాన పత్రిక ‘వివిధ’లో ఆగస్టు 17న ప్రచురించిన సుంకిరెడ్డి నారాయణరెడ్డి రచించిన ‘తరువాత ఏమైతది’ విషయాన్నిపై సాహితీ ప్రేమికుడు బలరాం ప్రస్తావించగా మంత్రి ఆ కథనాన్ని చదివి జితేంద్రబాబుతో పుస్తక విశేషాలను తెలుసుకున్నారు.


ఎస్సారెస్పీ జలాలతో సస్యశ్యామలం

మునగాల: గోదావరి జలాలను ఒడిసిపట్టి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. నడిగూడెంలో నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణంలో మండల కేంద్రానికి చెందిన తన స్నేహితుడు, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుడు ఉప్పల యుగంధర్‌రెడ్డి నివాసంలో శనివారం కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మాట్లాడారు. ఆయన వెంట సర్పంచ్‌ చింతకాయల ఉపేందర్‌, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు సుంకర అజయ్‌కుమార్‌, నల్లపాటి శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కందిబండ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-09-06T10:36:05+05:30 IST